Hyderabad : ఈ శివారు గ్రామమే ఫ్యూచర్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్.. ఇప్పుడే భూములు కొంటే మీ పిల్లల భవిష్యత్ బంగారమే

Published : Aug 07, 2025, 05:35 PM ISTUpdated : Aug 07, 2025, 05:42 PM IST

Real Estate : కొన్ని పెట్టుబడులు మనకు ఉపయోగపడకున్నా పిల్లల భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడతాయి. అలాంటి పెట్టుబడులే ఇప్పుడు హైదరాబాద్ శివారులో పెట్టవచ్చు… ఎక్కడో తెలుసా?

PREV
16
హైదరాబాద్ లో ఫోర్త్ సిటీ అవసరమేంటి?

Hyderabad Future City : తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ ఓ సెంటిమెంట్. ఈ నగరం తమ జీవితాన్ని మారుస్తుందని ప్రతిఒక్కరి నమ్మకం. తెలంగాణలో ఈ చివరన ఉండే ఆదిలాబాద్ నుండి ఆంధ్ర ప్రదేశ్ లో ఆ చివరన ఆదివాసీలు ఎక్కువగా ఉండే శ్రీకాకుళం, విజయనగరం వరకు అందరినీ అక్కున చేర్చుకుంటుంది ఈ హైదరాబాద్. కోట్లు పట్టుకుని వ్యాపారాలు చేసేందుకు వచ్చేవారినే కాదు పొట్టచేతబట్టుకుని బ్రతికేందుకు వచ్చేవారికి కూడా ఈ నగరం ఆశ్రయం ఇస్తుంది. అందుకే తెలుగు పల్లెల నుండి హైదరాబాద్ కు వలసలు పెరిగిపోయాయి.

అయితే ఒకప్పటి నిజాంల నగరం ఇప్పుడు దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నగరంగా మారింది. రోజురోజుకు నగరం విస్తరిస్తూ శివారుప్రాంతాలను తనలో కలిపేసుకుంటోంది. అందుకే హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలుండగా కొత్తగా సైబరాబాద్ ఏర్పడింది. ఇప్పుడు ఇదికూడా పాతబడిపోయింది... అందుకే మరో కొత్త నగరాన్ని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమయ్యింది. అదే పోర్త్ సిటీ (ఫ్యూచర్ సిటి)

DID YOU KNOW ?
ఫ్యూచర్ సిటీ
ఫ్యూచర్ సిటీ అనేది దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ. దీని నిర్మాణం కోసం ఫ్యూచర్ సిటీ డెవలప్ మెంట్ అథారిటీ (FCDA) ని ఏర్పాటుచేసింది ప్రభుత్వం.
26
ఏమిటీ ఫ్యూచర్ సిటీ?

మారుతున్న కాలంతోపాటు హైదరాబాద్ కూడా మారుతోంది. గతంలో కుతుబ్ షాహీలు పాలనాసౌలభ్యం కోసం మూసీనది ఒడ్డున నగరాన్ని నిర్మించారు. అదే ఇప్పటి ఓల్డ్ సిటీ. తర్వాత ఆంగ్లేయుల పాలనలో సికింద్రాబాద్ డెవలప్ అయ్యింది. తమ అవసరాలకు అనుగుణంగా బ్రిటీష్ పాలకులు సికింద్రాబాద్ ను నిర్మించుకున్నారు. ఇలా జంటనగరాలు ఏర్పడ్డాయి. అయితే హైదరాబాద్ లోకి ఐటీ ఎంట్రీతో మరో కొత్తనగరం ఏర్పడింది.. అదే సైబరాబాద్.

అయితే ఇప్పుడు మరోసారి హైదరాబాద్ విస్తరణకు సిద్దమయ్యింది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మాదిరిగానే మరో సరికొత్త నగర ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీ, సకల సౌకర్యాలతో కొత్తగా ఓ నగరాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీన్ని ఫోర్త్ సిటీ లేదా ఫ్యూచర్ సిటీగా పేర్కొంటోంది రేవంత్ సర్కార్. ఇలా ఓ కొత్త నగరాన్నే నిర్మించేందుకు వేగంగా నిర్ణయాలు, వడివడిగా పనులు జరుగుతున్నాయి.

36
ఫ్యూచర్ సిటీ ఎక్కడ వస్తోంది?

తెలంగాణలో హైదరాబాద్ ను మించిన సిటీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే చెబుతున్నారు. ఇప్పటికే నగరం అన్ని రంగాల్లోనూ దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడుతోంది... ఇంకా చెప్పాలంటే దేశంలోనే బెస్ట్ సిటీగా గుర్తింపు పొందింది. కానీ దీన్ని జాతీయస్థాయి నగరంగా కాదు ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే అత్యాధునిక హంగులతో ఫ్యూచర్ సిటీని నిర్మించి నగరాన్ని గ్లోబల్ సిటీగా మారుస్తామంటోంది.

ఇప్పటికే చదవులు, ఉద్యోగాలు, ఉపాధి కోసంవచ్చి నగరంలో స్థిరపడిపోయేవారి సంఖ్య పెరుగుతోంది. ఇదే సమయంలో వైద్యం, టూరిజం, వ్యాపార కార్యాకలాపాల కోసం వచ్చేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక టెక్నాలజీ కూడా రోజుకోజుకు కొత్తపుంతలు తొక్కుతోంది... దీనికి అనుగుణంగా నగరం మారాలి. అందుకే హైదరాబాద్ కు సౌత్ లో 50 కిలోమీటర్ల దూరంలోని శివారుగ్రామం ముచ్చర్ల పరిధిలో భవిష్యత్ సిటీని నిర్మించేందుకు ప్రభుత్వం సిద్దమయ్యింది.

ఇక్కడ సిటీ నిర్మాణానికి అన్నిరకాలుగా అనువుగా ఉంటుంది. ఇది శ్రీశైలం-నాగార్జునసాగర్ కు హైవేకు దగ్గర్లో ఉంటుంది. అంటే రోడ్ కనెక్టివిటీ బాగుందన్నమాట. ఇక శంషాబాద్ ఎయిర్ పోర్టుకు కూడా చాలా దగ్గర్లో ఉంటుంది. అంటే ఎయిర్ కనెక్టివిటీ కూడా ఉంటుందన్నమాట. అందుకే దాదాపు 30 వేల ఎకరాల్లో, ఏడు మండలాలు, 56 గ్రామాలను కవర్ చేస్తూ ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు ప్రభుత్వ ప్రణాళికలు సిద్దం చేసింది.

46
ఫ్యూచర్ సిటీలో ఎలా ఉంటుంది?

గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ ముచ్చర్ల ప్రాంతంలోనే ఫార్మా సిటీ ఏర్పాటుకు ప్రయత్నించింది. ఇందుకోసం 19 వేల ఎకరాలు భూసేకరణ కూడా చేసింది. ఇలా ఫార్మా సిటీ నిర్మాణానికి అడుగులు పడుతుండగానే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి... బిఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో కొత్త ప్రభుత్వం ఫార్మాసిటీ ప్రాజెక్టును పక్కనబెట్టి అదే ప్రాంతంలో ఫోర్త్ సిటీ లేదా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తోంది.

తెలంగాణలో 38 శాతం అర్బన్ జనాభే... ఇది త్వరలోనే 40 శాతానికి మించిపోతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కేవలం హైదరాబాద్ లోనే కోటికిపైగానే జనాభా ఉంది.. అంటే రాష్ట్ర జనాభాలో 25శాతానికి పైనే. ఇలాంటి నగరానికి సమీపంలో ఫార్మా సిటీ ఏర్పాటుచేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దన్నదే తమ ఆలోచనగా కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. అలాకాకుండా ప్రజలకు ఉపయోగపడేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామంటోంది. హైదరాబాద్ డెవలప్ మెంట్ కోసం ప్రణాళికబద్దంగా ఓ నగరాన్ని నిర్మిస్తున్నామంటోంది రేవంత్ సర్కార్.

56
8 జోన్లుగా ఫ్యూచర్ సిటీ... అవేంటో తెలుసా?

ఈ ఫ్యూచర్ సిటీని 8 జోన్లుగా విభజించారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా ఇక్కడ మౌళిక సదుపాయాలు, అత్యాధునిక సౌకర్యాల కల్పిస్తారు. ఏ జోన్ ఎలా ఉంటుంది? ఈ ఫ్యూచర్ సిటీ ప్లాన్ ఏంటి? అనేదానిపై ప్రభుత్వం ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చింది. ఈ ఫ్యూచర్ సిటీలో స్పోర్ట్స్ జోన్, హెల్త్ జోన్, ఏఐ జోన్, లైఫ్ సైన్స్ జోన్, ఎలక్ట్రానిక్స్ ఆండ్ మ్యానుఫాక్చరింగ్ జోన్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్ మెంట్, రెసిడెన్సియల్ జోన్లు ఉంటాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలో ఏఐ జోన్ ను ఏర్పాటుచేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం ఫ్యూచర్ సిటీలో 200 ఎకరాలను కేటాయిస్తున్నట్లు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. అలాగే సీఎం రేవత్ రెడ్డి ఈ ఏఐ సిటీ లోగోను కూడా ఆవిష్కరించారు. హెల్త్ సిటీలో వరల్డ్ క్లాస్ హాస్పిటల్స్, అత్యాధునిక వైద్య సదుపాయాలు... స్పోర్ట్ సిటీలో ఇంటర్నేషనల్ స్టేడియంలు, క్రీడాభివృద్ధికి దోహదపడే ఏర్పాట్లు... ఎలక్ట్రానిక్స్ ఆండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ లో పరిశ్రమలు... ఎడ్యుకేషన్ జోన్ లో వరల్డ్ క్లాస్ విద్యాసంస్థలు... ఎంటర్టైన్ మెంట్ జోన్ లో అత్యాధునిక సినిమా థియేటర్లు... రెసిడెన్షియల్ జోన్ లో నివాసయోగ్యమైన వాతావరణం, సకల సౌకర్యాలు కల్పించనున్నారు.

66
పొల్యూషన్ ఫ్రీగా ఫ్యూచర్ సిటీ

పొల్యూషన్ లేకుండా ఈ సిటీలో సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అలాగే గ్రీన్ ఫీల్డ్ రోడ్లు వేస్తామని... హైదరాబాద్ మెట్రోను ఫ్యూచర్ సిటీ వరకు విస్తరిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంటే భవిష్యత్ లో ముచ్చర్ల గ్రామ పరిసరాలు ఫ్యూచర్ సిటీగా మారిపోతున్నాయి... అందుకే ఇప్పటినుండి అక్కడ రియల్ ఎస్టేట్ జోరందుకుంది. కాబట్టి మీరు కూడా ఈ ఫ్యూచర్ సిటీలో భూములు కొంటే ఊహించని లాభాలను పొందవచ్చు... మీ పిల్లల భవిష్యత్ అవసరాలను మీరు ఫ్యూచర్ సిటీలో భూములపై పెట్టే పెట్టుబడులు తీర్చనున్నాయి. ప్రభుత్వం చెప్పినట్లు జరిగితే ముచ్చర్ల ప్రాంతం మరో బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ అవుతుంది.

గమనిక: పైన తెలిపిన వివరాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి అనేది లాభ, నష్టాలతో కూడుకున్న అంశం. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు ఈ రంగంలో నిపుణులను సంప్రదించడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories