హైద‌రాబాద్‌లో ఈ మార్గంలో శాశ్వ‌తంగా వ‌న్‌వే రూట్‌..? ట్రాఫిక్ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టేలా

Published : Nov 07, 2026, 06:03 PM IST

Hyderabad: హైదరాబాద్‌లో పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు మరో కీలక చర్యకు సిద్ధమవుతున్నారు. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన లక్డీకాపూల్ పరిసరాల్లో వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు.

PREV
15
స్వయంగా రంగంలోకి దిగిన సీపీ సజ్జనర్

లక్డీకాపూల్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. ద్విచక్రవాహనంపై వివిధ జంక్షన్లను పరిశీలించి, అక్కడి రహదారుల పరిస్థితి, వాహనాల రాకపోకలను గమనించారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బందితో మాట్లాడి ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్, డీసీపీ అవినాశ్‌లతో కలిసి ప్రతిపాదిత మార్గాల్లో వన్‌వే విధానం అమలుకు ఉన్న అవకాశాలను సమీక్షించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలనే అంశంపైనా చర్చించారు. ఇటీవ‌ల కేబీఆర్ పార్క్ ద‌గ్గ‌ర వ‌న్‌వే విజ‌య‌వంత‌మైన నేప‌థ్యంలో అధికారులు ఈ దిశ‌గా అడుగులు వేస్తున్నారు.

25
ఈ మార్గాల్లో వాహనాల దారి మళ్లింపు

కొత్త ప్రతిపాదన ప్రకారం ఓల్డ్ కంట్రోల్ రూమ్ నుంచి రవీంద్రభారతి మీదుగా ఇక్బాల్ మినార్ వైపు వెళ్లే వాహనాలకు నేరుగా అనుమతి ఉండదు. సికింద్రాబాద్ వైపు వెళ్లేవారు హెచ్‌డీఎఫ్‌సీ జంక్షన్, పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్, ఇక్బాల్ మినార్, సచివాలయం జంక్షన్ మీదుగా ప్రయాణించాల్సి ఉంటుంది. మరోవైపు నిరంకారి జంక్షన్ నుంచి ఓల్డ్ కంట్రోల్ రూమ్ వైపు వచ్చే వాహనాలను పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద మళ్లిస్తారు. అక్కడి నుంచి ఇక్బాల్ మినార్ మీదుగా కుడివైపు తిరిగి రవీంద్రభారతి మార్గంలో ఓల్డ్ కంట్రోల్ రూమ్ చేరుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు.

35
సచివాలయం, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ నుంచి వచ్చే వారికి కొత్త రూట్

సచివాలయం జంక్షన్, తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ వైపు నుంచి పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లే వాహనాలకు కూడా మార్గాన్ని మార్చాలని భావిస్తున్నారు. ఈ వాహనాలు ఇక్బాల్ మినార్ నుంచి రవీంద్రభారతి వైపు వెళ్లాలి. అక్కడి నుంచి ఓల్డ్ కంట్రోల్ రూమ్ వద్ద యూటర్న్ తీసుకుని అసెంబ్లీ గేట్ నంబర్ 3, రవీంద్రభారతి, హెచ్‌డీఎఫ్‌సీ జంక్షన్ మీదుగా పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకునేలా రూట్‌ను రూపొందించారు. మసాబ్ ట్యాంక్ వైపు వెళ్లే వాహనాలకు ద్వారకా హోటల్, కామత్ హోటల్ రోడ్డు మీదుగా ప్రత్యామ్నాయ మార్గం కల్పించే ప్రతిపాదన కూడా ఉంది. చాలాకాలంగా మూసివేసి ఉన్న గన్ పార్క్ రోటరీ యూటర్న్‌ను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు పరిశీలిస్తున్నారు.

45
అధికారుల అనుమతుల తర్వాతే ప్రయోగాత్మక అమలు

వన్‌వే విధానాన్ని వెంటనే అమలు చేయకుండా ముందుగా రవాణా నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాలని ట్రాఫిక్ విభాగం నిర్ణయించింది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు, విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. రహదారుల పరిస్థితి, అవసరమైన మౌలిక సదుపాయాలు, ఇతర శాఖల పరిధిలో ఉన్న పనులను పరిశీలిస్తారు. ప్రభుత్వ తుది అనుమతి వచ్చిన తర్వాత ఎంపిక చేసిన మార్గాల్లో ప్రయోగాత్మకంగా వన్‌వే విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ సమయంలో వాహనదారుల నుంచి అభిప్రాయాలు సేకరించి, అవసరమైన మార్పులు చేస్తారు.

55
ఇతర రద్దీ ప్రాంతాలకూ విస్తరించే యోచన

లక్డీకాపూల్ పరిసరాల్లో ప్రతిపాదిస్తున్న మార్పులు విజయవంతమైతే నగరంలోని మరికొన్ని రద్దీ కూడళ్లలోనూ ఇలాంటి ట్రాఫిక్ విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కేబీఆర్ పార్క్ పరిసరాల్లో అమలవుతున్న వన్‌వే విధానం ద్వారా ట్రాఫిక్ నిర్వహణకు లభించిన అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. కొత్త మార్గాల వల్ల వాహనాల మధ్య ఎదురెదురు రాకపోకలు తగ్గడంతో పాటు జంక్షన్ల వద్ద వేచి ఉండే సమయం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రయోగాత్మక అమలులో ఎదురయ్యే సమస్యలు, ప్రజల నుంచి వచ్చే సూచనలను బట్టి తుది మార్గదర్శకాలను రూపొందించనున్నారు. వాహనదారులు కొత్త ట్రాఫిక్ నిబంధనలను గమనించి సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories