
Heavy Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. తెలంగాణలో అయితే వర్ష బీభత్సం కొనసాగుతోంది... భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా రాబోయే 36 గంటల్లో వీటి తీవ్రత మరింత పెరగనుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. అంటే ఇవాళ, రేపు (జూలై 29 బుధవారం, 30 గురువారం) వరదలు వచ్చే స్థాయిలో వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు.
ఈ రెండ్రోజులు (జూలై 29, 30) ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షబీభత్సం కొనసాగుతుందని వెదర్ మ్యాన్ వెల్లడించారు. రాబోయే 36 గంటల్లో ఏకంగా 300-450 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. అంటే ఆ కుండపోత వర్షాలు లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాలను ముంచెత్తనున్నాయి... వరదలు సంభవించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వెదర్ మ్యాన్ సూచిస్తున్నారు.
వరదల ముప్పు పొంచివున్న జిల్లాలివే..
ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో ఏకంగా 200 నుండి 400 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయట. వరదలు సంభవించే స్థాయి వర్షాలు కురుస్తాయట. అందుకే ఈ జిల్లాలకు పింక్ అలర్ట్ జారీ చేశారు.. అంటే ఈ జిల్లాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట.
ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..
సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయట. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉన్నట్లే… కాబట్టి ప్రజలు జాాగ్రత్తగా ఉండాల్సిందే.
ఇక వికారాబాద్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్రాజ్ గిరి, యాద్రాద్రి భువనగిరి, జనగాం, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో సాధారణం నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. నల్గొండ, వనపర్తి, నాగర్ కర్నూల్ అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉందట. ఇలా తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు.
CORE DEPRESSION RAINS - EXTREME FLOODING RAIN ALERT - JULY 29-30 ⚠️🌊🌧️
Dear people of North Telangana, due to CORE DEPRESSION IMPACT, EXTREMELY HEAVY FLOODING RAINS expected in PINK MARKED DISTRICTS
Next 36hrs, Cumulative rainfall can reach 300-450mm at few places of North… pic.twitter.com/ca9CUlcCAa— Telangana Weatherman (@balaji25_t) July 29, 2026
గత 24 గంటల్లో అంటే నిన్నటి నుండి ఇప్పటివరకు (జూలై 28 నుండి 29 ఉదయం వరకు) తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. రాజధాని హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి. ముఖ్యంగా ఉత్తర, తూర్పు, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఏకంగా 200 మిమీ వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా భూపాలపల్లి జిల్లా పలిమెలలో 196 మిమీ వర్షపాతం నమోదయ్యింది. ఇక జగిత్యాల జిల్లా సారంగపూర్ లో 195.5 మి.మీ, బుగ్గారంలో 182 మి.మీ, ఎండపల్లిలో 175.8 మి.మీ, వెల్గటూరులో 166 మి.మీ, రాయికల్ లో 160 మి.మీ వర్షపాతం నమోదయ్యింది.
హైదరాబాద్ విషయానికి వస్తే.. ముషిరాబాద్ లో అత్యధికంగా 54.5 మి.మీ వర్షం కురిసింది. ఇక షేక్ పేట, తిరుమలగిరి, గోల్కొండ, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, అబ్దుల్లాపూర్ మెట్, శేరిలింగంపల్లి, రాజేంద్ర నగర్, బాలానగర్, కాప్రా, ఉప్పల్, కూకట్ పల్లి, సికింద్రాబాద్, కీసర ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. ఐటీ ప్రాంతాలైన మాదాపూర్, హైటెక్ సిటి, గచ్చిబౌలి, మియాపూర్, నిజాంపేట ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. సరిగ్గా ఉద్యోగులు ఆఫీసుల నుండి ఇంటికి బయలుదేరే సమయంలో భారీ వర్షం కురవడంతో ఐటీ ఏరియాల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది.
THIS IS WHAT YOU CALL IT AS POUNDING RAINS ⚠️🌧️🌧️
This is the first time in this monsoon season we are getting such massive widespread rains
As per the given forecasts, VERY HEAVY RAINS upto 200mm lashed North, East TG and Widespread moderate to heavy rains occured in Central,… pic.twitter.com/wRUtklgGog— Telangana Weatherman (@balaji25_t) July 29, 2026
తెలంగాణ వెదర్ మ్యాన్ చెప్పినట్లే హైదరాబాద్ వాతావరణం కేంద్రం కూడా భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. ఇక రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్ గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంటుంది... కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది.
ఇవాళ (జూలై 29, బుధవారం) ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. శ్రీకాకుళం, మన్యం, తూర్పు గోదావరి,పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, కృష్ణా, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో చెట్లు, హోర్డింగ్స్, విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదని APSDMA సూచించింది. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.