
సంక్రాంతి అంటే కేవలం పంటలు, పిండివంటల పండుగ మాత్రమే కాదు, ఇది ఆధ్యాత్మికంగా అత్యంత విశిష్ఠమైన పుణ్యకాలం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ పవిత్ర సమయంలో దైవ దర్శనం చేసుకోవడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతాయి. ఈ పర్వదినాల్లో శివకేశవులను ఇద్దరినీ సమానంగా ఆరాధించడం, అలాగే ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.
సంక్రాంతి రోజుల్లో భక్తిశ్రద్ధలతో కొన్ని విశేషమైన ఆలయాలను సందర్శిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సుఖం కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి ఈ సంక్రాంతికి మీరు తప్పకుండా దర్శించాల్సిన తెలుగు రాష్ట్రాల్లోని టాప్ 6 ఆలయాలు గమనిస్తే..
సంక్రాంతి అంటేనే సూర్యుడి పండుగ. కాబట్టి ఈ జాబితాలో మొదటి స్థానం ప్రత్యక్ష దైవానిదే. శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి క్షేత్రం ఆంధ్రప్రదేశ్‌లోని ఏకైక, అత్యంత పురాతన సూర్య దేవాలయం. మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడు తన గతిని మార్చుకుని ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు.
అందుకే ఈ రోజున ఇక్కడ స్వామివారికి జరిగే పూజలు చాలా విశిష్టమైనవి. పండుగ రోజున ఇక్కడ స్వామివారికి క్షీరాభిషేకం, విశేష అలంకరణలు జరుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, ఐశ్వర్యం కోరుకునేవారు సంక్రాంతి రోజున అరసవిల్లి సూర్యుడిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల క్షేత్రం సంక్రాంతి శోభతో వెలిగిపోతుంది. సంక్రాంతి పండుగను కొత్త ఆరంభానికి సూచికగా భావిస్తారు. లక్ష్మీదేవితో కూడిన వేంకటేశ్వరుడిని ఈ పవిత్ర దినాన దర్శించుకోవడం వల్ల ధన, ధాన్య వృద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం.
ముఖ్యంగా వ్యాపారులు, ఉద్యోగస్తులు, ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు సంక్రాంతి రోజున స్వామివారిని దర్శించుకుంటే ఆ ఏడాది అంతా లాభదాయకంగా ఉంటుందని భావిస్తారు. పండగ రోజుల్లో ఆలయం విద్యుత్ దీపాల అలంకరణలతో, ఉత్సవ శోభతో భక్తులకు కనువిందు చేస్తుంది.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం.. సంక్రాంతికి దర్శించాల్సిన మరో ముఖ్యమైన క్షేత్రం. సంక్రాంతి రోజున శివుడికి అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని శాస్త్ర వచనం. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం వల్ల పాపాలు తొలగిపోతాయనీ, మానసిక శాంతి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
ముఖ్యంగా కుటుంబంలో గొడవలు, సమస్యలతో బాధపడేవారు ఈ పుణ్యక్షేత్రంలో పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆరోగ్యం, శాంతి, సంతాన సమస్యలు ఉన్నవారికి శ్రీశైల క్షేత్ర దర్శనం అనుకూలమని పండితులు సూచిస్తారు.
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి క్షేత్రం.. సంక్రాంతికి భక్తులతో కిటకిటలాడుతుంది. నూతన ఆలయ నిర్మాణం తర్వాత ఈ క్షేత్ర వైభవం మరింత పెరిగింది. సంక్రాంతి రోజున ఉగ్ర నరసింహుడిని శాంత రూపంలో దర్శించుకోవడం వల్ల భయాలు తొలగిపోతాయి.
శత్రు బాధల నుంచి విముక్తి కలగాలన్నా, మనోబలం, ధైర్యం కావాలన్నా సంక్రాంతి రోజున యాదాద్రీశుడిని దర్శించుకోవడం ఉత్తమం. గ్రహ దోష నివారణకు కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది.
పిల్లల చదువు, భవిష్యత్తు గురించి ఆలోచించే తల్లిదండ్రులకు బసర అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం. గోదావరి తీరంలో వెలసిన ఈ అమ్మవారు విద్య, జ్ఞానానికి ప్రతీక. సంక్రాంతి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి అనేకమంది భక్తులు ఇక్కడికి వస్తారు.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారు సంక్రాంతి నాడు సరస్వతీ దేవి ఆశీస్సులు తీసుకుంటే విజయం వరిస్తుందని నమ్మకం. విద్యార్థులకు ఇది బెస్ట్ డెస్టినేషన్.
రత్నగిరిపై కొలువైన సత్యదేవుడు కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ప్రసిద్ధి. సంక్రాంతి పర్వదినాన సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం అత్యంత ఫలప్రదం. కొత్తగా పెళ్లయిన జంటలు, కుటుంబ సమేతంగా వెళ్లే వారికి ఇది అద్భుతమైన క్షేత్రం.
కుటుంబ ఐక్యత కోసం, ఇంట్లో శుభకార్యాలు జరగడం కోసం ఇక్కడ వ్రతాలు చేస్తుంటారు. కొండపై ఉండే ఆలయ వాతావరణం, ఆధ్యాత్మిక అనుభూతిని రెట్టింపు చేస్తుంది. కుటుంబ సుఖశాంతుల కోసం అన్నవరం వెళ్లడం శ్రేయస్కరం.
కాగా, సంక్రాంతి సెలవులు కావడంతో పైన పేర్కొన్న అన్ని ఆలయాల్లోనూ భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. కాబట్టి, సాధ్యమైనంత వరకు ముందుగానే దర్శన టికెట్లు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం ఉత్తమం. వృద్ధులు, చిన్నపిల్లలతో వెళ్లేవారు తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళల్లో దర్శనానికి ప్లాన్ చేసుకోవడం మంచిది.