Dr Narinder Singh Kapany
ఇప్పుడు మనం ఇంత హై స్పీడ్ ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నామంటే దానికి కారణం ఫైబర్ ఆప్టిక్స్. అయితే ఇలాంటి అద్భుత ఆవిష్కరణకు కారణమైన వ్యక్తి ఎవరో తెలుసా.? ఆ గొప్ప సైంటిస్ట్ పేరు డాక్టర్ నరేందర్ సింగ్ కపానీ. నరేందర్ ఇండియాలోని పంజాబ్‌లో పుట్టారు. విద్యాభ్యాసం ముగిసిన తర్వాత పై చదువుల నిమిత్తం ఆయన అమెరికా వెళ్లారు. అనంతరం పెద్ద భౌతిక శాస్త్రవేత్తగా పేరు సంపాదించుకున్నారు. నరేందర్ దాదాపు యాభై ఏళ్ళ క్రితమే ఫైబర్ ఆప్టిక్స్‌ను కనిపెట్టారు. ఇది ఈ రోజుల్లో సమాచారం పంపే, తీసుకునే విధానాన్ని పూర్తిగా మార్చేసింది.
Reliance Optical Fiber
డాక్టర్ నరీందర్ సింగ్ 94 ఏళ్ళ వయసులో 2020 డిసెంబర్ 4న చనిపోయారు. 2021లో ఆయనకు మరణానంతరం ఇండియాలో రెండో అతిపెద్ద పౌర పురస్కారం పద్మ విభూషణ్‌తో సత్కరించింది భారత ప్రభుత్వం. నరేందర్ సింగ్ కపానీని 1999లో ఫార్చ్యూన్ మ్యాగజైన్ నోబెల్ బహుమతికి అర్హత కలిగిన ఆవిష్కరణ చేసిన 20వ శతాబ్దపు ఏడుగురు వ్యక్తుల్లో ఒకరిగా గౌరవించింది. 1940ల చివర్లో కపానీ పాత సైన్స్‌కు సవాల్ విసిరారు. కాంతి సూటిగా మాత్రమే ఎందుకు వెళ్తుందన్న విషయాన్ని ఆయన ప్రశ్నించారు.
1953లో ఆయన ఫైబర్ ఆప్టిక్స్ కనిపెట్టారు. మనిషి వెంట్రుకల కంటే కొంచెం లావుగా ఉండే ఫైబర్ ద్వారా మంచి క్వాలిటీ ఉన్న ఫోటోలు పంపించారు. ఇది ఒక పెద్ద మార్పు. ఆయన తన ఆవిష్కరణతో ప్రపంచానికి కొత్త దారిని చూపించారు. కపానీ ప్రపంచవ్యాప్తంగా చాలా మంది జీవితాలపై చెరగని ముద్ర వేశారు. కపానీ 1927లో పంజాబ్‌లోని మోగాలో ఒక సిక్కు కుటుంబంలో జన్మించారు.
ఆయన చిన్నతనమంతా పంజాబ్‌లో గడిచింది. డెహ్రాడూన్‌లో చదువుకున్నారు. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి వెళ్లే ముందు ఆగ్రా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1953లో కపానీ, హెరాల్డ్ హాప్‌కిన్స్‌తో కలిసి ఆప్టికల్ ఫైబర్ ద్వారా మంచి ఫోటోలు పంపే విధానాన్ని కనుగొన్నారు. దాంతో ‘ఫైబర్ ఆప్టిక్స్’ అనే పదాన్ని సృష్టించారు.