Gandhari Khilla: 1000 ఏళ్ల నాటి అద్భుతం.. ఎండాకాలంలోనూ ఉప్పొంగే బావులు.. తెలంగాణ అడవుల్లో దాగున్నగాంధారి కోట రహస్యాలు !

Published : Jul 10, 2026, 12:36 PM IST

Telangana Tourism Hill Forts : మంచిర్యాల జిల్లాలోని చరిత్రాత్మక గాంధారి ఖిల్లా ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీలు చాలానే ఉన్నాయి. గాంధారీ కోట విశేషాలు, 10 తలల నాగశేషు విగ్రహం, మైసమ్మ జాతర వంటి ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
1000 ఏళ్ల చరిత్ర.. మంచిర్యాల అడవుల్లో దాగున్న గాంధారి ఖిల్లా రహస్యాలు ఇవే

తెలంగాణ అనగానే చరిత్రాత్మక కట్టడాలు, దట్టమైన అడవులు గుర్తొస్తాయి. అలాంటి అద్భుతమైన హిస్టారికల్ ప్లేస్ ఒకటి మంచిర్యాల జిల్లాలో ఉంది. అదే గాంధారి ఖిల్లా లేదా గాంధారి కోట. దట్టమైన అడవులు, ఔషధ మొక్కల మధ్య, ఇసుకరాతి కొండలపై ఈ పురాతన కోట ఉంటుంది.

హైదరాబాద్‌కు సుమారు 270 కిలోమీటర్ల దూరంలో, మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామానికి సమీపంలో ఈ కోట ఉంది. కాకతీయుల శిల్పకళా వైభవానికి, గిరిజన రాజుల ప్రతిభకు అద్దం పడుతున్న ఈ కోట విశేషాలు, అక్కడ జరిగే ఉత్సవాల గురించి ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం.

26
వేల ఏళ్ల నాటి చరిత్ర.. కాకతీయుల శిల్పకళా వైభవం

పురాతన ఆధారాల ప్రకారం ఈ గాంధారి ఖిల్లా నిర్మాణం క్రీస్తుశకం 1200 కంటే ముందే, అంటే రాష్ట్రకూటుల కాలంలోనే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 16వ శతాబ్దం వరకు ఇక్కడ నిర్మాణాలు జరిగాయి. ఈ కోటను స్థానిక గిరిజన రాజులు, కాకతీయ పాలకుల సాంకేతిక సహాయంతో నిర్మించారని చరిత్ర చెబుతోంది.

ఆ తర్వాత ఈ కోట ఒద్ది రాజు అనంత రాజు ఆధీనంలోకి, అనంతరం కుతుబ్ షాహీ సుల్తానులు (1518–1687), గోల్కొండ పాలకుల చేతుల్లోకి మారింది. ఇక్కడి ద్వారాలు, శిల్పాలు అన్నీ కాకతీయుల శైలిని పోలి ఉంటాయి. విశేషం ఏంటంటే, కాకతీయులు శివభక్తులు అయినప్పటికీ, ఇక్కడి శిల్పాలపై శంఖు, చక్రాలు వంటి విష్ణువు గుర్తులు కనిపిస్తాయి. గుర్రాలు, ఏనుగులు సైతం సులభంగా వెళ్లేలా రాతితో చెక్కిన మూడు ప్రధాన ద్వారాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

36
ఏకశిలా నాగశేషు విగ్రహం.. మైసమ్మ ఆలయం

ఈ కోటలో ప్రధాన ఆకర్షణ ఒకే రాతిపై చెక్కిన ఎనిమిది అడుగుల ఎత్తైన, పది తలల నాగశేషు విగ్రహం. ఇలాంటి పది పడగల పాము విగ్రహం ఈ ప్రాంతంలో చాలా అరుదుగా కనిపిస్తుంది. దీనితో పాటు కోటపై పురాతన గాంధారి మైసమ్మ ఆలయం ఉంది. గిరిజనులు ఈ దేవతను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.

ఇవే కాకుండా కాలభైరవ స్వామి, శివుడు, వినాయకుడు, హనుమంతుడి విగ్రహాలను కూడా కొండ రాళ్లపైనే అద్భుతంగా చెక్కారు. అడవి మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో ఉండే ఈ గుహాలయాలు భక్తులను, పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

46
ఎప్పటికీ ఎండిపోని ఏనుగుల బావి

ఆ కాలంలోనే రాజులు నీటి సంరక్షణ కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. గాంధారి కోటపై మూడు పురాతన బావులు ఉన్నాయి. ఇవి ఎండకాలంలో కూడా అస్సలు ఎండిపోవు, నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. వీటిలో అత్యంత ప్రసిద్ధి చెందింది ఏనుగుల బావి. ఆ కాలంలో ఏనుగులు, గుర్రాలు నేరుగా నీటిలోకి దిగి దాహం తీర్చుకునేలా ఈ బావికి వెడల్పాటి రాతి మెట్లను నిర్మించారు. వీటితో పాటు స్నానాలు చేయడానికి రాతి మెట్లతో కూడిన పుష్కరిణులు కూడా ఈ కోటపై కనిపిస్తాయి.

56
17 ఏళ్ల తర్వాత పునఃప్రారంభమైన గాంధారి మైసమ్మ జాతర

గాంధారి ఖిల్లాపై ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘమాసంలో (జనవరి-ఫిబ్రవరి నెలల్లో) గాంధారి మైసమ్మ జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ గిరిజన ఉత్సవానికి తెలంగాణతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి 10 వేల నుంచి 20 వేల మంది వరకు గిరిజన భక్తులు తరలివస్తారు.

సాంప్రదాయ నృత్యాలు, జంతు బలులతో వారి ఆచారం ప్రకారం పూజలు చేస్తారు. అయితే 1998లో జరిగిన ఒక హత్య ఉదంతం వల్ల ఈ జాతరపై 17 ఏళ్ల పాటు నిషేధం విధించారు. ఆ తర్వాత 2016లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ తీసుకుని, రోడ్డు వసతులు, తాగునీటి సదుపాయాలు కల్పించి ఈ జాతరను మళ్లీ వైభవంగా పునఃప్రారంభించింది.

66
పర్యాటకులకు అలర్ట్.. టూర్ ప్లాన్ ఇలా చేసుకోండి

గాంధారి ఖిల్లాను సందర్శించడానికి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు బెస్ట్ సీజన్. ఈ సమయంలో వాతావరణం చల్లగా, అడవి పచ్చగా ఉంటుంది. ట్రెక్కర్స్ కోసం ఇదొక క్రేజీ స్పాట్. బొక్కలగుట్ట గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరం వాహనాల్లో వెళ్ళిన తర్వాత, అక్కడి నుంచి కొండపైకి వెళ్లడానికి 30 నుంచి 45 నిమిషాల పాటు మెట్ల గుండా ట్రెకింగ్ చేయాల్సి ఉంటుంది.

కోటపై ఎలాంటి ఆహారం, నీటి దుకాణాలు ఉండవు. మీరే సొంతంగా తెచ్చుకోవాలి. అడవిలో చిరుతపులులు, ఎలుగుబంట్లు వంటి అడవి జంతువులు ఉంటాయి కాబట్టి ఒంటరిగా వెళ్లకుండా గ్రూప్‌గా వెళ్లడం సురక్షితం. సందర్శన సమయం ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఎంట్రీ ఫీజు ఏమీ వుండదు.

Read more Photos on
click me!

Recommended Stories