Aman Rao: షమీ, ఆకాష్ దీప్‌లను ఉతికారేసిన తెలుగు కుర్రాడు.. 12 ఫోర్లు, 13 సిక్సర్లతో డబుల్ సెంచరీ

Published : Jan 06, 2026, 04:03 PM IST

Aman Rao Hits Double Century : విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ ఓపెనర్ అమన్ రావు డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. బెంగాల్ బౌలర్లు షమీ, ఆకాష్ దీప్‌లపై విరుచుకుపడి 200 పరుగులు సాధించాడు.

PREV
15
రాజస్థాన్ రాయల్స్ జాక్ పాట్.. ఐపీఎల్ వేలం తర్వాత బౌలర్లను చితక్కొట్టిన హైదరాబాద్ కుర్రాడు

భారత దేశవాళీ క్రికెట్ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారుతోంది. తాజాగా హైదరాబాద్ యువ సంచలనం, ఓపెనర్ అమన్ రావు పీరాల అద్భుతమైన బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించాడు. మంగళవారం రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో బెంగాల్‌తో జరిగిన ఆరో రౌండ్ మ్యాచ్‌లో ఈ 21 ఏళ్ల బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

ఏకంగా మహమ్మద్ షమీ, ఆకాష్ దీప్, ముకేష్ కుమార్ వంటి టీమిండియా స్టార్ బౌలర్లను ఎదుర్కొని డబుల్ సెంచరీ సాధించాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఇతనిని రూ. 30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. వేలం ముగిసిన కొద్ది రోజులకే అమన్ తన విలువేంటో బ్యాట్‌తో నిరూపించాడు. ఈ మ్యాచ్‌లో అమన్ విధ్వంసంతో హైదరాబాద్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోరును సాధించింది.

25
12 ఫోర్లు, 13 సిక్సర్లతో బౌలర్ల అమన్ రావు ఊచకోత

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే అమన్ రావు ఆ నిర్ణయాన్ని తప్పు అని నిరూపించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుండే దూకుడుగా ఆడాడు. ముఖ్యంగా అనుభవజ్ఞులైన బెంగాల్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో కేవలం 154 బంతుల్లోనే 200 పరుగులు సాధించాడు.

తన డబుల్ సెంచరీ నాక్ లో 12 అద్భుతమైన ఫోర్లు, 13 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్సర్ కొట్టడం ద్వారా అమన్ తన డబుల్ సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం. సీనియర్ క్రికెట్‌లో అమన్‌కు ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం.

35
విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో 9వ డబుల్ సెంచరీ

అమన్ రావు తన ఇన్నింగ్స్‌తో పలు రికార్డులను బద్దలు కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో హైదరాబాద్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా అమన్ రికార్డులకెక్కాడు. అంతేకాకుండా విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో డబుల్ సెంచరీ సాధించిన తొమ్మిదో బ్యాటర్‌గా నిలిచాడు.

ఇంతకుముందు ఈ ఘనత సాధించిన వారి జాబితాలో నారాయణ్ జగదీషన్, పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, స్వస్తిక్ సమాల్, యశస్వి జైస్వాల్, కర్ణ్ కౌశల్, సమర్థ్ వ్యాస్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పుడు ఈ ఎలైట్ లిస్ట్‌లో అమన్ రావు కూడా చేరిపోయాడు.

45
తిలక్ వర్మతో కీలక భాగస్వామ్యం

మొదట బ్యాటింగ్ ప్రారంభించిన అమన్, గహ్లాత్ రాహుల్ సింగ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాహుల్ 65 పరుగులు చేసి 16వ ఓవర్‌లో రోహిత్ దాస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ తిలక్ వర్మ (34 పరుగులు)తో కలిసి అమన్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు.

వీరిద్దరూ రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. దీంతో హైదరాబాద్ 35వ ఓవర్లోనే 197 పరుగులకు చేరుకుంది. అనంతరం వికెట్ కీపర్ ప్రజ్ఞాయ్ రెడ్డి (22)తో కలిసి నాలుగో వికెట్‌కు 76 పరుగులు జోడించాడు. చివరగా చామ మిలింద్‌తో కలిసి స్కోరు బోర్డును 350 దాటించాడు.

55
ఎవరీ అమన్ రావు?

అమన్ రావు పీరాల జూన్ 2004లో అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం, మాడిసన్‌లో జన్మించాడు. సాధారణంగా మెరుగైన భవిష్యత్తు కోసం చాలా మంది భారతీయ ఆటగాళ్లు అమెరికా వెళ్తుంటారు. కానీ అమన్ మాత్రం క్రికెట్ ఆడేందుకు తన జన్మస్థలం వదిలి ఇండియాకు వచ్చాడు. డిసెంబర్ 2024లో మిజోరంపై టీ20 అరంగేట్రం చేసిన అమన్, ఆ మ్యాచ్‌లో 42 బంతుల్లో 67 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఇప్పటివరకు 11 టీ20 మ్యాచ్‌లలో 33.44 సగటుతో 301 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత నెలలో బరోడాపై లిస్ట్-ఏ అరంగేట్రం చేసిన అమన్, మంగళవారం నాటి మ్యాచ్‌కు ముందు కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఈ చిన్న కెరీర్‌లోనే ఇంతటి భారీ ఇన్నింగ్స్ ఆడటం అతని ప్రతిభకు నిదర్శనం.

Read more Photos on
click me!

Recommended Stories