KL Rahul : ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఐపీఎల్ జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో కెప్టెన్లు ఎదుర్కొనే మానసిక, శారీరక ఒత్తిడిపై కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ సర్కిల్ మరో కొత్త చర్చకు తెరలేపారు.
ఐపీఎల్ కెప్టెన్సీ ఒత్తిడి ఊహించలేనిది: కేఎల్ రాహుల్
భారత స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోసారి ఐపీఎల్ కెప్టెన్సీపై సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చారు. అంతర్జాతీయ క్రికెట్‌తో పోలిస్తే, ఐపీఎల్‌లో కెప్టెన్లు ఎదుర్కొనే భారం మాటల్లో చెప్పలేనిదని అన్నారు. కెప్టెన్సీ సమయంలో రెండు నెలల టోర్నీ ముగిసేనాటికి 10 నెలల అంతర్జాతీయ క్రికెట్ ఆడినంతకంటే ఎక్కువగా తన శరీరం, మనసు అలసిపోయేదని చెప్పారు.
2022–2024 మధ్య లక్నో సూపర్ జెయింట్స్‌ను నడిపించిన కేఎల్ రాహుల్, తన కెప్టెన్సీ రోజులలో ఎవరూ బయటకు చెప్పని అనేక అనుభవాలను ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
25
యజమానుల ప్రశ్నలే పెద్ద భారం
ఐపీఎల్ ఫ్రాంచైజీ యాజమాన్యాల నుంచి వచ్చే నిరంతర ఒత్తిడి కీలకమైన విషయమని కేఎల్ రాహుల్ చెప్పాడు. క్రీడా నేపథ్యం లేని వ్యక్తులు మ్యాచ్ వ్యూహాల గురించి నిరంతరం ప్రశ్నలు అడగడం కెప్టెన్లను మానసికంగా పూర్తిగా అలసిపోయేలా చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
“ఎందుకు ఆ మార్పు? ఎందుకు అతను ఆడాడు? ప్రత్యర్థి 200 పరుగులు చేస్తే మనం ఎలా 120కే ఆగిపోయాం?” వంటి ప్రశ్నలు ప్రతి సమావేశంలో ఎదురవుతాయని రాహుల్ వివరించారు.
“కొన్నిసార్లు ఇవన్నీ విచారణలాంటివిగా అనిపిస్తాయి” అనే కేఎల్ రాహుల్ వ్యాఖ్యలు భారత్‌లో ఫ్రాంచైజీ సంస్కృతిపై పెద్ద చర్చకు దారితీస్తోంది.
35
ఐపీఎల్-అంతర్జాతీయ క్రికెట్ ఎందుకు భిన్నం?
అంతర్జాతీయ జట్టులో కెప్టెన్సీ చేసిన అనుభవాన్ని పోల్చుతూ, అక్కడ ప్రశ్నల కంటే అవగాహన ఎక్కువగా ఉంటుందని రాహుల్ చెప్పాడు. కోచ్‌లు, సెలెక్టర్లు ఆటలోని సున్నితమైన వ్యూహాలు అర్థం చేసుకునే వారు కాబట్టి నిర్ణయాలను వివరించడం సులభమని తెలిపారు.
“ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలుస్తామన్న హామీ లేదని తెలిసినవారితో మాట్లాడడం సులభం. కానీ క్రీడా నేపథ్యం లేని వారిని నమ్మించడం చాలా కష్టం” అని ఆయన వ్యాఖ్యానించారు.
2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఘోర ఓటమి తర్వాత ఎల్ఎస్జీ యజమాని సంజీవ్ గోయెంకా మైదానంలోనే రాహుల్‌తో చేసిన తీవ్రమైన చర్చ అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ఆ వీడియోలు వైరల్ కావడంతో రాహుల్‌పై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. అదే సీజన్ అనంతరం రాహుల్ ఫ్రాంచైజీ నుంచి విడిపోయాడు.
2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆయనను రూ.14 కోట్లకు తీసుకుంది. అయితే అతడు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించకపోవడం గమనార్హం.
55
కేఎల్ రాహుల్ ఇంటర్వ్యూ ఎందుకు వైరల్ అవుతోంది?
హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. క్రికెటర్లు భరించాల్సిన ఒత్తిడిని సాధారణ ప్రేక్షకుల ముందుకు తెచ్చినందుకు చాలా మంది అభిమానులు ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. రాహుల్ తన అనుభవాల ద్వారా ఒక ప్రధాన సందేశాన్ని కూడా ఇచ్చారు.. “క్రీడలో ప్రతీది నియంత్రణలో ఉండదు. కానీ కెప్టెన్లు మాత్రం ప్రతీ నిర్ణయానికి జవాబుదారీగా ఉండాలి”. కేఎల్ రాహుల్ చేసిన ఈ కామెంట్స్ పై ఐపీఎల్ జట్లు ఎలా స్పందిస్తాయో చూడాలి మరి.