Rain Alert : ఈ మూడ్రోజులు సెలవులే... అయినా ఈ ప్రాంతాల ప్రజలు ఇళ్లలోనే ఉండండి, బయటికి వచ్చారో...

Published : Jul 19, 2025, 07:51 AM IST

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు మొదలయ్యాయి. ఇవి అతిభారీ వర్షాలు, కుండపోత వానలుగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఈ వీకెండ్ లో హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని హెచ్చరిస్తున్నారు.

PREV
15
హైదరాబాద్ లో మరో మూడ్రోజులు కుండపోతే..

Telangana Rains : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇన్నిరోజులు ప్రజలు వర్షాల కోసం ఎదురుచూశారు... వరుణుడు కరుణించాలని పూజలు చేశారు... కానీ ఇప్పుడు ఇవేం వానల్రా నాయనా..! అనుకునేలా పరిస్థితి ఉంది. గత రెండ్రోజులు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో మూడ్రోజులు ఈ కుండపోత వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్న జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఇప్పటికే భారీ వర్షాల నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమై విపత్తు నిర్వహణ సంస్థలను రంగంలోకి దింపాయి. అలాగే నదులు, వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాల్లో ప్రమాద నివారణ చర్యలు చేపడుతున్నారు ప్రభుత్వ అధికారులు.

25
ఇవాళ సెలవుందా?

కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితేనే ఇళ్లలోంచి బయటకు రావాలని సూచిస్తున్నారు. ఈరోజు వీకెండ్ (శనివారం) కాబట్టి హైదరాబాద్ తో పాటు విశాఖపట్నం వంటి నగరాల్లో ఐటీ, మల్టీనేషనల్, కార్పోరేట్ కంపెనీల ఉద్యోగులకు సెలవు ఉంటుంది. అలాగే కొన్ని స్కూళ్లకు కూడా ఇవాళ సెలవు ఉంటుంది. కాబట్టి వీళ్లంతా బయటికి వెళ్లకుండా ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇక శుక్రవారం హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. ఇవాళ(శనివారం) కూడా కుండపోత వర్షం కురిసే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ పిల్లలను స్కూళ్లకు పంపించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. అందుకే వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవు ఇవ్వాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

35
భారీ వర్షాలతో ప్రభుత్వ అలర్ట్

అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, జిహెచ్ఎంసి, హైడ్రా కమీషనర్లు అధికారులు అప్రమత్తంగా ఉండాలని... ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వెంటనే విపత్తు నిర్వహణ, ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, హైడ్రా సిబ్బందిని రంగంలోకి దింపారు. ప్రజలు కూడా వర్షం కురిసే సమయంలో అస్సలు బయటకు రావద్దని వాతావరణ శాఖ, ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

45
ఈ తెలంగాణ జిల్లాల్లో శనివారం వర్షాలే వర్షాలు

రుతుపవనాలు చురుగ్గా మారడంతో పాటు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో మరో నాలుగురోజులు ఈ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా రాజధాని నగరం హైదరాబాద్ లో కుండపోత వర్షాలు ఇవాళ(శనివారం) కూడా కొనసాగుతాయని హెచ్చరించింది.

ఇక హైదరాబాద్ శివారుజిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి లో కూడా శని, ఆదివారం (జులై 19, 20) భారీ నుండి అతిభారీ వర్షాలుంటాయని వెల్లడించింది. మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని ప్రకటించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది వాతావరణ శాఖ. వచ్చే సోమవారం (జులై 21) కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని వెల్లడించింది. 

55
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా శనివారం వర్షాలే వర్షాలు

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి... మరో మూడ్రోజులు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ(శనివారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకటించారు. రాయలసీమ జిల్లాల్లో కూడా జోరువానలు కురుస్తాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Read more Photos on
click me!

Recommended Stories