India vs West Indies : టీ20 ప్రపంచకప్ 2026లో వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు వరుస క్యాచ్‌లు జారవిడిచారు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఫీల్డింగ్ తప్పిదాలతో విండీస్ 195 పరుగులు చేసింది.
టీమిండియా ఫీల్డింగ్ వైఫల్యం: చేజారిన క్యాచ్‌లు.. వెస్టిండీస్ భారీ స్కోరు
కోల్‌కతాలోని చరిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ లో వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 మ్యాచ్‌లో భారత్ ఫీల్డింగ్ వైఫల్యాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే క్యాచ్‌లు జారవిడవడం పెద్ద దెబ్బగా మారింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత్ అత్యధికంగా 13 క్యాచ్‌లను నేలపాలు చేసింది. భారత్ క్యాచ్ పట్టుకునే సామర్థ్యం కేవలం 71.7 శాతంగా ఉంది, ఇది సూపర్ 8 జట్లలోనే అత్యంత దారుణమైన గణాంకం కావడం గమనార్హం.
25
అభిషేక్ శర్మ వరుస తప్పిదాలు
ఈ మ్యాచ్‌లో యువ ఆటగాడు అభిషేక్ శర్మ ఫీల్డింగ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో రోస్టన్ చేజ్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను ఎక్స్‌ట్రా కవర్ వద్ద అభిషేక్ వదిలేశాడు. ఆ సమయంలో చేజ్ కేవలం 14 పరుగుల వద్ద ఉన్నాడు. బుమ్రా వేసిన స్లోయర్ బంతిని చేజ్ గాల్లోకి లేపగా, బంతి చేతుల్లోకి వచ్చినా అభిషేక్ దాన్ని జారవిడిచాడు. ఆ తర్వాత 19వ ఓవర్లో అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రోవ్‌మన్ పావెల్ ఇచ్చిన క్యాచ్‌ను కూడా డీప్ మిడ్ వికెట్ వద్ద డైవ్ చేస్తూ అభిషేక్ నేలపాలు చేశాడు. మోచేతులు నేలకు తగలడంతో బంతి చేతుల్లోంచి బయటకు వచ్చేసింది. ఈ రెండు లైఫ్ లలో వెస్టిండీస్ స్కోరు పెరగడానికి ప్రధాన కారణమయ్యాయి.
35
ఫీల్డింగ్‌లో ఇతర ఆటగాళ్ల లోపాలు
అభిషేక్ మాత్రమే కాకుండా, ఇతర ఫీల్డర్లు కూడా తడబడ్డారు. 13వ ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్‌లో షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ కొట్టిన బంతిని లాంగ్ ఆన్ వద్ద తిలక్ వర్మ ఆపే ప్రయత్నం చేశాడు. తిలక్ గాల్లోకి ఎగిరి వేళ్లతో బంతిని తాకినప్పటికీ, అది కాస్తా సిక్సర్‌గా మారింది. బౌండరీ లైన్ లోపల తిలక్ ఎందుకు నిలబడ్డాడనేది విమర్శలకు దారితీసింది. అలాగే, 18వ ఓవర్లో బుమ్రా బౌలింగ్‌లో రోవ్‌మన్ పావెల్ కొట్టిన బంతిని షార్ట్ ఫైన్ లెగ్ వద్ద వరుణ్ చక్రవర్తి డైవ్ చేసినా ఆపలేకపోయాడు, అది ఫోర్‌గా వెళ్లింది. దీనిపై బుమ్రా అసహనం వ్యక్తం చేయడం కనిపించింది.
ఇన్నింగ్స్ 3వ ఓవర్లో అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఒక రనౌట్ చేసే అవకాశాన్ని వరుణ్ చక్రవర్తి చేజార్చాడు. రోస్టన్ చేజ్ బంతిని కవర్ వైపు నెట్టి సింగిల్ కోసం ప్రయత్నించగా, షాయ్ హోప్ స్పందించలేదు. చేజ్ పిచ్ మధ్యలోకి వచ్చేసినప్పటికీ, వరుణ్ బౌలర్ ఎండ్ వైపు విసిరాడు. నిజానికి కీపర్ ఎండ్ వైపు విసిరి ఉంటే చేజ్ సులభంగా అవుట్ అయ్యేవాడు. ఇలా కీలక సమయాల్లో రనౌట్లు మిస్ చేయడం, క్యాచ్‌లు వదిలేయడం భారత్‌కు శాపంగా మారింది.
55
విండీస్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం
భారత ఫీల్డర్ల వైఫల్యాలను సొమ్ము చేసుకున్న వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. హోల్డర్ 37 (22 బంతులు), రోవ్‌మన్ పావెల్ 34 (19 బంతులు) మెరుపులు మెరిపించారు. చివరి 5 ఓవర్లలో విండీస్ ఏకంగా 70 పరుగులు రాబట్టింది. భారత బౌలర్లలో బుమ్రా 2 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు. అయితే, ఫీల్డర్లు సహకరించి ఉంటే వెస్టిండీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసే అవకాశం ఉండేది.