
Telugu States Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూన్ లో లోటు వర్షపాతం నమోదవగా జులైలో మాత్రం ఇప్పటివరకైతే పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడం... బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాలు ఏర్పడి వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడటంతో వర్షాలు జోరందుకున్నాయి. ఈ వర్షాలు ఇలాగే నెలంతా కొనసాగే అవకాశాలున్నాయంటూ భారత వాతావరణ సంస్థ (IMD) శుభవార్త చెబుతోంది.
తెలంగాణవ్యాప్తంగా గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరో ఆరేడు రోజులు ఇలాగే కొనసాగుతాయని ఐఎండి ప్రకటించింది. భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది.
ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి... ఇవాళ(గురువారం) కూడా ఈ వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయట. ఇక ఉమ్మడి మెదక్, నిజామాబాద్, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లోనూ గురువారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మిగతా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందట. కొన్నిప్రాంతాల్లో వర్షాలు లేకున్నా ఆకాశం మేఘాలతో కమ్మేసి చల్లని వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
హైదరాబాద్ విషయానికి వస్తే గురువారం భారీ వర్షసూచలేమీ లేవని... అక్కడక్కడా చిరుజల్లులు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గత రెండుమూడు రోజులుగా ముసురుపట్టేసిన నగరంలో నేడు సూర్యుడి జాడ కనిపించవచ్చట. చల్లనిగాలులు తగ్గి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని... మధ్యాహ్నం సమయంలో ఉక్కపోత ఉండే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వర్షాలు జోరందుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో రుతుపవనాలు మరింత చురుగ్గా మారాయి. దీంతో రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయి. రాష్ట్రంలోని కొన్నిప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి... ఈ వర్షాలు ఇలాగే మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
గురువారం (జులై 3) విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కాకినాడ, ఏలూరు., కర్నూలు, నంద్యాల, ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటు జల్లులు పడే అవకాశాలున్నాయట.
వర్షాలకు బలమైన ఈదురుగాలుల తోడయి గాలివానగా మారుతుందని... ఇలాంటి చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచిస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంటుందని... కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలు వర్షం కురిసే సమయంలో చెట్లకింద, తాత్కాలిక నిర్మాణాల్లో తలదాచుకోవడం మంచిదికాదని.. దీనివల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని అంటున్నారు. కాబట్టి వర్ష సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని విపత్తు సంస్థ సూచించింది.
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో కురిస్తున్న వర్షాలతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వానలతో గోదావరి, కృష్ణా నదులు ఉప్పొంగుతున్నాయి. ఈ నదుల్లోకి భారీ నీరు చేరుతుండటంతో వరద పరిస్థితులు నెలకొన్నాయి.
శ్రీశైలం, జూరాల , నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు భారీ వరద నీరు చేరుతుండటంతో గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నారు. నదుల్లో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశాలున్నాయని... కాబట్టి వీటి పరివాహక ప్రాంతాలు, జలాశయాల సమీపంలోని ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.