Mango Showers : వేసవికాలంలో కూడా వర్షాలు కురుస్తుంటాయి… ఇలా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ లో కురిసే వానలను మ్యాంగో షవర్స్ అంటారు. ఇవి రైతులకు వరం లాంటివి… ఎందుకో తెలుసా..?
Mango Showers : వర్షాకాలంలోనే కాదు చలి, వేసవి కాలంలోనూ వానలు పడుతుంటాయి. చలి కాలం ఆరంభంలో సముద్రాల్లో అల్పపీడనాలు, తుపానులు ఏర్పడి వర్షాలు కురుస్తాయి... ఇలాగే వేసవి ఆరంభంలో కూడా వానలు పడతాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ లో అకాల వర్షాలు కురుస్తుంటాయి... వీటినే మామిడి జల్లులు (Mango Showers) అంటారు. ఇవి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళలో కనిపిస్తాయి.
26
రైతులకు వరంలా మ్యాంగో షవర్స్...
మండుటెండలు, అధిక ఉష్ణోగ్రతల మధ్య ఒక్కసారిగా మేఘాలు కమ్ముకోవడం… ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు కురవడం సాధారణం. ఈ వేసవి కాలం వర్షాలు కేవలం వాతావరణ మార్పుకే కాదు… రైతుల జీవితాల్లోనూ కీలకమైన పాత్ర పోషిస్తాయి.
ఈ వర్షాల ప్రభావంతో మామిడి చెట్లపై ఉన్న కాయలు రాలిపోకుండా ఉండి వేగంగా పెరుగుతాయి. కాయలకు తగిన తేమ అందడంతో పాటు, పండ్లలో సహజమైన తీపి పెరగడానికి ఈ వర్షాలు దోహదపడతాయి. అందుకే వీటికి ‘మ్యాంగో షవర్స్’ అనే పేరు వచ్చింది.
36
మ్యాంగో షవర్స్ ఎలా ఏర్పడతాయి..?
వేసవిలో భూభాగం తీవ్రంగా వేడెక్కుతుంది. అదే సమయంలో అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు దక్షిణ భారతదేశం వైపు వీస్తాయి. ఈ వేడి గాలులు, తేమ గాలులు కలిసినప్పుడు వాతావరణ అస్థిరత ఏర్పడుతుంది. దీని ఫలితంగా మేఘాలు ఏర్పడతాయి... ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలు సాధారణంగా సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
మామిడితో పాటు జీడిపప్పు, కాఫీ, మిరియాలు వంటి పంటలకు కూడా ఈ వర్షాలు ఉపయోగపడతాయి.
56
మ్యాంగో షవర్స్ లేకపోతే ఏమవుతుంది..?
కొన్నిసార్లు మ్యాంగో షవర్స్ ఆలస్యమైతే లేదా పూర్తిగా కురవకపోతే...
మామిడి దిగుబడులు తగ్గే అవకాశం
కాయలు ముందుగానే రాలిపోవడం
పండ్ల నాణ్యత తగ్గిపోవడం
మార్కెట్లో మామిడి ధరలు పెరగడం
66
వేసవి వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు
మ్యాంగో షవర్స్ అనేవి కేవలం వర్షాలు మాత్రమే కాదు… దక్షిణ భారతదేశ వ్యవసాయానికి ప్రాణవాయువులాంటివి. వేసవి మండుటెండల మధ్య కురిసే ఈ చిరుజల్లులు రైతులకు ఆశను, పంటలకు జీవాన్ని అందిస్తాయి. మాన్సూన్‌కు ముందస్తు సంకేతంగా కూడా ఈ వర్షాలు కీలక పాత్ర పోషిస్తాయి.
అయితే వేసవిలో కురిసే వర్షాలు ప్రమాదకరమైనవి కూడా. ఈ వర్షాలు భారీ ఈదురుగాలులు , పిడుగులను మోసుకుని వస్తాయి. అందుకే ఈ వర్షాల సమయంలో రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంటుంది. ప్రజలు వేసవిలో వర్షాలు కురిసే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు… తగిన జాగ్రత్తలు పాటించాలి.