
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతున్న 2025-26 యాషెస్ సిరీస్ ఐదో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. ఇప్పటికే 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకున్న ఆసీస్, చివరి మ్యాచ్‌లోనూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 518 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు (384) కంటే 134 పరుగుల ఆధిక్యం సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) స్టార్ ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ అద్భుత సెంచరీలతో ఆసీస్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్ (160) రాణించడంతో 384 పరుగులు చేసింది. దీనికి దీటుగా బదులిచ్చిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ట్రావిస్ హెడ్ కేవలం 105 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతను మొత్తం 163 పరుగులు చేసి ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
మరోవైపు, స్టీవ్ స్మిత్ తనదైన శైలిలో నిలకడగా ఆడుతూ 129 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరిద్దరి భాగస్వామ్యం మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. స్మిత్ క్రీజులో పాతుకుపోయి, బౌలర్లను విసిగిస్తూ పరుగులు రాబట్టాడు. బ్యూ వెబ్‌స్టర్ 42 పరుగులతో స్మిత్‌కు సహకారం అందిస్తూ క్రీజులో ఉన్నాడు.
ఈ సిరీస్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న ట్రావిస్ హెడ్, పెర్త్ (123), అడిలైడ్ (170) తర్వాత సిడ్నీలో మూడో సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో హెడ్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు..
పరుగుల యంత్రం స్టీవ్ స్మిత్ ఈ మ్యాచ్‌లో తన టెస్ట్ కెరీర్‌లో 37వ సెంచరీని నమోదు చేశాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో పార్ట్ టైమ్ స్పిన్నర్ జాకబ్ బెతెల్, ట్రావిస్ హెడ్ వికెట్ తీసి ఇంగ్లండ్‌కు ఊరటనిచ్చాడు. స్వీప్ షాట్ ఆడబోయి హెడ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక తన కెరీర్‌లో చివరి (88వ) టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఉస్మాన్ ఖవాజా 17 పరుగులు చేసి బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అలెక్స్ క్యారీ 16, కామెరాన్ గ్రీన్ 37, నైట్ వాచ్‌మెన్ మైఖేల్ నెసెర్ 24 పరుగుల వద్ద పెవిలియన్ చేరారు. బ్రైడన్ కార్స్ కీలక సమయాల్లో వికెట్లు తీసినప్పటికీ, ఆస్ట్రేలియా స్కోరు వేగాన్ని అడ్డుకోలేకపోయాడు.
ప్రస్తుతం ఆస్ట్రేలియా 134 పరుగుల పటిష్ఠ ఆధిక్యంలో ఉంది. చేతిలో ఇంకా 3 వికెట్లు ఉన్నాయి. మెల్బోర్న్‌లో జరిగిన గత టెస్టులో ఇంగ్లండ్ గెలిచినప్పటికీ, సిడ్నీలో ఆసీస్ మళ్లీ పుంజుకుంది. స్టీవ్ స్మిత్ ఇంకా క్రీజులో ఉండటం ఆస్ట్రేలియాకు కలిసొచ్చే అంశం. నాలుగో రోజు ఆస్ట్రేలియా ఎంత ఆధిక్యం సాధించి డిక్లేర్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో తిరిగి పుంజుకోవాలంటే అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.