AI Governance: మాటలతో కాదు.. కఠిన చట్టాలతోనే ఏఐకి నియంత్రణ

Published : Sep 18, 2026, 08:45 PM IST

Artificial Intelligence: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సామర్థ్యాలు వేగంగా పెరుగుతున్న కొద్దీ.. వాటి దుర్వినియోగం కూడా కొత్త రూపాలు దాలుస్తోంది. తాజాగా ఆంత్రోపిక్‌ విడుదల చేసిన థ్రెట్‌ ఇంటెలిజెన్స్‌ రిపోర్టులో విస్తుపోయే విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

PREV
15
ఏఐ ఇక కేవలం టూల్‌ కాదు.. ఆపరేషన్లను నడిపించే స్థాయికి

గతంలో ఏఐను ప్రధానంగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, కంటెంట్‌ తయారు చేయడం లేదా కోడింగ్‌లో సహాయం చేసే టూల్‌గా చూశారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఏఐని ఇతర సాఫ్ట్‌వేర్‌, క్లౌడ్‌ సర్వీసులు, సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లు వంటి వాటితో అనుసంధానం చేసి ఒక ఆపరేషన్‌లోని అనేక దశలను నిర్వహించేలా ఉపయోగిస్తున్నారు.

ఆంత్రోపిక్‌ రిపోర్టులోని కొన్ని కేసులు ఇదే విషయాన్ని చూపిస్తున్నాయి. ఉదాహరణకు బంగ్లాదేశ్‌కు సంబంధించిన ఒక ప్రచారంలో ఏఐ ద్వారా కంటెంట్‌ తయారు చేయడం, దాన్ని వీడియోలుగా మార్చడం, సోషల్‌ మీడియా ప్రచురణలను ముందుగానే షెడ్యూల్‌ చేయడం వంటి పనులు ఆటోమేట్‌ చేసినట్లు సంస్థ వివరించింది. తక్కువ మంది వ్యక్తులతో పెద్ద స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏఐ సహాయపడుతున్నట్లు రిపోర్టు పేర్కొంది. దీంతో గతంలో ఎక్కువ నైపుణ్యం, ఎక్కువ మంది సిబ్బంది అవసరమైన కొన్ని పనులను ఇప్పుడు తక్కువ వనరులతో నిర్వహించే అవకాశం ఏర్పడుతోంది. దీనినే ఏఐ వల్ల కలిగే ‘అప్‌లిఫ్ట్‌’గా ఆంత్రోపిక్‌ వివరిస్తోంది.

25
ఏఐ దుర్వినియోగం ప్రజాస్వామ్యానికి కూడా సవాలే

ఏఐ ఆధారిత తప్పుడు సమాచార ప్రచారం ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆంత్రోపిక్‌ రిపోర్టులో వివిధ దేశాలకు సంబంధించిన ప్రభావ కార్యకలాపాల్లో నకిలీ కంటెంట్‌, నకిలీ సోషల్‌ మీడియా ఖాతాలు, రాజకీయ కథనాలను విస్తృతంగా ప్రచారం చేయడం వంటి పద్ధతులను గుర్తించినట్లు తెలిపింది. కొన్ని కార్యకలాపాలు ఎన్నికలకు ముందు కూడా నిర్వహించినట్లు రిపోర్టులో పేర్కొంది. భారత్‌ వంటి భారీ, బహుభాషా ప్రజాస్వామ్య దేశానికి ఇది ప్రత్యేకంగా ప్రాధాన్యమున్న అంశం. ఒకే కంటెంట్‌ను అనేక భాషల్లోకి మార్చి పెద్ద సంఖ్యలో ప్రజలకు చేరవేయడం గతంతో పోలిస్తే చాలా సులభంగా మారింది. అందుకే రాజకీయ లేదా ప్రజా ప్రయోజనానికి సంబంధించిన ఏఐ కంటెంట్‌ విషయంలో దాని మూలాన్ని గుర్తించే విధానాలు, ప్లాట్‌ఫామ్‌ల బాధ్యత, తప్పుడు ప్రచారాన్ని గుర్తించే వ్యవస్థలు వంటి అంశాలపై చట్టపరమైన చర్చ అవసరమవుతోంది.

35
నిఘా, ఆయుధాల అభివృద్ధిలోనూ ఏఐ వినియోగం

ఏఐ దుర్వినియోగం కేవలం ఫేక్‌ న్యూస్‌ లేదా సైబర్‌ దాడులకే పరిమితం కావడం లేదు. నిఘా వ్యవస్థలు, వ్యక్తుల సమాచారాన్ని విశ్లేషించడం, ఆయుధాల అభివృద్ధికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ తయారీ వంటి రంగాల్లో కూడా ఏఐను ఉపయోగించిన కేసులను ఆంత్రోపిక్‌ గుర్తించింది. ఆంత్రోపిక్‌ ఫ్రాంటియర్‌ రెడ్‌ టీమ్‌ నిర్వహించిన పరీక్షల్లో కొన్ని సైనిక, ఇంటెలిజెన్స్‌ పనులను గతంలో ప్రత్యేక శిక్షణ పొందిన నిపుణులు మాత్రమే చేయగలిగే స్థాయిలో ఉండగా.. కొన్ని ఏఐ మోడళ్లు ఇప్పుడు వాటిలో ఉపయోగకరమైన సామర్థ్యాలను చూపించాయని సంస్థ తెలిపింది. ఆయుధాల అభివృద్ధి, టార్గెటింగ్‌ వంటి రంగాల్లో ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్నాయని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏఐని ఎవరు ఉపయోగిస్తున్నారు? ఏ ప్రయోజనం కోసం ఉపయోగిస్తున్నారు? ఏ డేటాకు యాక్సెస్‌ ఇస్తున్నారు? ఏ పనులను స్వయంగా చేయడానికి అనుమతిస్తున్నారు? అనే ప్రశ్నలకు స్పష్టమైన నియమాలు అవసరమవుతున్నాయి.

45
చట్టం అవసరం

ఏఐ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌లలో గుర్తించిన దుర్వినియోగాన్ని స్వయంగా వెల్లడించడం ఉపయోగకరమే. ఆంత్రోపిక్‌ కూడా తాను గుర్తించిన కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు సంబంధిత సమాచారాన్ని అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వాలు, ఇతర సంస్థలతో పంచుకున్నట్లు తెలిపింది. అయితే విమర్శకుల వాదన ప్రకారం.. సంస్థలు స్వచ్ఛందంగా వెల్లడించే సమాచారం మాత్రమే ఆధారంగా మొత్తం ఏఐ పాలనను నిర్మించడం సరిపోదు. పెద్ద స్థాయిలో పనిచేసే ఏఐ ప్లాట్‌ఫామ్‌లకు తప్పనిసరి రిపోర్టింగ్‌, స్వతంత్ర ఆడిట్‌, భద్రతా పరీక్షలు, దుర్వినియోగ ఘటనల వెల్లడింపు వంటి బాధ్యతలను చట్టంలో స్పష్టంగా పేర్కొనాల్సిన అవసరం ఉంది. అలాగే ఏఐ ఏజెంట్లు కేవలం సమాచారం అందించే స్థాయిని దాటి వాస్తవ ప్రపంచంలో చర్యలు తీసుకునే పరిస్థితి వస్తున్నందున.. వాటి బాధ్యతను కూడా ప్రస్తుత ప్లాట్‌ఫామ్‌ నియమాల్లో స్పష్టంగా చేర్చాల్సి ఉంటుంది.

55
భారత్‌ ముందుండాల్సిన అవసరం ఉందనే వాదన

భారత్‌లో ఇప్పటికే డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, యూపీఐ, ఆధార్‌, ఐటీ నియమాలు వంటి భారీ స్థాయి టెక్నాలజీ వ్యవస్థలు అమలులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏఐకి కూడా స్పష్టమైన చట్టపరమైన భద్రతా వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెద్ద ఏఐ ప్లాట్‌ఫామ్‌లు గుర్తించిన తీవ్రమైన దుర్వినియోగాన్ని సంబంధిత సైబర్‌ భద్రతా సంస్థలకు నివేదించడం, ఏఐ ద్వారా తయారైన రాజకీయ లేదా ప్రజా ప్రయోజన కంటెంట్‌కు స్పష్టమైన గుర్తింపు ఇవ్వడం, ఏఐ ఏజెంట్ల కార్యకలాపాలపై బాధ్యతను నిర్ణయించడం వంటి అంశాలు ఇందులో భాగం కావచ్చు.

మొత్తంగా చూస్తే.. ఏఐ అభివృద్ధిని ఆపేయాలా అనే ప్రశ్న కంటే, దాని వేగానికి అనుగుణంగా పాలనా వ్యవస్థలను ఎంత త్వరగా రూపొందించాలనే ప్రశ్నే ముఖ్యంగా మారుతోంది. ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్న కొద్దీ భద్రత, పారదర్శకత, బాధ్యత కూడా అదే స్థాయిలో పెరగాల్సిన అవసరం ఉంది. AI సంస్థల స్వచ్ఛంద చర్యలతో పాటు ప్రభుత్వాల చట్టపరమైన పర్యవేక్షణ కూడా కీలకంగా మారుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories