Published : Dec 24, 2025, 08:59 PM ISTUpdated : Dec 24, 2025, 09:12 PM IST
Virat Kohli Net Worth : 2025లో విరాట్ కోహ్లీ నికర ఆస్తి రూ. 1050 కోట్లకు చేరింది. క్రికెట్, ఐపీఎల్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, వ్యాపారాల ద్వారా కోహ్లీ ఆర్జిస్తున్న భారీ ఆదాయం వివరాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
టీమిండియా రన్ మెషిన్, ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ మైదానంలో పరుగుల వరద పారించడమే కాదు, గ్రౌండ్ బయట సంపాదనలోనూ రికార్డులు సృష్టిస్తున్నారు. 2025 సంవత్సరం విరాట్ కోహ్లీకి అద్భుతంగా గడిచిందనే చెప్పాలి. విజయ్ హజారే ట్రోఫీలో దేశవాళీ క్రికెట్‌లోకి ఘనంగా పునరాగమనం చేయడంతో పాటు, వన్డే ఫార్మాట్‌లోనూ తనదైన ముద్ర వేశారు.
ముఖ్యంగా 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లలో ఒకరిగా నిలిచారు. రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, ఆయన ఆదాయం, బ్రాండ్ విలువ ఏ మాత్రం తగ్గకపోగా, మరింత పెరగడం విశేషం. ఫిట్‌నెస్ ఐకాన్‌గా కోట్లాది మందికి ఆదర్శంగా నిలుస్తున్న కోహ్లీ సంపద వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
26
రూ. 1000 కోట్లు దాటిన నికర సంపద
ప్రస్తుత అంచనాల ప్రకారం, 2025 నాటికి విరాట్ కోహ్లీ నికర ఆస్తి (Net Worth) సుమారు రూ. 1,050 కోట్లు (US$ 126–127 మిలియన్లు)గా ఉంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్న క్రీడాకారులలో ఒకరిగా, ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెటర్‌గా విరాట్ నిలిచారు. క్రికెట్ కాంట్రాక్టులు, ఐపీఎల్ జీతం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, సొంత వ్యాపారాలు, లగ్జరీ ఆస్తుల ద్వారా ఆయనకు ఈ భారీ ఆదాయం సమకూరుతోంది.
అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్, ప్రకటనలే ఆయన ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి. సంవత్సరాలుగా నిలకడైన ప్రదర్శన కనబరుస్తుండటంతో అత్యధిక పారితోషికం తీసుకునే క్రికెటర్ల జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
36
ఐపీఎల్, బీసీసీఐ ద్వారా కోహ్లీకి భారీ ఆదాయం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ లీగ్ ప్రారంభం నుంచి అత్యంత విలువైన ఆటగాడిగా ఉన్న కోహ్లీ, ఐపీఎల్ ద్వారా ప్రతి సీజన్‌కు సుమారు రూ. 21 కోట్లు ఆర్జిస్తున్నారు.
ఇక భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెంట్రల్ కాంట్రాక్ట్‌లో కోహ్లీ టాప్ టైర్ లో ఉన్నారు. దీని ద్వారా ఆయనకు ఏటా రూ. 7 కోట్ల ఫిక్స్డ్ జీతం అందుతుంది. దీనికి అదనంగా వన్డే మ్యాచ్‌ల ఫీజులు కూడా కలుపుకుంటే, క్రికెట్ ద్వారానే ఆయనకు ఏటా భారీ మొత్తం అందుతోంది.
ప్రకటనల రారాజు.. బ్రాండ్ల ద్వారా కోహ్లీకి రూ. 200 కోట్లు
మైదానంలో బ్యాట్‌తోనే కాదు, మైదానం బయట బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా కోహ్లీ సెంచరీల కొద్దీ సంపాదిస్తున్నారు. కేవలం బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారానే ఆయన ఏటా సుమారు రూ. 200 కోట్లు ఆర్జిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పూమా, ఎంఆర్ఎఫ్, ఆడి, మింత్రా, బ్లూ ట్రైబ్, టిస్సాట్, వివో, హిమాలయ వంటి 30కి పైగా ప్రముఖ బ్రాండ్‌లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనకున్న క్రేజ్, నిలకడైన ఆటతీరు కారణంగా ఆయన బ్రాండ్ విలువ ఆకాశాన్నంటుతోంది.
56
విజయవంతమైన వ్యాపారవేత్తగా కోహ్లీ
విరాట్ కోహ్లీ కేవలం క్రికెటర్ మాత్రమే కాదు, విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. ఆయనకు అనేక వ్యాపారాల్లో పెట్టుబడులు ఉన్నాయి. ప్రముఖ ఫిట్‌నెస్ చైన్ 'చిసెల్ జిమ్' (Chisel Gym)లో ఆయన సహ యజమానిగా ఉన్నారు.
అలాగే పాపులర్ ఫ్యాషన్ బ్రాండ్ 'రాన్' (Wrogn) కూడా ఆయనదే. వీటితో పాటు బ్లూ ట్రైబ్ ఫుడ్స్, గో డిజిట్ ఇన్సూరెన్స్ వంటి సంస్థల్లో ఆయన పెట్టుబడులు పెట్టారు. కోట్లాది రూపాయల విలువైన ఈ వెంచర్లు ఆయన నికర ఆస్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
66
లగ్జరీ కార్లు, ఖరీదైన ఇళ్లు.. కోహ్లీ సోషల్ మీడియా ఆదాయం ఇదే
విరాట్ కోహ్లీకి కార్లంటే మక్కువ ఎక్కువ. ఆయన గ్యారేజీలో ఆడి ఆర్8, క్యూ8, ఆర్ఎస్5, ఏ8ఎల్, రేంజ్ రోవర్ వోగ్, బెంట్లీ కాంటినెంటల్ జీటీ, లంబోర్ఘిని గల్లార్డో వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ. 30 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
ఇక ఇళ్ల విషయానికొస్తే.. ముంబైలోని వర్లీలో సముద్రానికి ఎదురుగా ఉన్న ఆయన అపార్ట్‌మెంట్ విలువ రూ. 35 కోట్లు కాగా, గురుగ్రామ్‌లోని బంగ్లా విలువ రూ. 80 కోట్లకు పైగా ఉంది. ఆయన తన భార్య అనుష్క శర్మతో కలిసి దేశవ్యాప్తంగా అనేక ప్రీమియం ప్రాపర్టీలలో పెట్టుబడులు పెట్టారు.
సోషల్ మీడియాలోనూ కోహ్లీ రికార్డుల రారాజు. ఇన్‌స్టాగ్రామ్‌లో 300 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్న ఆయన, ఒక్క స్పాన్సర్డ్ పోస్ట్ ద్వారా రూ. 8 నుంచి 10 కోట్లు సంపాదిస్తున్నారు. ఆసియాలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగిన క్రీడాకారుడిగా ఆయన నిలిచారు. కేవలం 37 ఏళ్ల వయసులోనే కోహ్లీ తన ఆదాయం, ఆస్తులు, వ్యాపారాలతో ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారనడంలో సందేహం లేదు.