T20 World Cup 2026 : ఛాన్స్ మిస్ అయితే ఇంటికే.. సూపర్ 8లో వర్షం పడితే టీమిండియా పరిస్థితి ఏంటి?

Published : Feb 21, 2026, 04:50 PM IST

T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 కీలక దశకు చేరుకుంది. సూపర్ 8 దశలో వర్షం పడి మ్యాచ్ రద్దయితే ఐసీసీ నిబంధనలు ఎలా ఉండబోతున్నాయి? పాయింట్లు పంచుకోవడంతో సెమీస్ అవకాశాలు ఎలా ఉంటాయి? ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
సూపర్ 8లో వర్షం పడితే పరిస్థితి ఏంటి?

టీ20 ప్రపంచకప్ 2026 ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. గ్రూప్ దశ ముగియడంతో, అసలైన పోరు సూపర్ 8 రూపంలో శనివారం నుంచి ప్రారంభం కానుంది. టోర్నీలో పాల్గొన్న 20 జట్లలో కేవలం 8 జట్లు మాత్రమే ఈ దశకు చేరుకున్నాయి. ఈ 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి.

ఒక్కో జట్టు తన గ్రూపులోని మిగిలిన మూడు జట్లతో తలపడాల్సి ఉంటుంది. అంటే ప్రతి జట్టుకు మూడు మ్యాచ్‌లు లభిస్తాయి. చివరకు రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అయితే, ఈ కీలకమైన సూపర్ 8 మ్యాచ్‌లకు వర్షం ముప్పు పొంచి ఉండటంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

26
సూపర్ 8 మ్యాచ్ లకు రిజర్వ్ డే లేదు.. ఐసీసీ రూల్స్ ఇవే

టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 మ్యాచ్‌లకు సంబంధించి ఐసీసీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ దశ మాదిరిగానే సూపర్ 8 మ్యాచ్‌లకు కూడా ఎటువంటి రిజర్వ్ డే కేటాయించలేదు. అంటే, నిర్ణీత రోజున వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే, మరుసటి రోజు ఆడే అవకాశం ఉండదు. ఐసీసీ నిబంధనల ప్రకారం, సూపర్ 8లో ఏదైనా మ్యాచ్ వర్షం వల్ల పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే, ఇరు జట్లకు తలో ఒక పాయింట్ కేటాయిస్తారు. గ్రూప్ దశలో అనుసరించిన విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేయనున్నారు. అయితే, కనీసం ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం 5 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయడం తప్పనిసరి.

36
వర్షం పడితే ఏ జట్టుకు లాభం?

మ్యాచ్ వర్షం వల్ల రద్దయినప్పుడు ఏ జట్టునూ విజేతగా ప్రకటించరు. దీనివల్ల నెట్ రన్ రేట్ (NRR)పై ఎటువంటి ప్రభావం ఉండదు. కేవలం పాయింట్లు మాత్రమే పంచుతారు. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడుతుంది. పాయింట్లు సమానమైనప్పుడు నెట్ రన్ రేట్ కీలకంగా మారుతుంది. ఏ జట్టుకైతే అంతకుముందు మ్యాచ్‌ల ద్వారా మెరుగైన రన్ రేట్ ఉంటుందో, ఆ జట్టుకు సెమీస్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే సూపర్ 8లో ప్రతి మ్యాచ్‌ను గెలవడమే కాకుండా, భారీ తేడాతో గెలిచి రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవడం జట్లకు అత్యవసరం.

46
శ్రీలంకలో వరుణుడి ప్రతాపం

ఈసారి ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. గ్రూప్ దశలో శ్రీలంకలో జరిగిన పలు మ్యాచ్‌లకు వర్షం ఆటంకం కలిగించింది. ముఖ్యంగా కొలంబోలో కురిసిన భారీ వర్షాల వల్ల ఐర్లాండ్, జింబాబ్వే మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. దీనివల్ల ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ అదృష్టంతోనే జింబాబ్వే సూపర్ 8లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు సూపర్ 8లో భాగంగా న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌పై కూడా వర్షం నీలినీడలు కమ్ముకున్నాయి.

56
సూపర్ 8 టీమిండియా షెడ్యూల్, సవాళ్లు ఇవే

భారత జట్టు తన సూపర్ 8 పోరాటాన్ని ఆదివారం నుంచి ప్రారంభించనుంది. ఫిబ్రవరి 22న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. సొంత గడ్డపై ఆడుతున్న భారత్‌కు ఇది కీలకమైన మ్యాచ్. సూపర్ 8లో ప్రతి మ్యాచ్ ఒక నాకౌట్ మ్యాచ్‌లాంటిదే. ఇక్కడ ఒక్క మ్యాచ్ ఓడినా లేదా వర్షం వల్ల పాయింట్లు కోల్పోయినా సెమీస్ సమీకరణాలు సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. సూర్యకుమార్ సేన ప్రతి మ్యాచ్‌ను గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవాలని పట్టుదలతో ఉంది.

66
టీ20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్, ఫైనల్ ఎప్పుడంటే?

సూపర్ 8 సమరం శనివారం నుంచి (ఫిబ్రవరి 21) ప్రారంభమై మార్చి 1 వరకు కొనసాగుతుంది. ఈ 9 రోజుల వ్యవధిలో మొత్తం 12 హైవోల్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. సూపర్ 8 దశ ముగిసిన తర్వాత, పాయింట్ల పట్టికలో టాప్ 4లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. మార్చి 4, 5 తేదీల్లో సెమీఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మెగా టోర్నీ విజేతను నిర్ణయించే గ్రాండ్ ఫినాలే మార్చి 8న నిర్వహించనున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories