అనురాధ చౌదరి అనే మహిళ హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ ఫీజుల వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో కేవలం నర్సరీకే రూ.2,51,000 ఫీజు వసూలు చేస్తున్నారు.. ఏడాదికి నాలుగు విడతల్లో రూ.47,750 చొప్పున రూ.1,91,000 ట్యూషన్ ఫీజు, ఇన్స్టిట్యూషన్ ఫీజు పేరిట మరో రూ.11,250 చొప్పున నాలుగు విడతల్లో రూ.45,000 వసూలు చేస్తున్నారు. ఇక అడ్మిషన్ సమయంలో రూ.5,000, కాషన్ డిపాజిట్ పేరిట మరో రూ.10,000 పేరెంట్స్ నుండి తీసుకుంటున్నారు. ఇలా మొత్తంగా నర్సరీకి రెండున్నర లక్షలకు పైగానే ఫీజు డిమాండ్ చేస్తోంది సదరు విద్యాసంస్థ.
కేవలం ఆటలు ఆడించి, ఏబిసిడిలు నేర్చించేందుకు ఇంతింత ఫీజులా! అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నర్సరీ చదివించేందుకు నెలకు రూ.21,000 ఖర్చు చేయాల్సి వస్తోంది... ఇది ఓ సాధారణ ఉద్యోగి జీతంతో సమానం. సంపాదించిందంతా పిల్లల ఫీజుకే పోతే సామాన్యుడు బ్రతికేదెలా? కుటుంబాన్ని పోషించేదెలా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.