Google Mosquito: ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ పేరు వినగానే టెక్నాలజీ గుర్తొస్తుంది. అయితే అలాంటి ఈ కంపెనీ ఇప్పుడు దోమలను రూపొందిస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ గూగుల్ దోమలను తయారు చేయడం ఏంటనేగా సందేహం.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది డెంగీ, జికా, చికున్‌గున్యా, వెస్ట్ నైల్ వైరస్ వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సమస్యను తగ్గించేందుకు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు చెందిన "వెరిలీ" విభాగం "డీబగ్ ప్రాజెక్ట్" పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా అమెరికాలోని కాలిఫోర్నియా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో రెండు సంవత్సరాల వ్యవధిలో మొత్తం 3.2 కోట్ల ప్రత్యేక మగ దోమలను విడుదల చేయాలని సంస్థ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ ప్రణాళికకు అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ (EPA) అనుమతుల ప్రక్రియ కొనసాగుతోంది.
25
ఈ దోమలు సాధారణ దోమలు కావు
గూగుల్ విడుదల చేయబోయే దోమలు ల్యాబ్‌లలో ప్రత్యేకంగా పెంచిన మగ దోమలు. వీటిలో "వోల్బాకియా" (Wolbachia) అనే సహజసిద్ధమైన బ్యాక్టీరియా ఉంటుంది. ఈ మగ దోమలు ప్రకృతిలో ఉన్న ఆడ దోమలతో జతకట్టినప్పుడు గుడ్లు ఏర్పడతాయి. అయితే ఆ గుడ్లు పొదగవు. ఫలితంగా కొత్త దోమలు పుట్టకపోవడంతో కాలక్రమేణా దోమల జనాభా గణనీయంగా తగ్గుతుంది. ఈ విధానంలో రసాయన పురుగుమందులు అవసరం లేకుండానే దోమల నియంత్రణ సాధ్యమవుతుంది.
35
ప్రజలకు ఎలాంటి ప్రమాదం ఉండదా?
చాలామందికి "ఇప్పటికే దోమలు ఎక్కువగా ఉన్నాయి.. మరి కోట్లాది దోమలను విడుదల చేస్తే పరిస్థితి మరింత దిగజారదా?" అనే సందేహం రావచ్చు. అయితే శాస్త్రవేత్తలు చెబుతున్నదేమిటంటే.. విడుదల చేసేది కేవలం మగ దోమలనే. సాధారణంగా మనుషులను కుట్టేది ఆడ దోమలు మాత్రమే. మగ దోమలు మొక్కల నుంచి లభించే రసాలను తాగి జీవిస్తాయి. కాబట్టి ఈ దోమల వల్ల ప్రజలకు నేరుగా ఎలాంటి హాని ఉండదని నిపుణులు చెబుతున్నారు.
దోమల నియంత్రణ కోసం వంధ్యీకరణ పద్ధతిని ఉపయోగించడం కొత్త విషయం కాదు. అమెరికా, బ్రెజిల్, పనామా, కేమన్ దీవులు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే ఇలాంటి ప్రయోగాలు నిర్వహించారు. కొన్ని అధ్యయనాల ప్రకారం లక్ష్యంగా పెట్టుకున్న దోమల జనాభా 80 నుంచి 90 శాతం వరకు తగ్గిన సందర్భాలు ఉన్నాయి. ఇదే సూత్రాన్ని ఉపయోగించి పంటలకు హాని చేసే కొన్ని ఈగలు, పశువులకు ప్రమాదకరమైన పురుగులను కూడా గతంలో విజయవంతంగా నియంత్రించారు. ఈ అనుభవాల ఆధారంగానే గూగుల్ ఇప్పుడు మరింత పెద్ద స్థాయిలో ప్రయోగం చేపట్టాలని భావిస్తోంది.
55
పర్యావరణవేత్తల ఆందోళనలు
అయితే ఈ ప్రాజెక్టుపై కొన్ని సందేహాలు, విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రకృతిలో కోట్లాది దోమలను విడుదల చేయడం వల్ల పర్యావరణ సమతుల్యతపై ప్రభావం పడుతుందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. దోమలను ఆహారంగా తీసుకునే పక్షులు, చేపలు, ఇతర జీవులపై దీని ప్రభావం ఏమిటన్న అంశాన్ని పరిశీలించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. అందుకే అమెరికా అధికారులు ప్రజల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రజారోగ్య రంగంలో కొత్త అధ్యాయం కావొచ్చు
ప్రస్తుతం డెంగీ, జికా, చికున్‌గున్యా, వెస్ట్ నైల్ వైరస్ వంటి వ్యాధులు ప్రపంచానికి పెద్ద సవాలుగా మారాయి. రసాయనాల వినియోగం తగ్గిస్తూ, సహజసిద్ధమైన జీవశాస్త్ర పద్ధతులతో దోమల నియంత్రణ సాధ్యమైతే అది ప్రజారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పుగా నిలవొచ్చు. గూగుల్ చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా దోమల నియంత్రణకు కొత్త మార్గదర్శకంగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.