
DMart : సూపర్ మార్కెట్ కల్చర్ భారతదేశం బాగా పెరిగిపోయింది… ఎందుకంటే ఇక్కడ అన్ని వస్తువులు ఒకేచోట దొరికుతాయి. ఒక్కో వస్తువు కోసం ఒక్కోచోటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అందుకే గల్లీల్లో కిరాణా దుకాణాలు, చిన్నచిన్న రెడీమేడ్ షాపులు మూతపడుతున్నాయి... పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ వెలుస్తున్నాయి.
అయితే షాపింగ్ కల్చర్ మారిందికానీ ప్రజల తీరు మాత్రం మారలేదు... మరీముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎక్కడ తక్కువ ధరకు వస్తువులు దొరుకుతాయో వెతికి అక్కడే కొంటున్నారు. ఈ సీక్రెట్ పసిగట్టిన డీమార్ట్ ఇందుకు తగినట్లు వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. అందుకే చాలా సూపర్ మార్కెట్స్ మూతపడుతున్నా డీమార్ట్ మాత్రం సక్సెస్ ఫుల్ గా వ్యాపారం చేయగలుగుతోంది.
డీమార్ట్ లాభాల సంగతి అటుంచితే ఇక్కడ అవసరమైన సరుకులు కొనడం వల్ల మనకూ లాభమే. భయట మార్కెట్ ధరలతో పోలిస్తే తక్కువ ధరకే డీమార్ట్ లో వస్తువులు లభిస్తాయి... ఇంకా చెప్పాలంటే MRP కంటే తక్కువకే వస్తాయి. అందువల్లే డీమార్ట్ లో వస్తువులు కొనేందుకు ప్రజలు ఎగబడుతుంటారు... శని, ఆదివారం వచ్చిదంటే చాలు ఇక్కడికి వాలిపోతారు. ఒకేసారి నెలకు సరిపడా వస్తువులు కొంటుంటారు.
అయితే డీమార్ట్ లో ముందగానే తక్కువ ధరకు వస్తువులు లభిస్తాయి. వాటిని ఇంకా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. అన్నివస్తువులు కాదుగానీ కొన్నింటిని ఎప్పుడూ అమ్మేధర కంటే కొన్నిరోజుల్లో తక్కువ ధరకు అమ్మేస్తుంది డీమార్ట్. ఆరోజులేవి? ఎందుకలా తగ్గించి అమ్ముతుంది? తదితర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
డీమార్ట్ లో ఇంట్లోకి అవసరమయ్యే ప్రతి వస్తువు దొరుకుతుంది. చిన్న గుండుసూది నుండి వంటింట్లో వాడే ప్రతి ఐటెం, పిల్లల బొమ్మలు, బట్టలు, కూల్ డ్రింక్స్... ఇలా దొరకని వస్తువంటూ ఉండదు. అన్నీ ఒకేచోట దొరుకుతాయి... అదీ తక్కువధరకు... కాబట్టి ప్రజలు మరీముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలు డీమార్ట్ లో షాపింగ్ ను ఇష్టపడతారు. వీకెండ్ లో డీమార్ట్ కి వెళితే ఏదో సంతకు వెళ్లిన ఫీలింగ్ ఉంటుంది.. అంత రద్దీగా ఉంటుంది.
అంటే వీకెండ్ శని, ఆదివారమే డీమార్ట్ లో అత్యధిక బిజినెస్ జరుగుతుంది. కాబట్టి ఆరోజు అమ్మకుండా మిగిలిపోయిన వస్తువులను సోమవారం 'క్లీన్ అప్ సేల్' కు పెడతారు… ఇలా సాధారణంగా ఉండే ధరను మరింత తగ్గించి అమ్మేస్తారన్నమాట. కొన్ని వస్తువులకు డిస్కౌంట్ ఆఫర్లు పెడతారు.
అయితే ఇలా ప్రతి సోమవారం ప్రతి డిమార్ట్ లో ఇలా క్లీన్ అప్ సేల్ ఉండదు… దీనిపై ఆయా మార్ట్ నిర్వహణ బాధ్యతలు చేపట్టే ఉన్నత ఉద్యోగులు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఎప్పుడు ఏ డీమార్ట్ లో ఈ క్లీన్ అప్ సేల్ ఉంటుందో చెప్పడం కష్టం.
ఇక గిరాకీ ఎక్కువగా ఉండే శుక్ర, శని, ఆదివారమే వీలైనన్ని ఎక్కువ వస్తువులు అమ్మేందుకు డీమార్ట్ ప్రయత్నిస్తుంది... అందుకే ఈ మూడురోజులు ఎక్కువ ఆఫర్లు పెడుతుంటుంది. ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ, MRP కంటే భారీ తగ్గింపు వంటి బోర్డులు ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇలా క్లీన్ అప్ సేల్ అవసరం రాకుండా జాగ్రత్తపడతారు... ఒకవేళ ఆ అవసరం పడితే సోమవారం మరింత తక్కువ ధరలకు వస్తువులు అమ్మకానికి పెడతారు.
సాధారణంగా ఏ వ్యాపారంలో అయినా MRP కంటే కాస్త ఎక్కువ ధరకే వస్తువులను అమ్ముతుంటారు.. స్వయంగా వస్తువులను ఉత్పత్తిచేసేవారు కూడా లాభాలను చూసుకునే ధరను నిర్ణయిస్తారు. అలాంటిది డీమార్ట్ MRP కంటే తక్కువ ధరకే వస్తువులను ఎలా ఇస్తోంది? వీరి వ్యాపార రహస్యం ఏమిటి? అని చాలామందికి డౌట్ ఉంటుంది. దాన్ని ఇక్కడ క్లియర్ చేసుకుందాం.
డీమార్ట్ అనేది దేశవ్యాప్తంగా వ్యాపారాలు నిర్వహిస్తుంటుుంది... దీనికి దేశవ్యాప్తంగా వివిధ నగరాలు, పట్టణాల్లో 300 కు పైగా స్టోర్స్ ఉన్నాయి. కాబట్టి ఈ సంస్థ నేరుగా తయారీ కంపనీల నుండే వస్తువులను కొనుగోలు చేస్తుంది... మధ్యవర్తుల ప్రమేయం లేకపోవడంతో చాలా తక్కువ ధరకే డీమార్ట్ వస్తువుల కొంటుంది... అందువల్లే తక్కువ ధరకు అమ్మగలుగుతోంది.
ఒకేసారి భారీమొత్తంలో కొనడంవల్ల తయారీ కంపెనీలు కూడా చాలా తక్కువ ధరకే డీమార్ట్ కి వస్తువులను ఇస్తాయి. ఇందులోనూ తక్కువ మార్జిన్ చూసుకోవడం వల్ల బయటికంటే తక్కువ ధరకే డీమార్ట్ వస్తువులను అందించగలుగుతుంది. మార్జిన్ తక్కువగా ఉన్నా ఎక్కువమొత్తంలో అమ్మడంవల్ల లాభాలు కలిసివస్తాయి. ఇదే డిమార్ట్ బిజినెస్ సీక్రెట్ అని వ్యాపార నిపుణుల చెబుతున్నారు.
డీమార్ట్ ను అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ నిర్వహిస్తుంది. భారతీయులకు నిత్యావసర వస్తువులను ఒకేచోట అందించాలని భావించి ప్రముఖ షేర్ మార్కెట్ ఇన్వెస్టర్ రాధాకిషన్ దమానీ దీన్ని ప్రారంభించారు. 2002 లో ప్రారంభమైన ఈ డీమార్ట్ ప్రస్థానం రెండు దశాబ్దాలుగా సక్సెస్ ఫుల్ సాగుతోంది. 20 ఏళ్ల తర్వాత అంటే 2022 నాటికి డీమార్ట్ స్టోర్స్ సంఖ్య 306. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఇది విస్తరించింది.
గమనిక : ఏరోజు, ఏ వస్తువులపై ఎలాంటి డిస్కౌంట్స్ ఇవ్వాలో ఫైనల్ గా నిర్ణయించేది డీమార్ట్ నిర్వహకులే. బయట అందుబాటులో ఉన్న సమచారం మేరకు ఈ కథనంలో వివరాలను అందించాం.