భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అమరావతి వాతావరణ కేంద్రం ఆంధ్రప్రదేశ్, యానాంకు ఏడు రోజుల వాతావరణ సూచన, రైతుల బులెటిన్‌ను విడుదల చేసింది. కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమ సబ్‌డివిజన్‌లలో ఈ వారం వర్షాలతో పాటు పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.
సోమవారం (నవంబర్ 23) కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో మెరుపులతో కూడిన ఉరుములు, గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మంగళవారం, బుధవారం, గురువారం కూడా ఇదే తరహా వాతావరణం కొనసాగనుంది.
ఈ వారంలో చివర నుంచి అంటే శుక్రవారం నుంచి కోస్తా ఆంధ్ర, యానాం, రాయలసీమలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.