కారు కాదు నంబర్ ప్లేట్ ధరే రూ.12 లక్షలు :
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని మణికొండ ఆర్టిఏ ఆఫీసులో ఇటీవల ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ల వేలంపాట జరిగింది. ఇందులో TG తో కూడిన ఫ్యాన్సీ నంబర్లు భారీ ధరకు అమ్ముడుపోయాయి. ఇలా కేవలం ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారానే ఈ ఆర్డిఏ కార్యాలయానికి రూ.52.6 లక్షల ఆదాయం సమకూరింది.
TG 07 R 9999 రిజిస్ట్రేషన్ నంబర్ అత్యధిక ధర పలికింది. ఈ నంబర్ ను ఏకంగా రూ.12,49,999 చెల్లించి కొనుగోలుచేసింది ఓ రియల్ ఎస్టేట్ సంస్థ. ఇక TG 07 AA 0009 నంబర్ కు రూ.8.5 లక్షలు, TG 07 AA 0001 నంబర్ కు రూ.4.77 లక్షలు దక్కాయి. ఇలా చాలా నంబర్లను లక్ష రూపాయలకు పైగానే వేలంపాడి దక్కించుకున్నారు.
హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు నిర్వహించే కాంగ్రూయెంట్ డెవలపర్స్ సంస్థ అత్యధిక ధరకు TG 07 R 9999 నంబర్ ను దక్కించుకుంది. అయితే ఈ రిజిస్ట్రేషన్ నంబర్ ఏ వాహనానికి వాడనున్నారో తెలియాల్సి ఉంది. నెంబర్ ప్లేట్ కే ఇంత డబ్బు ఖర్చు చేసారంటే ఖచ్చితంగా ఆ వాహనం కోట్ల విలువచేసేదే అయివుంటుంది.
ఇక TG 07 AA 0009 ఫ్యాన్సీ నంబర్ ను హైదరాబాద్ కు చెందిన మరో రియల్ ఎస్టేట్ సంస్థ రుద్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. అలాగే TG 07 AA 0001 నంబర్ ను ఫుజి సాప్ట్ వేర్ సొల్యూషన్స్ సంస్థ దక్కించుకుంది. ఈ నంబర్లను కూడా ఖరీదైన కార్లకోసమే కొనుగోలు చేసారు.