Hyderabad Nimajjanam: హైదరాబాద్‌లో గణేశ్ మహా నిమజ్జనం అత్యంత వైభవంగా జరుగుతుందని తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిమజ్జన నేపథ్యంలో నగరంలో పలు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించిన వివరాల ప్రకారం, వినాయకుల ప్రధాన ఊరేగింపు కట్టమైసమ్మ ఆలయం నుంచి ప్రారంభమై హుస్సేన్ సాగర్ వరకు సుమారు 13 కిలోమీటర్ల మేర సాగనుంది. బాలాపూర్ గణపతి కేశవగిరి నుంచి బయలుదేరి, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, అలియాబాద్, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, బషీర్‌బాగ్, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం మార్గంగా ఎన్టీఆర్ మార్గ్ వరకు శోభాయాత్ర కొనసాగుతుంది. ఈ మార్గాల్లో సాధారణ వాహనాలకు అనుమతి ఉండదని పోలీసులు స్పష్టం చేశారు. కేవలం వినాయకులతో వచ్చే వాహనాలనే అనుమతిస్తారు.
DID YOU KNOW ?
భారీ వాహనాలకు అనుమతి లేదు
సెప్టెంబర్ 6 ఉదయం నుంచి 7వ తేదీ ఉదయం వరకు నగరంలో భారీ వాహనాలకు అనుమతి ఉండదు.
25
ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ సదుపాయాలు
సెప్టెంబర్ 6 ఉదయం నుంచి 7వ తేదీ ఉదయం వరకు నగరంలో భారీ వాహనాలకు అనుమతి ఉండదు. ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ బస్సులు కూడా డైవర్ట్ చేస్తారు. ట్యాంక్ బండ్ వైపు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు కేటాయించారు. ఎన్టీఆర్ స్టేడియం, పబ్లిక్ గార్డెన్స్, బీఆర్‌కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్, ఆదర్శ్ నగర్ రోడ్లలో పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. అదనంగా, టీఎస్ ఆర్టీసీ 600 ప్రత్యేక బస్సులను నడుపుతుంది.
35
బేబీ పాండ్లు, క్రేన్ సదుపాయాలు
భద్రత చర్యల విషయంలో కూడా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకూడదన్న కారణంతో పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో పలు ప్రాంతాల్లో బేబీ పాండ్లు ఏర్పాటు చేశారు. జైపాల్‌రెడ్డి స్ఫూర్తి స్థల్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, సంజీవయ్య పార్కు వంటి ప్రదేశాల్లో చిన్న విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ విగ్రహాల కోసం హుస్సేన్ సాగర్, సరూర్‌నగర్ చెరువు, సఫిల్‌గూడ, సున్నం చెరువుతోపాటు 20 ప్రదేశాల్లో 400కి పైగా క్రేన్లు సిద్ధంగా ఉన్నాయి.
మహా నిమజ్జనం రోజున 30 వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. రిజర్వ్ ఫోర్స్, పారా మిలిటరీ, ట్రాఫిక్ పోలీసులు సహా అన్ని విభాగాలు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హెల్ప్‌లైన్ నంబర్లు, కంట్రోల్ రూమ్‌లు, మెడికల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్లు అందుబాటులో ఉంచారు. నిమజ్జనాన్ని పూర్తిగా పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఉన్నతాధికారులు నేరుగా మానిటరింగ్ చేస్తారు.
55
డీజేలపై నిషేధం
ఈసారి శోభాయాత్రలో అధిక శబ్దం చేసే డీజేలు, బ్యాండ్లపై పోలీసులు నిషేధం విధించారు. దీనిపై కొంతమంది భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం శాంతి భద్రతల దృష్ట్యా ఈ చర్యలు తప్పనిసరి అని చెబుతున్నారు. ప్రజలందరూ సూచనలు పాటించి, శాంతియుతంగా నిమజ్జనం జరగాలని అధికారుల విజ్ఞప్తి చేస్తున్నారు.