Smriti Mandhana and Palash Muchhal Wedding : స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి డిసెంబర్ 7న జరగనుందని సోషల్ మీడియాలో ఒక వెడ్డింగ్ కార్డు వైరల్ గా మారింది. ఈ పెళ్లి వార్తల పై కుటుంబ సభ్యులు స్పందించారు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం గత కొన్ని వారాలుగా సోషల్ మీడియాలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 23న జరగాల్సిన ఈ జంట పెళ్లి అనుకోని పరిస్థితుల వల్ల వాయిదా పడింది.
దీని తర్వాత ఇంటర్నెట్‌లో ఊహాగానాలకు అడ్డులేకుండా పోయింది. తాజాగా, డిసెంబర్ 7 కొత్త ముహూర్తమని పేర్కొంటున్న పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొందరు ఈ తేదీతో ఉన్న ఒక వెడ్డిండ్ కార్డును కూడా షేర్ చేస్తూ దానిని అసలైనదిగా ప్రచారం చేశారు. ఈ పోస్టులు క్షణాల్లో వైరల్ కాగా, అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది.
24
కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారు?
పలాష్ ముచ్చల్ సంబంధికులు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న సమాచారాన్ని స్పష్టంగా ఖండించారు. “డిసెంబర్ 7 పెళ్లి గురించి మాకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. వివాహం ప్రస్తుతం వాయిదా లోనే ఉంది” అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో స్మృతి మంధాన సోదరుడు శ్రవణ్ మంధాన కూడా ఇదే విషయం చెప్పారు. పుకార్ల వల్ల కుటుంబాలకు ఇబ్బంది కలుగుతున్న సమయంలో వీరి కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి.
కొంతమంది అభిమానులు షేర్ చేసిన ఆహ్వాన పత్రికపై కూడా ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. దీంతో డిసెంబర్ 7 అనే తేదీపై వస్తున్న పెళ్లి వార్తలు ఫేక్ గా తెలుస్తోంది.
34
ఆరోగ్య సమస్యలే పెళ్లి వాయిదాకు కారణమా?
నవంబర్ 23 తేదీకి జరగాల్సిన వివాహానికి ఒక రోజు ముందు వరకూ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హల్దీ, సంగీత్ వంటి వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరిగాయి. కానీ పెళ్లి రోజునే స్మృతి మంధాన తండ్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవడం పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. అత్యవసరంగా ఆసుపత్రికి తరలించడంతో, రెండు కుటుంబాలు కలసి పెళ్లిని వాయిదా వేయాలని నిర్ణయించాయి.
అలాగే, వరుడు పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చిందన్న వార్తలు బయటకు వచ్చాయి. ఆరోగ్య పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని వివాహాన్ని తిరిగి ప్లాన్ చేసుకోవాలని కుటుంబాలు భావించాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఆన్లైన్‌లో వైరల్ అయిన చాట్స్, వివాదాలు.. ఏమిటి నిజం?
పెళ్లి వాయిదా అనంతరం, పలాష్ ముచ్చల్ కొంతమంది మహిళలతో సంబంధం కలిగి ఉన్నారనీ, చాటింగ్ చేస్తున్నట్లు చూపించే అనేక స్క్రీన్‌షాట్‌లు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. నెటిజన్లు ఇవే వివాహం నిలిచిపోవడానికి కారణమని ఆరోపించారు. ముచ్చలు చీట్ చేశాడని విమర్శలు వచ్చాయి.
కానీ ఈ ఆరోపణలను ఏ కుటుంబం కూడా ధృవీకరించలేదు. రెండు కుటుంబాలు కూడా ఆరోగ్య సమస్యలే వాయిదాకు ప్రధాన కారణమని పేర్కొన్నాయి. ఇంకా కొత్త తేదీ గురించి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.