Alcohol Consumption in Telangana : తెలంగాణలో సగటు ఆల్కహాల్ వినియోగం ఎంతో తెలుసా? ప్రజలు మందు కోసం నెలకు ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసా? ఈ లెక్కలు వింటే మీరు షాక్ అవ్వడం ఖాయం.
Telangana : శుభకార్యమైతే ఆనందంలో, అశుభకార్యమైతే బాధలో... సందర్భం ఏదయినా తెలంగాణ ప్రజలకు మందు కావాల్సిందే. ముక్కా, చుక్క ఇక్కడి సంస్కృతిలో భాగమైపోయాయి... దావత్ ఏదైనా ఇవి తప్పకుండా ఉండాల్సిందే. కొన్నిచోట్ల మహిళలు కూడా కల్లు తాగడం చూస్తుంటాం... అక్కడ ఇది సర్వసాధారణం. అందుకే తెలంగాణలో మందుకు ఫుల్ డిమాండ్ ఉంటుంది.. దేశంలో అత్యధికంగా మందుతాగే రాష్ట్రాల్లో టాప్ లో ఉంటుంది.
తెలంగాణలో ఆల్కహాల్ వినియోగానికి సంబంధించి ఆసక్తికర విషయం బైటపడింది. ఇప్పటికే లిక్కర్ అమ్మకాల్లో తెలంగాణ టాపు లేపుతోంది... ఇక డిసెంబర్ 31, జనవరి 1న ఏస్థాయిలో మందు అమ్మకాలు జరుగుతాయో అనే చర్చ సాగుతోంది. ఈ క్రమంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ ఆండ్ పాలసీ (NIPFP), రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆసక్తికర వివరాలు వెల్లడించింది.
25
తెలంగాణలో సగటు ఆల్కహాల్ వినియోగం ఎంత?
దక్షిణాది రాష్ట్రాలు అన్నింటికంటే తెలంగాణలోనే అత్యధికంగా ఆల్కహాల్ వినియోగం ఉందని NIPFP, ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. తెలంగాణలో ఏడాదికి సగటు ఆల్కహాల్ వినియోగం 4.44 లీటర్లుగా ఉంది... అంటే ఓ మనిషి ఇంత మందు తాగుతున్నాడన్నమాట. ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ నాలుగోస్థానంలో ఉంది... ఇక్కడ సగటు ఆల్కహాల్ వినియోగం కేవలం 2.71 లీటర్లు మాత్రమే. అంటే ఆంధ్రోళ్ల కంటే తెలంగాణ ప్రజలు మందు తాగడంలో చాలా ముందున్నారు... డబుల్ తాగుతున్నారు.
ఇదే దక్షిణాదిన కేరళలో అత్యల్ప ఆల్కహాల్ వినియోగం ఉంది... ఇక్కడ సగటున 2.53 లీటర్ల ఆల్కహాల్ సేవిస్తారు. తెలంగాణ తర్వాత అత్యధికంగా లిక్కర్ వినియోగించేది కర్ణాటకలో... ఇక్కడ సగటు వినియోగం 4.25 లీటర్లుగా ఉంది. తమిళనాడులో 3.38 లీటర్ల సగటు ఆల్కహాల్ వినియోగం ఉందని NIPFP, ఎక్సైజ్ శాఖ రిపోర్ట్ చెబుతోంది.
35
తెలంగాణలో మందు కోసం సగటు ఖర్చు ఎంత..?
తెలంగాణలో ఆల్కహాల్ కొనుగోలు కోసం చేస్తున్న సగటు ఖర్చు ఏడాదికి రూ.11,351. ఈ విషయంలోనూ తెలంగాణ దేశంలోనే టాప్ లో నిలిచింది. అంటే తెలంగాణలో ఓ వ్యక్తి మందు కోసం నెలకు సుమారు రూ.1000 ఖర్చు చేస్తున్నాడన్నమాట.
ఇదే ఆంధ్ర ప్రదేశ్ లో అయితే ఆల్కహాల్ కోసం ఖర్చు తక్కువగా ఉంది... ఇక్కడ ఏడాదికి సగటు లిక్కర్ ఖర్చు కేవలం రూ.6,399 మాత్రమే. అంటే ఓ ఏపీ వ్యక్తి నెలకు రూ.500 చొప్పున మందు కోసం ఖర్చు చేస్తున్నాడన్నమాట. ఇలా ఆల్కహాల్ వినియోగంతో పాటు ఖర్చు కూడా ఏపీకంటే తెలంగాణలోనే ఎక్కువ.
ప్రస్తుతం చాలా రాష్ట్రాలకు మందు అమ్మకాలే ప్రధాన ఆదాయ వనరుగా మారిపోయాయి. తెలంగాణలో కూడా లిక్కర్ అమ్మకాలు వేలకోట్ల రూపాయల ఆదాయాన్ని అందిస్తున్నాయి. కేవలం మందు అమ్మకాల ద్వారానే తెలంగాణ ప్రభుత్వానికి రూ.36,000 కోట్లు సమకూరుతున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ఇక ప్రతి రెండేళ్లకు కోసం ఓసారి ఆల్కహాల్ అమ్మకాల లైసెన్సుల కోసం అంటే వైన్స్ ఏర్పాటుకు దరఖాస్తుంది ప్రభుత్వం. ఇలా ఇటీవల రాష్ట్రంలోని 2,620 వైన్స్ ల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానించగా 95,000 కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున మొత్తం రూ.2560 కోట్లు కేవలం అప్లికేషన్ ఫీజు ద్వారానే ప్రభుత్వానికి సమకూరాయి. ఇక ఆల్కహాల్ అమ్మకాల ద్వారా ఏస్థాయిలో ఆదాయం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
55
తెలంగాణలో ఎంతమంది పురుషులు మందు కొడతారు..?
తెలంగాణలో దాదాపు 50 శాతంమంది పురుషులు మందు తాగుతారని NFHS (జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే) చెబుతోంది. అంటే పదిమంది పురుషుల్లో ఐదుగురు మందు తాగేవారే. అత్యధికంగా గోవాలో 59 శాతం పురుషులు మందు కొడతారట. ఆ తర్వాత స్థానం అరుణాచల్ ప్రదేశ్ ది... ఇక్కడ 56 శాతం మంది పురుషులు ఆల్కహాల్ సేవిస్తారు. ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.