Published : May 28, 2025, 07:58 AM ISTUpdated : May 28, 2025, 08:19 AM IST
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కూడా ఓ నాలుగు జిల్లాల్లో కుండపోత వానలు పడతాయని హెచ్చరించారు… కాబట్టి అక్కడి ప్రజలు జాగ్రత్త. భారీ వర్షాలు కురిసే అవకాశమున్న ఆ జిల్లాలేవంటే…
Telangana Weather : ఎండాకాలంలోనే వర్షాలు కురిసాయి... మరి వానాకాలంలో తగ్గుతాయా? ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వానలు దంచికొడుతున్నాయి. తెలంగాణలో ఈ రెండ్రోజులు(మే 28, 29) కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
26
ఈ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఇవాళ(బుధవారం) జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు. ఇక కరీంనగర్, హన్మకొండ, పెద్దపల్లి,వరంగల్, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా భారీ వర్షాలుంటాయట. హైదరాబాద్ తో పాటు శివారు జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ లో వర్షాలు దంచికొడతాయని హెచ్చరించారు. ఇలా మరో 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు.
36
తెలంగాణను తాకిన రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకాయి... ఇప్పటికే మహబూబ్ నగర్ వరకు చేరుకుని వేగంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది… కొత్తగా ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి వాతావరణం వర్షాలకు అనుకూలంగా ఉంది. అందుకే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
మంగళవారం హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. పటాన్ చెరు పరిధిలో 7.7 సెం.మీ వర్షపాతం నమోదయ్యింది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్ని జలమయమై వరద పరిస్థితి ఏర్పడింది... వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి చాలాప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. జిల్లాల విషయానికి వస్తే ఆదిలాబాద్ లో 9.7 మి.మీ వర్షపాతం నమోదయ్యింది.
56
ఏపీలో ఈ జిల్లాలకు వర్షసూచన
మరో తెలుగురాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి... ఈ రెండ్రోజులు (బుధ, గురువారం) కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూల్, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
66
భారీ వర్షాలతో ప్రజలు జాగ్రత్త
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ఈదురుగాలులు, పిడుగులు తోడవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశాలుంటాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా తొలకరి వర్షాలతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు మరింత జాగ్రత్తగా ఉండాలని... వర్షాల సమయంలో చెట్ల కిందకు వెళ్లకూడదని సూచించారు. ప్రజలు కూడా వర్షం కురిసే సమయంలో అవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు.