
హైదరాబాద్: హుజురాబాద్ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ ను ఓడించి అద్భుత విజయాన్ని అందుకుని తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈటల రాజేందర్. దాదాపు రెండు దశాబ్దాలుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన ఆయన మొట్టమొదటిసారి బిజెపి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇవాళ బిజెపి నాయకులతో అసెంబ్లీకి వెళ్లిన ఈటల స్పీకర్ చాంబర్ లో శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈటలచేత ప్రమాణం చేయించారు.
ప్రమాణస్వీకారానికి ముందు eatala rajender గన్ పార్క్ కు వెళ్లి అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించారు. ఆ తర్వాత telangana assembly భవనంలోకి వెళ్లి స్పీకర్ pocharam srinivas reddy సమక్షంలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసారు. ఈటల ప్రమాణస్వీకార కార్యక్రమంలో బిజెపి నాయకులు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తుల ఉమ, ఏనుగ రవీందర్ రెడ్డితో పాటు అసెంబ్లీ అధికారులు పాల్గొన్నారు.
ప్రమాణస్వీకారం అనంతరం ఈటల మాట్లాడుతూ... ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీలో హక్కులు వుండేవన్నారు. ఇప్పుడు మాజీలకే కాదు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నవారికీ గౌరవం లేదన్నారు. huzurabad ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కూడా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడే అవకాశం ఇవ్వలేకపోవడం దారుణమని ఈటల మండిపడ్డారు.
హుజురాబాద్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీగా డబ్బులుపంచినా గెలవలేకపోయిందన్నారు. హుజురాబాద్ ప్రజల తీర్పుతో సీఎం కేసీఆర్ దిమ్మతిరిగిందని... అందువల్లే ఆయన ఏం మట్లాడుతున్నాడో ఆయనకే అర్థంకాకుండా వుందన్నారు. కేసీఆర్ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు.
video హుజురాబాద్ ఎమ్మెల్యేగానే తిరిగి హైదరాబాద్ కు... ఈటల రాజేందర్ కు ఘనస్వాగతం
నోరు చించుకుని మాట్లాడుతూ ప్రతిపక్షాలను బెదిరించినంత మాత్రాన కేసీఆర్ తప్పు చేయనట్టు కాదన్నారు. కేసీఆర్ మాటల్లో నిజం లేదని... ఆ మాటలపై ప్రజలకు విశ్వాసం లేదన్నారు. స్వరాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారుల నోట్లో మట్టి కొట్టి... ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పదవులు కట్టబెడుతున్నాడని ఆరోపించారు. కాబట్టి ఉద్యమకారులెవరూ కేసీఆర్ వెంట ఉండొద్దని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల సూచించారు.
అవినీతి ఆరోపణల నేపథ్యంలో మంత్రిమండలి నుండి భర్తరఫ్ చేయడంలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ను వీడారు. ఈ క్రమంలో బిజెపిలో చేరుతూ టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసారు. దీంతో హుజురాబాద్ ఉపఎన్నిక జరిగింది.
అయితే హుజురాబాద్ లో ఈటల ఓడించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ విశ్వప్రయత్నం చేసారు. దళిత బంధు వంటి పథకాన్ని హుజురాబాద్ నుండి ప్రారంభించారు. అలాగే ప్రభుత్వం తరపున భారీగా అభివృద్దిపనులు చేయడమే కాదు పార్టీ తరపున ఈటల వెంట వెళ్లిన నాయకులను సామ దాన బేద దండోపాయాలను ఉపయోగించి తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. ఇలా గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి నాయకులకు టీఆర్ఎస్ కండువా కప్పారు.
దళిత నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, తెలంగాణ టిడిపి అధ్యక్షులు ఎల్ రమణ, గత ఎన్నికలో కాంగ్రెస్ పార్టీతరపున పోటీచేసిన పాడి కౌషిక్ రెడ్డి వంటి కీలక నాయకులను సైతం టీఆర్ఎస్ లోచేర్చుకున్నారు. ఇక పోలింగ్ కు ముందయితే టీఆర్ఎస్ పార్టీ ఓటుకు ఆరువేల నుండి పదివేల వరకు పంచినట్లు ప్రచారం జరిగింది. ఇంతచేసినా టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై ఈటల దాదాపు 20వేల పైచిలుకు మెజారిటీలో ఘన విజయం సాధించారు.
ఇలా హుజురాబాద్ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ ను ఓడించిన తర్వాతే ఈటల హైదరాబాద్ కు చేరుకున్నారు. మొదటిసారి హైదరాబాద్ కు విచ్చేస్తున్న సందర్భంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు బిజెపి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మాజీఎమ్మెల్యేగా హైదరాబాద్ నుండి వెళ్లిన ఈటల హుజురాబాద్ ఎమ్మెల్యేగా తిరిగివచ్చారు. ఈ సందర్భంగా ఔటర్ రింగ్ రోడ్డు నుండి శామీర్ పేటలోని నివాసం వరకు ఈటల భారీ కార్లతో ర్యాలీగా వెళ్లారు. బిజెపి జెండాలు చేతపట్టి జై బిజెపి, జై ఈటల నినాదాలతో బిజెపి శ్రేణులు హోరెత్తించాయి.
ఇటీవల బిజెపి ఎమ్మెల్యేగా హైదరాబాద్ లో అడుగుపెట్టిన ఈటల తాజాగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా ఇప్పుడు హుజురాబాద్ ప్రజలు తీర్పునిచ్చారని... త్వరలోనే యావత్ రాష్ట్ర ప్రజలు కూడా ఇదే తీర్పు ఇవ్వనున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.