సఫారీలతో ఓటమి.! డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకోవడం భారత్‌కి ఇక కష్టమే..

Published : Nov 18, 2025, 11:02 AM IST

కోల్‌కతా టెస్ట్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓటమితో టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆశలు సన్నగిల్లాయి. పాయింట్ల పట్టికలో భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది. మిగిలిన 10 టెస్టుల్లో కనీసం ఏడు విజయాలు సాధిస్తేనే.. 

PREV
15
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలపై..

టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆశలపై కోల్‌కతా టెస్ట్ తీవ్ర ప్రభావం చూపింది. సౌతాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా పరాభవం చవిచూడడంతో డబ్ల్యూటీసీ రేసులో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుని మంచి ఊపు మీద కనిపించిన భారత జట్టు, సొంత గడ్డపై జరిగిన ఈడెన్ గార్డెన్స్ టెస్ట్‌లో పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచింది. కేవలం 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక, ఈజీ మ్యాచ్‌ను సౌతాఫ్రికాకు అప్పగించింది.

25
ఒక స్థానం కోల్పోయి నాలుగో స్థానానికి..

ఈ ఓటమి తర్వాత భారత జట్టు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఒక స్థానం కోల్పోయి నాలుగో స్థానానికి దిగజారింది. పట్టికను పరిశీలిస్తే, ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, కోల్‌కతా టెస్ట్‌లో విజయం సాధించిన సౌతాఫ్రికా రెండో స్థానానికి చేరుకుంది. శ్రీలంక భారత్ కంటే ముందుగా మూడో స్థానంలో నిలిచింది. మొన్నటి వరకు మూడో స్థానంలో ఉన్న భారత్, సౌతాఫ్రికా చేతిలో ఓడి నాలుగో స్థానానికి పడిపోవడం గమనార్హం.

35
మొత్తం 18 టెస్ట్ మ్యాచ్‌లు

డబ్ల్యూటీసీ సైకిల్‌లో మొత్తం 18 టెస్ట్ మ్యాచ్‌లలో భారత్ ఇప్పటివరకు ఎనిమిది ఆడింది. ఈ ఎనిమిది మ్యాచ్‌లలో భారత్‌కు దక్కింది కేవలం 52 పాయింట్లు మాత్రమే. ఇది 54.17 శాతం గెలుపు శాతాన్ని సూచిస్తుంది. ఇక మిగిలిన పది టెస్టులలో ఫైనల్ చేరడానికి దాదాపు పర్ఫెక్ట్ ఫలితాలు అవసరం. గత డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరిన జట్ల గెలుపు శాతాన్ని పరిశీలిస్తే, టాప్ 2లో నిలిచే జట్లకు దాదాపు 64-68 శాతం మధ్య గెలుపు అవకాశాలు ఉండాలి.

45
మిగిలిన టెస్టులు ఇవే..

ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే భారత్ మిగిలిన పది టెస్టులలో కనీసం ఏడు విజయాలు సాధించాల్సి ఉంటుంది. అప్పుడు భారత్ గెలుపు శాతం 64-65 శాతానికి చేరుకుని, ఫైనల్ రేసులో నిలబడటానికి అర్హత సాధిస్తుంది. భారత్‌కు మిగిలి ఉన్న 10 టెస్ట్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఒకసారి చూస్తే, సౌతాఫ్రికాపై గువాహటి వేదికగా ఒక టెస్టు, శ్రీలంకపై రెండు టెస్టులు, న్యూజిలాండ్‌పై రెండు టెస్టులు, అలాగే బలమైన ఆస్ట్రేలియాపై ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ పది టెస్టులలో ఆరు మ్యాచ్‌లు సొంత గడ్డపై జరుగుతాయి, మిగతా నాలుగు విదేశాల్లో ఆడాల్సి ఉంటుంది.

55
ఆ పది టెస్టులు గెలవాల్సిందే

ఈ పది టెస్టులలో సాధించదగిన గరిష్ట పాయింట్లు 120. అయితే, ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్టుపై ఐదు టెస్టులు ఆడాల్సి ఉండటం, అందులోనూ కొన్ని విదేశాల్లో ఉండటం భారత్‌కు పెద్ద సవాలుగా నిలుస్తుంది. ఏడు విజయాలను సాధించడం టీమిండియాకు అంత సులభం కాదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే, రాబోయే మ్యాచ్‌లలో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలి.

Read more Photos on
click me!

Recommended Stories