Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీకి ఏమైంది? ఎందుకు ఆడటం లేదు?

Published : Dec 26, 2025, 04:07 PM IST

Vaibhav Suryavanshi : విజయ్ హజారే ట్రోఫీలో యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ పరుగుల వరద పారిస్తున్నాడు. దుమ్మురేపే ఫామ్ లో ఉన్న అతను మణిపూర్‌తో శుక్రవారం జరిగిన ప్లేట్ లీగ్ మ్యాచ్‌లో బీహార్ ప్లేయింగ్ ఎలెవన్‌లో వైభవ్ లేడు. ఎందుకు ఈ యంగ్ స్టార్ ఆడటం లేదు?

PREV
16
వైభవ్ సూర్యవంశీకి బ్రేక్.. అండర్-19 వరల్డ్ కప్ కోసమేనా?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజయ్ హజారే ట్రోఫీ సందడి నెలకొంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు పాల్గొంటుండటంతో మ్యాచ్‌లపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సీనియర్ స్టార్లతో పాటు, దేశంలోని సత్తా ఉన్న యంగ్ ప్లేయర్లు కూడా అదరగొడుతున్నారు. వీరిలో బీహార్‌ తరఫున ఆడుతున్న 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ అందరి దృష్టిని ఆకర్షించాడు.

అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సూపర్ సెంచరీ సాధించి రికార్డుల మోత మోగించాడు. అయితే, మణిపూర్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఈ యువ సంచలనం జట్టులో కనిపించలేదు. తాజా సమాచారం ప్రకారం, వైభవ్ సూర్యవంశీ కేవలం ఈ మ్యాచ్‌కే కాకుండా, 2025/26 విజయ్ హజారే ట్రోఫీలో మిగిలిన అన్ని మ్యాచ్‌లకూ దూరం కానున్నాడు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు ఏంటనే చర్చ మొదలైంది.

26
ప్రధాని పురస్కారం కోసం ఢిల్లీకి వైభవ్ సూర్యవంశీ పయనం

వైభవ్ సూర్యవంశీ మణిపూర్‌తో మ్యాచ్‌కు దూరం కావడానికి ప్రధాన కారణం అతను ఒక అరుదైన గౌరవం అందుకోవడం. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని స్వీకరించేందుకు వైభవ్ న్యూఢిల్లీకి వెళ్లాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా వైభవ్ ఈ అవార్డును స్వీకరించాడు.

ఈ ప్రతిష్ఠాత్మక వేడుకలో పాల్గొనాల్సి ఉన్నందున, మ్యాచ్ జరిగిన రోజు ఉదయం 7 గంటలకే అతడు ఢిల్లీకి బయలుదేరాడు. దీంతో బీహార్ జట్టు మణిపూర్‌తో తలపడిన మ్యాచ్‌లో అతడు అందుబాటులో లేకుండా పోయాడు. దీని గురించి వైభవ్ చిన్ననాటి కోచ్ మనీష్ ఓజా మీడియాతో మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు.

"వైభవ్ ఈ రోజు మ్యాచ్ ఆడటం లేదు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార వేడుకలో పాల్గొనేందుకు అతడు ఢిల్లీ వెళ్లాడు. అక్కడ అతన్ని గౌరవించనున్నారు. ఈ వేడుక కోసం ఉదయం 7 గంటలకే రిపోర్ట్ చేయాల్సి వచ్చింది" అని ఓజా వెల్లడించారు. పిల్లలకు సంబంధించి దేశంలోనే అత్యున్నత పురస్కారంగా భావించే ఈ అవార్డును అందుకోవడం వైభవ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది.

36
అండర్-19 ప్రపంచ కప్ సన్నాహాలు

కేవలం అవార్డు వేడుక మాత్రమే కాదు, వైభవ్ టోర్నమెంట్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరం కావడానికి మరో కీలక కారణం ఉంది. జనవరి 15న జింబాబ్వే లో అండర్ 19 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్‌లో భారత జట్టు తరఫున వైభవ్ సూర్యవంశీ ఎంపికయ్యాడు. ఈ టోర్నీ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా శిబిరంలో పాల్గొనాల్సి ఉంది.

ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ కంటే ప్రపంచ కప్ సన్నాహాలు అతనికి అత్యంత కీలకం. జట్టుతో సమన్వయం సాధించడానికి, అక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికి అతడు భారత జట్టుతో కలవాల్సి ఉంది. ఈ విషయాన్ని కోచ్ మనీష్ ఓజా ధృవీకరించారు. "అతడు విజయ్ హజారే ట్రోఫీలో మిగిలిన మ్యాచ్‌లను ఆడడు. అండర్-19 ప్రపంచ కప్ కోసం సన్నద్ధం కావాల్సి ఉంది. సన్నాహక మ్యాచ్‌ల కోసం మిగిలిన భారత జట్టు సభ్యులతో అతడు కలవనున్నాడు" అని ఓజా పేర్కొన్నారు.

46
అరుణాచల్ ప్రదేశ్‌పై చరిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ

విజయ్ హజారే ట్రోఫీ నుంచి వైభవ్ అవుట్ కావడానికి ముందు, అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు సృష్టించిన విధ్వంసం క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది. ఆ మ్యాచ్‌లో కేవలం 84 బంతుల్లోనే 190 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 226.19 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన వైభవ్, తన ఇన్నింగ్స్‌లో ఏకంగా 15 సిక్సర్లు, 16 ఫోర్లు బాదాడు. బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా స్టేడియం నలుమూలలా పరుగుల వరద పారించాడు.

ఈ ఇన్నింగ్స్‌తో అతడు అంతర్జాతీయ రికార్డులను తిరగరాశాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్‌గా చరిత్ర సృష్టించాడు. వైభవ్ ఈ మైలురాయిని కేవలం 54 బంతుల్లోనే చేరుకోవడం విశేషం.

56
ఏబీ డివిలియర్స్ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ

వైభవ్ సూర్యవంశీ సాధించిన ఈ ఘనత ఎంత గొప్పదంటే, ప్రపంచ క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ రికార్డును సైతం అతడు అధిగమించాడు. 2015 వన్డే ప్రపంచ కప్‌లో వెస్టిండీస్‌పై డివిలియర్స్ 64 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. ఆ ఇన్నింగ్స్‌లో డివిలియర్స్ 162 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, 14 ఏళ్ల వైభవ్ ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టి, కేవలం 54 బంతుల్లోనే ఆ మార్కును దాటాడు.

66
భారత క్రికెట్ భవిష్యత్ ఆశాకిరణం వైభవ్ సూర్యవంశీ

వైభవ్ సూర్యవంశీ ప్రతిభ కేవలం ఈ ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాలేదు. దీనికి ముందు జరిగిన అండర్-19 ఆసియా కప్‌లోనూ యూఏఈపై 171 పరుగులు సాధించి తన సత్తా చాటాడు. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలోనూ అదే జోరును కొనసాగించాడు. ఇటు దేశీయ క్రికెట్‌లో రికార్డులు సృష్టిస్తూనే, అటు జాతీయ అవార్డును అందుకోవడం అతని ప్రతిభకు నిదర్శనం. రాబోయే అండర్-19 ప్రపంచ కప్‌లోనూ భారత జట్టుకు వైభవ్ కీలక ఆటగాడిగా మారతాడని విశ్లేషకులు భావిస్తున్నారు. జింబాబ్వే, నమీబియా లో జరగనున్న ఈ ప్రపంచ కప్‌లో వైభవ్ ప్రదర్శనపై అందరి కళ్లు ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories