Hyderabad: రూ. 12 వేల కోట్లతో అద్భుత ప్రాజెక్ట్.. హైదరాబాద్ నుంచి గోవాకు భారీగా తగ్గనున్న దూరం

Published : Feb 22, 2026, 10:38 AM IST

Hyderabad: వారాంతం వచ్చిందంటే చాలు హైదరాబాద్ నుంచి గోవా వెళ్లే వారు చాలా మంది ఉంటారు. రైలు, విమాన సదుపాయాలు ఉన్నా చాలా మంది రోడ్డు మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే త్వరలోనే హైదరాబాద్ నుంచి గోవాల మధ్య ప్రయాణ సమయం మరింత తగ్గనుంది. 

PREV
15
హైదరాబాద్–పనాజీ ఎకనామిక్ కారిడార్‌కు వేగం

గోవా పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం. అయితే హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో గోవాకు చేరుకోవడానికి ప్రస్తుతం సుమారు 15 గంటలకు పైగా సమయం పడుతోంది. ఈ ప్రయాణాన్ని గణనీయంగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్‌మాల పరియోజన కింద హైదరాబాద్–పనాజీ ఎకనామిక్ కారిడార్ (EC-10) నిర్మాణాన్ని వేగవంతం చేసింది. నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా (ఎంపిక చేసిన చోట్ల మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్ ఉంటాయి) రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు దక్షిణ భారత రవాణా రంగంలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. మొత్తం రూ.12,000 కోట్ల వ్యయంతో అమలవుతున్న ఈ కారిడార్ పూర్తయితే హైదరాబాద్–గోవా మధ్య దూరం దాదాపు 150 కిలోమీటర్ల వరకు తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

25
గ్రీన్ ఫీల్డ్ హైవేలు – మెరుగైన కనెక్టివిటీ

ప్రస్తుత పనాజీ–హుబ్లీ–కొప్పల్–రాయచూరు–మహబూబ్‌నగర్–హైదరాబాద్ మార్గానికి ప్రత్యామ్నాయంగా పనాజీ–బెలగావి–రాయచూరు–హైదరాబాద్ రూట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో పనాజీ–బెలగావి–రాయచూరు భాగాన్ని పూర్తిగా గ్రీన్ ఫీల్డ్ హైవేగా నిర్మిస్తున్నారు. ఈ మార్గం ద్వారా గోవా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మధ్య సరుకు రవాణా వేగవంతం అవుతుంది. ముఖ్యంగా బెలగావి–రాయచూర్ సెక్షన్‌లో భూసేకరణ దాదాపు పూర్తికాగా, హ్యామ్ (Hybrid Annuity Model) పద్ధతిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇది పూర్తయితే పనాజీ, బెలగావి, రాయచూర్, హైదరాబాద్ నగరాలు నేరుగా అనుసంధానమవుతాయి.

35
సూరత్–చెన్నై కారిడార్‌తో అనుసంధానం

రాయచూరును కేంద్రంగా చేసుకుని సూరత్ నుంచి చెన్నై వరకు నిర్మిస్తున్న ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా అకల్‌కోట్–రాయచూర్–కర్నూలు గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ రహదారి తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాను కూడా టచ్ అవుతుంది. కర్ణాటక–తెలంగాణ సరిహద్దులోని నందిన్నె, అయిజ వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఈ మార్గం హైదరాబాద్–పనాజీ కారిడార్‌తో కలవడంతో ప్రాంతీయ కనెక్టివిటీ మరింత బలపడనుంది.

45
NH-167 విస్తరణకు కేంద్రం ఆమోదం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) సమావేశంలో నేషనల్ హైవే-167 ను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు రూ.3,175.08 కోట్ల నిధులు మంజూరు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి గుడెబల్లూర్ వరకు 80.01 కిలోమీటర్ల మేర రహదారి విస్తరణ చేపడుతున్నారు. ఇందులో 36.8 కిలోమీటర్ల మేర బైపాస్‌లు, రీఅలైన్‌మెంట్లు నిర్మించి గ్రామాల మధ్య ట్రాఫిక్ సమస్యలను తగ్గించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టుతో నారాయణపేట్, మహబూబ్‌నగర్ జిల్లాలకు మెరుగైన రహదారి సదుపాయం లభించనుంది. ఇది NH-150, NH-167N వంటి జాతీయ రహదారులతో అనుసంధానమై రవాణాను సులభతరం చేస్తుంది.

55
ఆర్థికాభివృద్ధికి కొత్త దారులు

ప్రస్తుతం ఈ మార్గంలో రోజుకు సుమారు 17,991 వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నాలుగు లేన్ల విస్తరణ అత్యవసరంగా మారింది. ప్రాజెక్టులో సివిల్ పనులకు రూ.1,868.90 కోట్లు, భూసేకరణ, ఇతర ఖర్చులకు రూ.459.11 కోట్లు కేటాయించారు. నిర్మాణ దశలో సుమారు 14.4 లక్షల మందికి ప్రత్యక్షంగా, 17.9 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందని అంచనా. పీఎం గతి శక్తి కార్యక్రమం కింద ఈ హైవే లాజిస్టిక్ నోడ్స్, ఎకనామిక్ జోన్లతో అనుసంధానమవడం ద్వారా పరిశ్రమలకు ఊతం లభించనుంది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫార్మా క్లస్టర్లు, మెడికల్ SEZలకు ఇది వ్యూహాత్మక ప్రయోజనం కలిగించనుంది. మొత్తం మీద ఈ ఎకనామిక్ కారిడార్‌లు తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాల మధ్య రవాణా సమయాన్ని తగ్గించడమే కాకుండా వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమల అభివృద్ధికి బలమైన మౌలిక సదుపాయంగా నిలవనున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories