Published : Aug 03, 2025, 10:57 AM ISTUpdated : Aug 04, 2025, 11:58 AM IST
Ropeway Project Hyderabad: నాడు వజ్రాల వ్యాపారం నుంచి నేడు హైటెక్ సిటీ వరకు హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. అయితే ఇదే సమయంలో ట్రాఫిక్ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ మహానగరం ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ నగరాల్లో 41వ స్థానంలో ఉంది. జనాభా వేగంగా పెరుగుతున్న ఈ నగరంలో వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగి 85 లక్షల దాటింది. ఫలితంగా ట్రాఫిక్ సమస్య రోజు రోజుకీ మరింత తీవ్రంగా మారుతోంది. ఉద్యోగాలు, విద్య కోసం వెళ్లే ప్రజలు గంటల కొద్దీ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సి వస్తోంది. ఈ సమస్యను తగ్గించడంతో పాటు పర్యాటకాన్ని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రాజెక్టును ప్రణాళికలోకి తీసుకొచ్చింది.
DID YOU KNOW ?
రూ. 100 కోట్లతో
గోల్కొండ-కుతుబ్షాహి సమాధులు రోప్వే ప్రాజెక్ట్ 1.5 కిలోమీటర్ల పొడవులో రూ.100 కోట్లతో నిర్మించనున్నారు. ఈ రోప్‌వే అనుమతులు, సాంకేతిక గ్రౌండ్ వర్క్ పూర్తయిన తర్వాత పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మిస్తారు.
25
పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వేలు ఏర్పాటు
పర్యాటక శాఖ, యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (UMTA) సంయుక్తంగా రూపొందించిన ప్రతిపాదన ప్రకారం, హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వేలను ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో గోల్కొండ కోట నుంచి కుతుబ్‌షాహి టూంబ్స్ వరకు రోప్‌వే నిర్మించనున్నారు. తరువాత ట్యాంక్ బండ్, మీరాలం ట్యాంక్, సంజీవయ్య పార్కు, కొత్వాల్‌గూడ ఎకో పార్క్‌ల వద్ద కూడా ఈ సదుపాయాన్ని విస్తరించే ప్రణాళిక ఉంది.
35
రోప్‌వే ప్రత్యేకతలు
రోప్‌వేలో తీగలపై నడిచే బాక్స్ ఆకారపు వాహనాలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో బాక్స్‌లో 6 నుంచి 10 మంది వరకు ప్రయాణించవచ్చు. దీంతో రోడ్ ట్రాఫిక్ నుంచి విముక్తి పొందడంతో పాటు పర్యాటకులు ఒకే సమయంలో చారిత్రక ప్రదేశాలను సులభంగా దర్శించుకోగలరు. ముఖ్యంగా గోల్కొండ, కుతుబ్‌షాహి టూంబ్స్ వంటి ప్రదేశాల మధ్య ప్రయాణం గాల్లోనే తేలికగా పూర్తి చేయవచ్చు.
ఆలోచన అద్భుతంగా ఉన్నా ఇందులో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గోల్కొండ–కుతుబ్‌షాహి టూంబ్స్ మధ్య రోప్‌వే నిర్మాణంలో ఒక సవాల్ అని చెప్పాలి. ఈ మార్గంలో మిలిటరీ పరిధి ఉండటంతో అలైన్‌మెంట్ విషయంలో అధికారులు చర్చలు జరుపుతున్నారు. రక్షణ విభాగం అనుమతులు లభిస్తే నిర్మాణం త్వరగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
55
టూరిజం, ట్రాఫిక్ రెండింటికీ లాభం
రోప్‌వే ప్రాజెక్టు అమల్లోకి వస్తే రెండు లక్ష్యాలు సాధ్యమవుతాయి. పర్యాటకులకు సులభ ప్రయాణం అందించడంతో పాటు ట్రాఫిక్ ఒత్తిడి కూడా తగ్గుతుంది. విదేశీ, దేశీయ పర్యాటకులను ఆకర్షించే ఈ సదుపాయం నగర ప్రతిష్ఠను మరింత పెంచే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే హైదరాబాద్ టూరిజం రంగానికి ఇది గేమ్ ఛేంజర్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే గతంలో కూడా వరంగల్ లో రోప్ వే ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఇది ఇంకా కార్య రూపం దాల్చలేదు.