నకిలీ యాప్ డౌన్‌లోడ్.. బంగారం తాకట్టు పెట్టి పెట్టుబడులు
నేరగాళ్ల వ్యూహంలో భాగంగా, బాధితురాలి చేత MCKIEY CM అనే ఒక నకిలీ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేయించారు. అందులో ట్రేడింగ్ ఖాతా తెరిపించారు. ఆ యాప్‌లో లాభాలు వస్తున్నట్లు గ్రాఫిక్స్ చూపించి ఆమెను మరింత ఊరించారు. దీంతో 2025 డిసెంబర్ 24 నుండి 2026 జనవరి 5 మధ్య కాలంలో ఊర్మిళ విడతలవారీగా భారీ మొత్తంలో డబ్బును బదిలీ చేశారు.
మొత్తం 19 లావాదేవీల ద్వారా రూ. 2.58 కోట్లను నేరగాళ్లు సూచించిన వివిధ బ్యాంకు ఖాతాలకు పంపించారు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే.. ఈ పెట్టుబడి కోసం ఆమె తన వద్ద ఉన్న బంగారంతో పాటు, భర్త లక్ష్మీనారాయణకు చెందిన బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు.
విత్‌డ్రా కాకపోవడంతో పోలీసుల ఆశ్రయం
యాప్‌లో చూస్తే లాభాలు భారీగా కనిపిస్తున్నాయి, కానీ ఆ డబ్బును విత్‌డ్రా చేసుకునే ఆప్షన్ మాత్రం పనిచేయడం లేదు. దీని గురించి దినేష్ సింగ్‌ను ప్రశ్నించగా.. "మరింత డబ్బు పెట్టుబడి పెడితేనే విత్‌డ్రా సాధ్యమవుతుంది, లేకపోతే ఉన్న డబ్బు కూడా పోతుంది" అని బెదిరించడం మొదలుపెట్టారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన ఊర్మిళ వెంటనే అప్రమత్తమయ్యారు.
ఆలస్యం చేయకుండా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో బాధితురాలు పంపిన డబ్బును నేరగాళ్లు వెంటనే వేరువేరు మ్యూల్ ఖాతాలకు మళ్లించినట్లు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
ఈ ఘటనతోనైనా ప్రజలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే పెట్టుబడి సలహాలను గుడ్డిగా నమ్మవద్దని, అధికారిక యాప్స్ ద్వారా మాత్రమే లావాదేవీలు జరపాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.