Weather Update: బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలుల హెచ్చరికలు

Published : Oct 09, 2026, 07:44 AM IST

Weather Update: బంగాళాఖాతంలో ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు ఉంటాయని పేర్కొంటూ ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ ప్రకటించింది.

PREV
16
ఏపీ, తెలంగాణకు భారీ వర్ష హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలర్ట్

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రాబోయే రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని, పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని ఐఎండీ తెలిపింది. పలు ప్రాంతాలకు అలర్ట్ ప్రకటించింది.

26
బంగాళాఖాతంలో అలజడి.. ఈశాన్య రుతుపవనాల రాకముందే వాయుగుండం

బంగాళాఖాతంలో చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులతో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడనున్నాయి. ఈ నెల 13 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ బులెటిన్‌లో తెలిపింది. ఇది రాబోయే నాలుగు రోజుల్లో వాయువ్య దిశగా ప్రయాణించి మరింత బలపడనుంది. ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించక ముందే ఇది వాయుగుండంగా మారి దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు తీరాల వైపు దూసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ఈ నెల 15 తర్వాత కోస్తాంధ్రలో వర్షాల తీవ్రత విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.

36
ఆంధ్రప్రదేశ్‌కు ఎల్లో, ఆరెంజ్ వార్నింగ్‌లు

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మధ్యాహ్న సమయాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతుండగా, సాయంత్రానికి వాతావరణం మారిపోతోంది. వాతావరణ శాఖ ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, పశ్చిమ గోదావరి, నెల్లూరుతో పాటు రాయలసీమలోని తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది. భారీ వర్షాలు వస్తే వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించింది.

46
తెలంగాణలో పిడుగుల ముప్పు.. ఈ జిల్లాల్లో జాగ్రత్త

తెలంగాణలోని తూర్పు, దక్షిణ జిల్లాల్లో రాబోయే 48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ కేంద్రం ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ మహానగరంలో ఉదయం వేళ పొగమంచు వాతావరణం ఉన్నప్పటికీ, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే సూచనలు ఉన్నాయి. వర్షం కురిసే సమయంలో పిడుగులు పడే తీవ్ర ప్రమాదం ఉన్నందున చెట్ల కింద నిలబడటం లేదా విద్యుత్ స్తంభాల వద్ద ఉండటం తగదని అధికారులు స్పష్టం చేశారు.

56
నైరుతి వెనుకంజ.. వర్షాభావంతో రైతన్నకు కోలుకోలేని దెబ్బ

మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాలు క్రమక్రమంగా తిరోగమనం పడుతున్నాయి. ఈసారి నైరుతి కాలంలో ఎల్‌నివో ఎఫెక్ట్ వల్ల సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువ కురిసింది. వర్షాలు లేక పంట సాగు కాక రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రాంతాలను కరవు మండలాలుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చివరి దశలో వస్తున్న ఈ వర్షాలు ఎండబెట్టిన పంటలకు కొంతవరకు ఊరటనిచ్చినా, కోత దశలో ఉన్న పొలాలకు నష్టం కలిగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

66
జనాలు, రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తీరం వెంబడి ఈదురుగాలులు బలంగా వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశించారు. ఈదురుగాలులు వీచే సమయంలో రోడ్లపై వెళ్లే వాహనదారులు, ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిదని ఐఎండీ సూచించింది. ఇక పొలాల్లో ఉన్న రైతులు వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, కోసిన పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని వాతావరణ నిపుణులు కోరుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories