U19 World Cup 2026 : అండర్-19 ప్రపంచకప్ 2026లో భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. టాస్ సమయంలో భారత కెప్టెన్ ఆయుష్ మ్హత్రే, బంగ్లా కెప్టెన్ షేక్ హ్యాండ్ చేసుకోకపోవడం చర్చనీయాంశమైంది.
భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో హైడ్రామా.. అసలేం జరిగింది?
జింబాబ్వేలో జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ 2026లో ఆసక్తికరమైన, అదే సమయంలో ఉద్రిక్తమైన సంఘటన చోటుచేసుకుంది. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో శనివారం భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్, క్రికెట్ అభిమానులలో తీవ్ర చర్చకు దారితీసింది.
సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లలో కనిపించే క్రీడా స్ఫూర్తికి భిన్నంగా, టాస్ సమయంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇరు జట్ల కెప్టెన్లు హ్యాండ్ షేక్ చేసుకోకపోవడం ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
25
వరల్డ్ కప్‌లో షాకింగ్ సీన్.. ఆ పని చేయడానికి నో చెప్పిన ప్లేయర్లు!
సాధారణంగా ఏ క్రికెట్ మ్యాచ్‌కైనా టాస్ అనేది ఎంతో కీలకమైన, స్నేహపూర్వకమైన సందర్భం. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపించింది. బంగ్లాదేశ్ రెగ్యులర్ కెప్టెన్ మహమ్మద్ అజీజుల్ హకీమ్ తమీమ్ అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండటంతో, ఆ స్థానంలో వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ టాస్ కోసం వచ్చాడు.
భారత అండర్-19 కెప్టెన్ ఆయుష్ మ్హత్రే కూడా టాస్ కోసం మైదానంలోకి వచ్చారు. అయితే, టాస్ వేసిన తర్వాత ఇద్దరు కెప్టెన్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. ఇది మైదానంలో ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని స్పష్టంగా చూపించింది. బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తర్వాత, జవాద్ అబ్రార్.. భారత కెప్టెన్ ఆయుష్ మ్హత్రే పక్కనుండి వెళ్ళినప్పటికీ, ఇద్దరూ కనీసం ఒకరినొకరు చూసుకోలేదు.
35
మైదానంలోనూ కొనసాగిన దూరం
టాస్ పూర్తయిన కొన్ని నిమిషాల తర్వాత, జాతీయ గీతాలాలాపన కోసం ఇరు జట్ల ఆటగాళ్లు బౌండరీ లైన్ వద్ద వేచి ఉన్నారు. మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య ఎటువంటి సంభాషణ కానీ, కరచాలనం కానీ జరగలేదు. ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ చూస్తే, ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన సంబంధాల ప్రభావం క్రికెట్ మైదానంలో కూడా స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అండర్-19 స్థాయిలో ఇలాంటి నో హ్యాండ్‌షేక్ సంఘటన జరగడం చాలా అరుదుగా చెప్పుకోవచ్చు.
ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణం ఇటీవల ఐపీఎల్‌కు సంబంధించి చోటుచేసుకున్న పరిణామాలే అని తెలుస్తోంది. ఈ నెల ఆరంభంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తమ జట్టు నుండి విడుదల చేసింది. గత నెలలో జరిగిన మినీ వేలంలో కేకేఆర్ ముస్తాఫిజుర్‌ను ఏకంగా రూ. 9.2 కోట్లకు కొనుగోలు చేసింది.
రాబోయే ఐపీఎల్ 2026 సీజన్‌లో పాల్గొనాల్సిన ఏకైక బంగ్లాదేశ్ ఆటగాడు అతనే కావడం గమనార్హం. అయితే, బంగ్లాదేశ్‌లో హిందువుల పట్ల అకృత్యాలు పెరుగుతున్నాయనే రిపోర్టుల నేపథ్యంలో, అతడిని లీగ్ నుండి తొలగించాలనే డిమాండ్లు పెరిగాయి. పరిస్థితిని గమనించిన బీసీసీఐ, ముస్తాఫిజుర్‌ను విడుదల చేయాలని కేకేఆర్‌కు సూచించగా, ఫ్రాంచైజీ ఆ నిర్ణయాన్ని అమలు చేసింది.
55
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు షాకింగ్ నిర్ణయం
బీసీసీఐ, కేకేఆర్ తీసుకున్న నిర్ణయం బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. తమ స్టార్ బౌలర్‌ను ఇలా అర్ధాంతరంగా తప్పించడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనికి ప్రతిస్పందనగా, బీసీబీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC)కి ఒక లేఖ రాసింది.
భారత్‌లో భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నాయని ఆరోపిస్తూ, 2026లో భారత్ లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌లోని తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా, బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను కూడా నిషేధించింది. ఈ వరుస పరిణామాల ప్రభావమే నేడు బులవాయోలో జరిగిన అండర్-19 మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది.