
Chukka Ramaiah : ఇప్పుడు ఐఐటి గురించి అందరికీ తెలుసు. ప్రతిష్ఠాత్మకమైన ఈ విద్యాసంస్థల్లో చదవాలంటే కఠినమైన పోటీ పరీక్ష రాసి అర్హత సాధించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా లక్షలమంది ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే కేవలం వేలల్లోనే ఐఐటీ సీటు సాధిస్తారు. అందుకే స్కూల్ దశనుండే తమ పిల్లలను ఐఐటి కోసం ప్రిపేర్ చేస్తుంటారు తల్లిదండ్రులు. కొన్ని స్కూళ్లు, కాలేజీలు ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ జెఈఈ ప్రిపరేషన్ పేరుతోనే నడుస్తున్నాయి.
అయితే 20-30 ఏళ్ల కింద చాలామందికి ఐఐటి గురించి తెలియదు. అసలు ఈ విద్యాసంస్థల్లో ఏం బోధిస్తారు? ఎక్కడున్నాయి? అనేదే తెలియదు... కాబట్టి ఎంట్రన్ ఎగ్జామ్ జెఈఈ గురించి చర్చే ఉండేది కాదు. ఇలాంటి సమయంలో తెలుగు విద్యార్థులకు ఐఐటీని పరిచయం చేసిన ఘనత ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యది. ఇతడు స్థాపించిన రామయ్య ఐఐటి ఇన్స్టిట్యూట్స్ లో చదివి చాలామంది ఐఐటి ర్యాంకులు సాధించారు... ప్రస్తుతం దేశవిదేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఇలా తెలుగువారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన రామయ్య వయసు 100 ఏళ్లు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ఇంటికివెళ్లారు… దీంతో మరోసారి రామయ్య పేరు వార్తల్లో నిలిచింది.
ఇంతకీ ఎవరీ రామయ్య? ఆయన బాల్యం, విద్యాభ్యాసం ఎలా సాగింది? చుక్కా రామయ్య కాస్త ఐఐటి రామయ్యగా ఎలా మారారు? చట్టసభలోకి ఎలా అడుగుపెట్టారు? ఇలాంటి ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణకు చెందిన ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉధ్యమకారుడు చుక్కా రామయ్య సొంత రాష్ట్రం తెలంగాణే. దేశ స్వాతంత్య్రానికి ముందే ఆయన జన్మించారు... 1925 సంవత్సరంలో సరిగ్గా ఇదేరోజు (నవంబర్ 20న) ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలం గూడూరు ఆయన స్వగ్రామం. నరసమ్మ, అనంత రామయ్య దంపతుల తొలి సంతానం ఈయనే. తర్వాత ఇద్దరు ఆడపిల్లలు, మరో మగపిల్లాడు కూడా ఈ దంపతులకు జన్మించారు... అంటే రామయ్యకు ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు.
రామయ్య తండ్రి ఓ సామాన్య పురోహితుడు... చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని, పిల్లలను పోషించేవాడు. అయితే రామయ్య 14 ఏట తండ్రి హఠాత్తుగా మరణించాడు... దీంతో కుటుంబ భారం తల్లి నరసమ్మపై పడింది. ఆమె ఎంతో కష్టపడి పిల్లలను పెంచింది.
రామయ్య ప్రాథమిక విద్యాభ్యాసం స్వస్థలంలోనే సాగింది. చదువులో మంచి చురుకైన విద్యార్థి కావడంతో ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ నరసమ్మ కొడుకుని చదివించేది. తల్లి కష్టాన్ని చూస్తూ పెరిగిన రామయ్య కూడా బాగా చదివేవారు. స్థానికంగానే ఇంటర్మీడియట్ వరకు చదివిన ఇతడు డిగ్రీ కోసం హైదరాబాద్ లో అడుగుపెట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీతో పాటు ఎమ్మెస్సీ పూర్తిచేశారు. ఇలా చదువుకునే రోజుల్లోనే అతడిలో అభ్యుధయ బావాలు ఏర్పడ్డాయి... సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచన కలిగింది.
హైదరాబాద్ లో ఉన్నత విద్యను పూర్తిచేసిన రామయ్య ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్నారు. ప్రస్తుత జనగామ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయుడిగా చేరారు... అనంతరం తెలంగాణలోని అనేక పాఠశాలల్లో పనిచేశారు. 1983లో నాగార్జున సాగర్ లోని రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేశారు. సర్వీస్ లో ఉండగా ఉపాధ్యాయ సంఘాల్లో చురుగ్గా ఉండేవారు రామయ్య.
అభ్యుదయ భావాలు కలిగిన రామయ్య యువతకు అవకాశం ఇవ్వాలని తన ఉద్యోగాన్ని వదులుకున్నారు.. స్వచ్చంద పదవీ విరమణ తీసుకున్నారు. ఆ తర్వాత తెలుగు విద్యార్థులను ఐఐటి పరీక్ష కోసం కోచింగ్ ఇవ్వడం ప్రారంభించారు.
తెలుగు రాష్ట్రాల నుండి ఐఐటి (Indian Institutes of Technology) కి చాలా తక్కువ మంది ఎంపిక అవుతున్నారని అనాడే రామయ్య గుర్తించారు. అందుకే తెలుగు విద్యార్థులకు అత్యంత కఠినమైన ఈ పోటీ పరీక్షకు సిద్దం చేయాలని నిర్ణయించుకున్నారు. బాసరలోని సరస్వతి దేవిని దర్శించుకుని మొదట సొంత కూతురికి ఐఐటికి సంసిద్దం చేశారు. ఆమె ఐఐటికి ఎంపికయ్యాక రామయ్యపేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగింది.
హైదరాబాద్ నల్లకుంటలోని తన ఇంటివద్దే ఐఐటి జెఈఈ ప్రవేశ పరీక్షకు విద్యార్థులను సిద్దం చేసేవారు. అతడిదగ్గర శిక్షణ పొందిన విద్యార్థులు ఐఐటీ సీట్లు సాధించడంతో పోటీ పెరిగింది... దీంతో రామయ్య ఇన్స్టిట్యూట్స్ ను స్థాపించారు. ఇందులో చేరాలంటే ప్రత్యేకంగా పవేశ పరీక్ష నిర్వహించేవారు. ఇలా వేలాదిమందికి శిక్షణ ఇచ్చి ఐఐటియన్లుగా తీర్చిదిద్దారు... దీంతో చుక్కా రామయ్య పేరు కాస్త ఐఐటి రామయ్యగా మారింది.
చదువుకునే రోజుల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు రామయ్య. నిజాం పాలనకు, రజాకార్లు అరాచకాలకు, భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారు.. ఈ క్రమంలో జైలుకు కూడా వెళ్లారు. అస్పృశ్యతా వ్యతిరేక ఉద్యమంలో కూడా పాల్గొన్నారు... దీంతో ఆయనతో పాటు కుటుంబసభ్యులు ఇబ్బందులు ఎదర్కొన్నారు.
ఇక ఉపాధ్యాయుడిగా పనిచేసే సమయంలో వివిధ ఉద్యోగ సంఘాల్లో చురుగ్గా ఉండేవారు. ఆ తర్వాత కూడా ఐఐటి కోచింగ్ ద్వారా ఉపాధ్యాయుడిగానే కొనసాగారు. దీంతో ఉమ్మడి ఖమ్మం, వరంగంల్, నల్గొండ జిల్లాల నుండి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రామయ్యకు అవకాశం దక్కింది. ఇలా చట్టసభలో అడుగుపెట్టిన రామయ్య ప్రజలకోసం అనేకసార్లు గొంతెత్తారు.