Prajaprasthanam Padayatra: పాదయాత్రకు బ్రేక్... 72 గంట‌ల నిరాహార దీక్షకు పిలుపునిచ్చిన షర్మిల

First Published Nov 10, 2021, 1:37 PM IST

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రకు బ్రేక్ వేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో తన పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు షర్మిల ప్రకటించారు. 

నల్గొండ: తెలంగాణ రాష్ట్రాన్ని కాలినడకన చుట్టివచ్చేందుకు ఇటీవలే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్రను బ్రేక్ పడింది. ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యలో ఎన్నికల నిబంధనను అనుసరించి తన పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు స్వయంగా వైఎస్ షర్మిలే ప్రకటించారు.  

తెలంగాణలోని 90 అసెంబ్లీ, 14 లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా మొత్తం 4వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని షర్మిల నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ తో సహా అన్ని ఏర్పాట్ల జరిగిపోయాయి. తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంటిమెంట్ ను కొనసాగిస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుండే ఇటీవల షర్మిల పాదయాత్రను ప్రారంభించారు. అయితే తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల  నేపథ్యంలో తన పాదయాత్రను షర్మిల వాయిదా వేయక తప్పలేదు. 

నిన్నటితో(మంగళవారం) షర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర నల్గొండ జిల్లా నకిరేక‌ల్ నియోజ‌క‌వ‌ర్గం కొండ‌పాలకగూడెంకు చేరకుంది. ఇవాళ  అక్కడే పార్టీ నేతలతో కలిసి షర్మిల మీడియాతో మాట్లాడుతూ... నేటి(బుధవారం)నుండి పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

''prajaprasthana padayatra 21 రోజుల పాటు దిగ్విజ‌యంగా సాగింది. వేలాది మంది త‌ర‌లివ‌చ్చి మాకు మ‌ద్ద‌తుగా నిలిచారు. ప్ర‌స్తుతం MLC Election Code అమ‌లులో ఉన్నందున ప్ర‌జాప్ర‌స్థానం పాద‌యాత్ర‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాం. ఎన్నిక‌ల క‌మిష‌న్ నిబంధ‌న‌ల‌ను గౌర‌విస్తూ ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. కోడ్ ముగిసిన వెంట‌నే తిరిగి ప్ర‌జాప్ర‌స్థానం ప్రారంభ‌మ‌వుతుంది'' అని ys sharmila తెలిపారు.

read more  YS Sharmila Padayatra: ఉదయసముద్రం ప్రాజెక్ట్ ను పరిశీలించిన వైఎస్ షర్మిల (వీడియో)

''21 రోజుల పాటు సాగిన యాత్ర ఆరు నియోజకవర్గాలను క‌వ‌ర్ చేశాం. ఇందులో చేవెళ్ల, మహేశ్వరం, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, దేవరకొండ, మునుగోడు ఉన్నాయి. ప్ర‌స్తుతం నకిరేకల్ నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర సాగుతోంది. 21 రోజుల పాద‌యాత్ర‌లో 150 గ్రామాల‌ను సంద‌ర్శించాం. వంద‌ల స‌మ‌స్య‌లు విన్నాం. వేలాది మంది మాతో చేతులు క‌లిపారు. మాతో క‌లిసి న‌డిచారు. వారంద‌రికీ ప్ర‌త్యేక ధ‌న్యవాదాలు తెలుపుతున్నా'' అన్నారు షర్మిల.

''తెలంగాణ పాల‌కులు రాష్ట్రంలో స‌మ‌స్య‌లే లేవు, త‌మ‌ది అద్భుతమైన పాలన అని చెబుతున్నారు. ప్ర‌జ‌లేమో వంద‌ల స‌మస్య‌ల‌తో అల్లాడిపోతున్నారు. దివంగ‌త మ‌హానేత వైఎస్ఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులు నేటికీ పూర్తి చేయ‌లేదంటే పాల‌కుల నిర్ల‌క్ష్యం ఎలా ఉందో తెలుస్తోంది'' అని మండిపడ్డారు. 

''గ్రామాల్లో వృద్ధుల‌కు పెన్షన్లు రావడం లేదు. మ‌హిళ‌ల‌కు రుణాలు రావ‌డం లేదు. అర్హుల‌కు రేషన్ కార్డులు ఇవ్వ‌డం లేదు. విద్యార్థుల‌కు ఫీజు రీయింబర్స్ మెంట్ అంద‌డం లేదు. బాధితుల‌కు ఆరోగ్య శ్రీ అమ‌లు చేయ‌డం లేదు. 108 సేవలు పలకడం లేదు. ఇలా అనేక స‌మ‌స్యలు ప్ర‌జ‌ల‌ను వేధిస్తున్నాయి'' అని తెలిపారు. 

''ఈ పాద‌యాత్ర‌లో విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉద్యోగులు ఇలా ఎన్నో వ‌ర్గాల‌కు సంబంధించిన సమస్యలు ఎత్తి చూపగలిగాం. ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాడ‌గ‌లిగాం. ఇక‌ముందు కూడా పోరాడుతాం. అదే మా పార్టీ ధ్యేయం'' అని షర్మిల స్పష్టం చేసారు. 

read more  అన్నదాతలను ఆత్మీయంగా పలకరిస్తూ... ముందుకు సాగుతున్న షర్మిల పాదయాత్ర (ఫోటోలు)
 

''వరి కొనుగోలు చేయమని కేసీఆర్ డిక్లేర్ చేశారు. ఇది ఎంత‌వ‌ర‌కు స‌బ‌బు? కేంద్ర పెత్తనం ఏంటి? ఆఖ‌రి గింజ వ‌ర‌కు తామే కొంటామ‌ని కేసీఆర్ మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు మాట త‌ప్పారు. ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉండి మ‌రీ మాట త‌ప్పారు. ముఖ్యమంత్రిగారు ప్రెస్ మీట్లు పెట్టి మ‌రీ, వ‌డ్లు కొన‌మ‌ని మళ్లీ మ‌ళ్లీ చెబుతున్నారు. కేసీఆర్ లో అభ‌ద్ర‌తాభావం నిండుకుంది. రైతుల‌కు ఎంతో చేశామ‌ని చెప్పుకునే కేసీఆర్.. ఏడేండ్ల‌లో 8వేల మంది రైతులు ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారో చెప్పాలి'' అని షర్మిల నిలదీసారు. 

''రాష్ట్రంలో 91శాతం మంది రైతులు అప్పులపాలయ్యారని ఓ సర్వే చెబుతుంటే.. కేసీఆర్ మాత్రం త‌మ‌ది రైతు ప్ర‌భుత్వ‌మ‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లుకున్నారు. కేసీఆర్ అంటేనే వాస్త‌వాల‌కు విరుద్ధం. పెట్రోల్, డీజిల్ విష‌యంలోనూ, రైతుల విష‌యంలోనూ నిజాల కంటే అబ‌ద్ధాలే ఎక్కువ‌గా చెబుతున్నారు'' అని మండిపడ్డారు. 

''త‌మ వ‌డ్లు కొన‌క‌పోతే త‌మ‌కు ఆత్మ‌హ‌త్య‌లే శ‌ర‌ణ్య‌మ‌ని రైతులు గ‌గ్గోలు పెడుతున్నారు. వ‌రి కొన‌డం చేత‌కాక‌పోతే రాజీనామా చేసి ద‌ళితున్ని సీఎం చేయండి. మీక‌న్నా ద‌ళితుడే మంచి పాల‌న అందిస్తార‌ని ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారు'' అన్నారు. 

''రైతుల వ‌డ్ల‌ను చివ‌రి గింజ వ‌ర‌కు కొనాల‌ని డిమాండ్ చేస్తూ 72 గంట‌ల పాటు పార్టీ ఆధ్వ‌ర్యంలో నిరాహార దీక్ష చేస్తాం. రైతుల ప‌క్షాన పార్టీ ఎల్ల‌ప్పుడూ నిల‌బ‌డుతుంది.  హైద‌రాబాద్ లో శుక్ర‌వారం ఉద‌యం నుంచి దీక్ష కొన‌సాగుతుంది. రైతులు ఎవ‌రూ అధైర్యప‌డొద్దు. మీ ప‌క్షాన మేం పోరాడుతాం. ప్ర‌భుత్వ మెడ‌లు వంచైనా వ‌డ్లు కొనేలా చేస్తాం'' అని షర్మిల పేర్కొన్నారు. 

click me!