
Drunk and Drive : మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమే కాదు చట్టరిత్యా నేరం. డ్రంక్ ఆండ్ డ్రైవ్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రమాదాలు పెరిగిపోయాయి... చాలామంది మద్యంమత్తులో డ్రైవింగ్ చేసి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. కొన్నిసార్లు ఈ డ్రంక్ ఆండ్ డ్రైవ్ ప్రమాదాల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే తాగిన మైకంలో వాహనాలను నడిపేవారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు... భారీ జరిమానాలు, వాహనం సీజ్ చేయడంతో పాటు జైలు శిక్షలు కూడా వేస్తున్నారు.
పోలీసుల చర్యలతో డ్రంక్ ఆండ్ డ్రైవ్ కేసులు తగ్గాయి. కానీ ఇప్పటికీ కొందరు తాగి డ్రైవింగ్ చేస్తూ తనిఖీ చేపట్టిన పోలీసులతో వాగ్వాదానికి దిగిన సీరియస్ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక ఊపిరి బిగబడితే బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో పట్టుబడకుండా ఉంటామనుకుని చేసే వింత చేష్టలు, తాగిన మైకంలో పన్నీ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కొందరు కంటెంట్ క్రియేటర్స్ కేవలం డ్రంక్ ఇండ్ డ్రైవ్ వీడియోలతోనే ఛానల్ నడిపిస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ప్రజలు దీనిగురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని.
అయితే ఈ రచ్చంతా ఎందుకు… అసలు మందు తాగాక డ్రైవింగ్ చేయకపోతే సరిపోతుంది కదా అనుకునేవారు చాలామంది ఉన్నారు. మరోవైపు ఎంత తాగితే పోలీసులకు పట్టుడినా చర్యలుండవు? బ్రీత్ ఎనలైజర్ టెస్టులో పరిమితి కంటే తక్కువ పాయింట్స్ వస్తాయి? అనేది తెలుసుకుని దాన్ని ఫాలో కావాలనుకునేవారు మరికొందరు. మరి ఎంత తాగితే బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో పట్టుబడకుండా ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం.
చాలాదేశాల్లో మాదిరిగానే ఇండియాలో కూడా మద్యం సేవించి వాహనాలను నడపడం ద్వారా ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. దీంతో భారత ప్రభుత్వం ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంది. తాగి వాహనాలను నడిపేవారికి గుర్తించి శిక్షించేందుకు పోలీసులకు మరీముఖ్యంగా ట్రాఫిక్ సిబ్బందికి అధికారం కల్పించారు. మద్యం సేవించినవారిని గుర్తించి వారు మత్తులో ఉన్నారని నిర్దారించేందుకు అప్పటికప్పుడు ఓ టెస్ట్ ను నిర్వహించే ఏర్పాటు చేశారు... ఇదే బ్రీత్ ఎనలైజర్ టెస్ట్.
కేవలం శ్వాస ద్వారా ఎంత తాగారో చెప్పే పరికరాన్ని పోలీసులకు అందించారు. మద్యం సేవించినవారు గట్టిగా ఊపిరిని వదలడం ద్వారా ఈ పరికరం వారి రక్తంలోని ఆల్కహాల్ శాతాన్ని గుర్తిస్తుంది. ఈ పరికరం కొలతల ఆధారంగా ఎంత తాగారు? మద్యంమత్తు ఏ స్థాయిలో ఉంది? గుర్తిస్తారు. ఎక్కువగా మద్యం సేవించినట్లు తేలితే చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటారు పోలీసులు.
ఇది చాలామంది డౌట్... ఎంత తాగితే బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో పట్టుబడకుండా ఉంటారు? దీనికి హైదరాబాద్ పోలీస్ అధికారి జివి. రమణగౌడ్ క్లారిటీ ఇచ్చారు. ఓ వ్యక్తి ఎంత తాగితే బ్రీత్ టెస్ట్ లో తక్కువ పాయింట్లు వస్తాయో తెలిపారు. కానీ శరీరతత్వాన్ని బట్టి కూడా ఈ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ రిజల్ట్ ఆధారపడి ఉంటుందని పోలీస్ అధికారి వెల్లడించారు.
సాధారణంగా ఓ వ్యక్తి పెగ్ అంటే 60ML వరకు మద్యం సేవిస్తే బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో తక్కువ పాయింట్లు వస్తాయని రమణ గౌడ్ వెల్లడించారు. అయితే ఇది అందరికీ ఒకేలా ఉండదని... యాసిడిక్ బాడీ కలిగినవారికి ఇంత తాగినా ఎక్కువ పాయింట్లు వస్తాయని తెలిపారు. విస్కీ, రమ్ కంటే బీర్ తాగినవారికి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో మరింత ఎక్కువ పాయింట్లు వస్తాయని ఏసిపి తెలిపారు.
బ్రీత్ టెస్ట్ లో 30 పాయింట్స్ లోపు వస్తే వదిలేస్తారు... అంతకంటే ఎక్కువ వచ్చిందంటే బైక్ సీజ్ చేస్తారు. 100 దాటిందంటే అది అసాధారణం... అతడు పీకలదాక తాగాడని అర్థం. కొందరికి ఉదయం తాగినా సాయంత్రం బ్రీత్ టెస్ట్ చేస్తే తాగినట్లు చూపిస్తుంది. ఇందుకు కూడా శరీరతత్వం కారణమని రమణ గౌడ్ తెలిపారు. ఇలా డ్రంక్ ఆండ్ డ్రైవ్ గురించి పోలీస్ అధికారి రమణగౌడ్ ఐడ్రీమ్ కు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూ ఇక్కడ చూడండి.
మద్యం తాగకుండానే బ్రీత్ ఎనలైజర్ టెస్టులో పాజిటివ్ వచ్చిన ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. కేఎస్ ఆర్టీసీ డ్రైవర్లకు ఇటీవల రొటీన్ చెకప్ లో భాగంగా బ్రీత్ టెస్ట్ నిర్వహించారు అధికారులు... కానీ వారు మద్యం తాగకున్నా పాజిటివ్ గా వచ్చింది.
అయితే వీరు పనస పండు తినడం వల్ల పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కొన్ని పండిన లేదా పులిసిన ఆహార పదార్థాలు తింటే మద్యం తాగకున్నా బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో పాజిటివ్ వస్తుందని... కర్ణాటక ఆర్టిసి డ్రైవర్ల విషయంలోనూ ఇదే జరిగిందని తేలింది.
గమనిక : మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరం. కాబట్టి ఎంత తాగినా వాహనాన్ని నడపకూడదు. కేవలం సమాచారం కోసమే ఈ ఆర్టికల్ అందించాం.