Holiday: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అటు అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్ఎస్, బీజేపీలు కసితో ఉన్నాయి. కాగా ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ జరిగే ఫిబ్రవరి 11న ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు వేయాలనే ఉద్దేశంతో సంబంధిత మున్సిపల్ పరిధుల్లో స్థానిక సెలవు ప్రకటించాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.
25
ఎవరికెవరికి ఈ సెలవు వర్తిస్తుంది?
పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, సహకార సంఘాలు, ప్రభుత్వ రంగ సంస్థలరే ఈ సెలవు అమల్లో ఉంటుంది. ప్రభుత్వ వ్యవస్థ మొత్తం ఎన్నికల ప్రక్రియకు సహకరించేలా ఈ ఏర్పాట్లు చేసినట్టు ఎస్‌ఈసీ వెల్లడించింది.
35
పాఠశాలలు, కళాశాలలు మూసివేతకు ఆదేశాలు
పోలింగ్ కేంద్రాలుగా చాలా విద్యాసంస్థలను వినియోగిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు సహా అన్ని విద్యాసంస్థలకు ఆ రోజున సెలవు ఇవ్వాలని స్పష్టం చేసింది. ముందుగానే భవనాలను స్వాధీనం చేసుకుని, పోలింగ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచనలు ఇచ్చింది.
ప్రైవేట్ రంగంలో పనిచేసే చాలామందికి ఓటు వేయడానికి సమయం దొరకడం లేదనే అంశాన్ని ఎస్‌ఈసీ సీరియస్‌గా తీసుకుంది. సాఫ్ట్‌వేర్ కంపెనీలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు తమ సిబ్బందికి ఓటు వేయడానికి పూర్తి వెసులుబాటు కల్పించాలని ఆదేశించింది. అవసరమైతే వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కూడా సూచించింది.
55
కలెక్టర్లకు పర్యవేక్షణ బాధ్యతలు
స్థానిక సెలవు అమలు సరిగా జరుగుతున్నదా అనే విషయాన్ని జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాల్సి ఉంటుంది. సెలవు ఇవ్వకుండా ఉద్యోగులను విధులకు రావాలని ఒత్తిడి చేసే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో ఓటర్లలో అవగాహన పెంచేందుకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఆదేశాలు ఇచ్చారు.
పోలింగ్ శాతం పెంపే లక్ష్యం
పట్టణ ప్రాంతాల్లో సాధారణంగా పోలింగ్ శాతం తక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 11న ప్రతి ఓటరు బాధ్యతగా పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. ప్రజాస్వామ్య పండుగలో ఒక్కరూ దూరంగా ఉండకూడదనే సంకల్పంతో ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపింది.