
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం కొనసాగుతోంది. తెల్లవారుజామున శీతాకాలంలో మాదిరి చల్లగా... మధ్యాహ్నం వేసవి ఎండలు... సాయంత్రం వర్షాకాలంలో మాదిరిగా వానలు పడుతున్నాయి. దీంతో అసలు ఇది వేసవి కాలమేనా అన్న అనుమానం కలుగుతోంది. ఇప్పటికే గత వారంరోజులుగా అటు ఆంధ్ర ప్రదేశ్, ఇటు తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి... మరో నాలుగైదు రోజులు ఇవి ఇలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇదే సమయంలో ఎండలు మరింత తీవ్రరూపం దాలుస్తాయని... వడగాలులు, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తాయని హెచ్చరించింది.
తెలంగాణలో పగలంతా ఎండలు మండిపోతోంది... అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉక్కపోత, వడగాలులు సతమతం చేస్తున్నాయి. ఇక సాయంత్రం అయ్యిందంటే చాలు ఆకాశం మేఘాలతో కప్పేసి మొదట ఈదురుగాలులు, తర్వాత వాన మొదలవుతోంది. ఇలా గత వారం రోజులుగా తెలంగాణవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి... ఇవాళ (మార్చి 28, శనివారం) కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇవాళ తెలంగాణలో ఉరములు మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయట. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరిలో కూడా వర్షాలుంటాయని... సాయంత్రం సమయంలో నగరప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
తెలంగాణలో మరో రెండుమూడు రోజులు వర్షాలు కొనసాగుతాయని... ఎండావాన పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అంటే పగలంతా అత్యధిక ఉష్ణోగ్రతలో ఎండలు మండిపోయి సాయంత్రం వాతావరణం చల్లగా మారి వర్షాలు కురుస్తాయన్నమాట. వర్షాలు కురిసే జిల్లాలకు ఎల్లో అలర్ట్... ఎండలు మండిపోయే జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ.
నేడు ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు (41-44 డిగ్రీలు) నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక జగిత్యాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లోనూ రాబోయే రోజుల్లో 41 నుండి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా తెలంగాణ జిల్లాల్లో 36 నుండి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆరెంజ్ అలర్ట్ జిల్లాల ప్రజలు మధ్యాహ్నం సమయంలో జాగ్రత్తగా ఉండాలని... ఎండలు, ఉక్కపోత నుండి కాపాడుకునే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం విషయానికి వస్తే.. ఇవాళ (మార్చి 28, శనివారం) ఎండలు మండిపోతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా బూర్జ, విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, గుర్ల, మెరకముడియం, రాజాం,రేగడి, ఆముదాలవలస, సంతకవిటి, తెర్లాం, వంగర, పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, పాలకొండ, సాలూరు, సీతానగరం మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని... తీవ్ర వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని APSDMA ఎండీ ప్రఖర్ తెలిపారు.
ఇక రాయలసీమ జిల్లాల్లో 40-42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. ఆదివారం (మార్చి 29న) 18 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 29 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెవుల్లోకి వేడి గాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని ప్రఖర్ జైన్ సూచించారు.
నిన్న (మార్చి 27, శుక్రవారం) రాష్ట్రంలో అత్యధికంగా నంద్యాల జిల్లా గుల్లదుర్తలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక కడప జిల్లా కమలాపురంలో 42, పల్నాడు జిల్లా గురజాల, తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 41.8, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 41.6, కర్నూల్ జిల్లా తోవిలో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో 41, ఏలైరు జిల్లా ధర్మాజీపేటలో 40.4, మార్కాపురం జిల్లా బొట్లగూడూరులో 40.2, అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లెలో 40.1, తూర్పు గోదావరి జిల్లా చిట్యాలలో 40 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.