
టీ20 వరల్డ్ కప్ 2026 కోసం భారత జట్టుకు ఎంపికైన ఆనందంలో ఉన్న స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, మైదానంలో పరుగుల వరద పారించాడు. బ్యాట్ తో సమాధానం చెప్పడమే కాదు, రికార్డుల పుస్తకాలను తిరగరాశాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లలో పరుగుల వర్షం కురిసింది.
బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కర్ణాటక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి సంచలనం సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో ఒక భారతీయ బ్యాటర్ చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీల జాబితాలో ఇషాన్ కిషన్ ఇప్పుడు రెండో స్థానంలో నిలిచాడు.
కర్ణాటకతో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో జార్ఖండ్ ఇన్నింగ్స్ చివరి దశలో బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్, బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆరో స్థానంలో క్రీజులోకి వచ్చిన ఈ లెఫ్ట్ హ్యాండర్, మొదటి బంతి నుండే ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. విజయ్‌కుమార్ వైశాఖ్, శ్రేయాస్ గోపాల్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్నప్పటికీ, ఇషాన్ వారిని ధీటుటా ఎదుర్కొన్నాడు.
కేవలం 39 బంతులు ఎదుర్కొన్న ఇషాన్ కిషన్ ఏకంగా 125 పరుగులు సాధించాడు. ఇందులో 7 ఫోర్లు ఉండగా, ఏకంగా 14 భారీ సిక్సర్లు ఉండటం విశేషం. అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 320.15గా నమోదైంది. ఇషాన్ 39వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి, జట్టు స్కోరును 412 పరుగుల భారీ స్థాయికి చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా తన ఇన్నింగ్స్ చివరి 19 బంతుల్లోనే 73 పరుగులు పిండుకున్నాడంటే అతని విధ్వంసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
విశేషమేమిటంటే, ఇషాన్ కిషన్ ఈ రికార్డు సృష్టించిన రోజే, బీహార్ కెప్టెన్ సకిబుల్ గని కూడా చరిత్ర సృష్టించాడు. రాంచీలో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో సకిబుల్ గని కేవలం 32 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇది లిస్ట్-ఏ క్రికెట్‌లో భారతీయ ఆటగాడు చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీగా నమోదైంది.
దీంతో ఇషాన్ కిషన్ 33 బంతుల సెంచరీ రెండో అత్యంత వేగవంతమైనదిగా రికార్డులకెక్కింది. ఇషాన్ కిషన్ ఈ క్రమంలో పంజాబ్ బ్యాటర్ అన్మోల్‌ప్రీత్ సింగ్, ఇటీవల రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ (36 బంతుల్లో సెంచరీ) రికార్డులను బద్దలు కొట్టాడు. ఒకే రోజు, కొన్ని నిమిషాల వ్యవధిలో ఇద్దరు భారతీయ బ్యాటర్లు లిస్ట్-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీల రికార్డులను బద్దలు కొట్టడం క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం.
కొన్ని రోజుల క్రితమే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 కోసం ప్రకటించిన భారత జట్టులో ఇషాన్ కిషన్‌కు చోటు దక్కింది. సంజూ శాంసన్‌కు బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఎంపికైన ఇషాన్, తన ఎంపిక సరైనదేనని ఈ ఇన్నింగ్స్‌తో నిరూపించుకున్నాడు. డిసెంబర్ 2023లో వ్యక్తిగత కారణాలతో బ్రేక్ తీసుకున్న తర్వాత, సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్, తన పట్టుదలతో తిరిగి జట్టులోకి వచ్చాడు.
ముఖ్యంగా ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2025లో ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 10 మ్యాచ్‌లలో 517 పరుగులతో టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫైనల్‌లో హర్యానాపై 49 బంతుల్లో 101 పరుగులు చేసి జార్ఖండ్‌కు తొలి టైటిల్ అందించాడు. ఆ ఫామ్‌ను ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలోనూ కొనసాగిస్తూ, సెలెక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
ఇషాన్ కిషన్ ప్రదర్శన పట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్, అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ను రూ. 11.25 కోట్లకు ఎస్ఆర్‌హెచ్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ఇషాన్ సూపర్ ఫామ్‌లో ఉండటం ఆరెంజ్ ఆర్మీకి శుభసూచకం.
ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ వికెట్ కీపర్‌గా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా తన విలువేంటో చాటిచెప్పాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు లేదా భారీ స్కోరు సాధించాల్సినప్పుడు తను ఎంత ప్రమాదకరంగా మారగలడో ఈ ఇన్నింగ్స్ ద్వారా మరోసారి స్పష్టమైంది.
అహ్మదాబాద్ లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కర్ణాటక బౌలింగ్ ఎంచుకుంది. అయితే జార్ఖండ్ బ్యాటర్లు వారి నిర్ణయాన్ని తప్పుగా నిరూపించారు. నిర్ణీత 50 ఓవర్లలో జార్ఖండ్ 9 వికెట్ల నష్టానికి 412 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (125) విధ్వంసానికి తోడు, విరాట్ సింగ్ (88), కుమార్ కుశాగ్రా (63) రాణించారు. కర్ణాటక బౌలర్లలో వైశాఖ్, శ్రేయాస్ గోపాల్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కొట్టిన 14 సిక్సర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఇషాన్‌ను అసలైన ధురంధరుడు అంటూ ప్రశంసిస్తున్నారు.