
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు గణనీయమైన శుభవార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది చేతివృత్తులపై ఆధారపడుతున్న నేతన్నల ఆర్థిక భద్రత కోసం తాజాగా రూ. 48.8 కోట్లు కేటాయించింది. ఈ నిధులను ‘నేతన్నకు భరోసా’ పథకం కింద చేనేత కుటుంబాలకు అందించనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. మగ్గాలపై పనిచేస్తున్న వారికీ, సహాయంగా ఉన్న అనుబంధ కార్మికులకూ ఈ పథకం ద్వారా మద్దతు లభించనుంది.
ఈ ఆర్థిక సాయాన్ని వార్షికంగా రెండు విడతలుగా అందించనున్న ప్రభుత్వం, జియో ట్యాగ్ చేయబడిన మగ్గాలపై పనిచేస్తున్న కార్మికులే అర్హులని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా, కార్మికులకు సకాలంలో మొత్తం అందేలా చేయడం ద్వారా పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం కృషి చేస్తోంది.
నేతన్నకు భరోసా పథకం కింద, ప్రధాన కార్మికులకు సంవత్సరానికి రూ. 18 వేల చొప్పున, అనుబంధ కార్మికులకు రూ. 6 వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి. ఈ మేరకు నమోదు ప్రక్రియ కూడా త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
ఇక చేనేత కార్మికులపై ఉన్న వడ్డీలతో కూడిన వ్యక్తిగత రుణ భారం కూడా రాష్ట్ర ప్రభుత్వం చూసింది. ఈ రుణమాఫీని తక్షణమే అమలు చేయాలని తుమ్మల అధికారులకు ఆదేశించారు. దీని ద్వారా చేతివృత్తిని ఆధారంగా జీవిస్తున్న పేద కుటుంబాలపై ఉన్న ఆర్థిక ఒత్తిడి తగ్గనుంది.
ప్రత్యేకంగా రాష్ట్రంలో చేనేత విద్య, పరిశోధన అభివృద్ధికి మరో మెట్టుపెట్టింది ప్రభుత్వం. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి శాశ్వత భవనాలు నిర్మించనుంది. ఈ టెక్నాలజీ కేంద్రం చేనేత రంగానికి అవసరమైన ఆధునిక విద్యా శిక్షణలతో పాటు పరిశోధనకు కూడా దోహదం చేస్తుంది. దీంతో శిక్షణ పొందిన యువతకు అవకాశాలు పెరుగుతాయని అంచనా.
ఇంతలోనే తెలంగాణకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు కూడా దక్కింది. కేంద్ర టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ, తెలంగాణ రాష్ట్ర చేనేత సేవా కేంద్రాన్ని దేశంలోని ఉత్తమ ‘ప్రొడక్ట్ అండ్ డిజైన్ డెవలప్‌మెంట్’ విభాగానికి ఎంపిక చేసింది. ఈ పురస్కారాన్ని ఆగస్టు 7న ఢిల్లీలో నిర్వహించే 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అందుకోనున్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న 38 చేనేత సేవా కేంద్రాల పనితీరును సమీక్షించిన తర్వాతే ఈ గుర్తింపు తెలంగాణకు లభించింది. ఈ పురస్కారాన్ని చేనేత సేవా కేంద్రం డైరెక్టర్ అరుణ్ కుమార్ అందుకోనున్నారు. తెలంగాణకు ఈ గౌరవం దక్కడంలో కీలక పాత్ర పోషించిన ఆయన, ఇది రాష్ట్ర చేనేత కళాకారులకు మరింత ఉత్సాహాన్నిచ్చే అంశమని అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో చేనేత రంగం స్వతంత్ర భారతంలో ప్రత్యేకతను కలిగిన రంగాలలో ఒకటిగా నిలిచింది. పోచంపల్లి, గద్వాల్, నరాయణపేట వంటి ప్రాంతాల చేనేత వస్త్రాలు దేశవ్యాప్తంగా ఆదరణ పొందాయి. కానీ గత కొన్ని దశాబ్దాలుగా ఈ రంగం అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. అధికంగా మెకానికల్ ఫ్యాబ్రిక్ తయారీ పెరిగినప్పటికీ, చేనేత కళాకారుల ప్రాముఖ్యత తగ్గలేదు.ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఆర్థిక ప్యాకేజీ, విద్యా శిక్షణ, జాతీయ గుర్తింపు, తెలంగాణలో చేనేత రంగానికి ఒక పునరుత్థానంగా మారే అవకాశం ఉంది. కార్మికులకు స్థిరమైన ఆదాయం అందించి, వారి జీవిత నాణ్యతను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది
చేనేత రంగం కేవలం సంప్రదాయాల పరిరక్షణ మాత్రమె కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడే కీలక వనరు. కేంద్రం నుండి వచ్చిన గౌరవం, రాష్ట్రం చేపట్టిన చర్యలు, కలిసి చేనేత రంగాన్ని పునర్నిర్మించేందుకు దోహదం చేయనున్నాయి. ఆధునికత, సాంకేతికతతో మేళవించిన ఈ రంగం, వచ్చే రోజుల్లో తెలంగాణలో ప్రత్యేకమైన ఆదాయ వనరుగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.