Shubman Gill: శుభ్‌మన్ గిల్ మెడ గాయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. నవంబర్ 22న గువాహటిలో ప్రారంభమయ్యే రెండో టెస్టు కోసం గిల్ జట్టుతో కలుస్తాడా లేదా అనే సందేహాల మధ్య భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అప్డేట్ ఇచ్చింది.
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ మెడ గాయం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. సౌతాఫ్రికాతో కోల్‌కతాలో జరిగిన మొదటి టెస్టు సందర్భంగా గిల్‌కు మెడ నొప్పితో ఆసుపత్రి పాలయ్యాడు. గాయం కారణంగా గిల్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఇప్పటికే రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 0-1 తేడాతో వెనుకబడి ఉంది. ఈ నేపథ్యంలో నవంబర్ 22 నుంచి గువాహటిలో జరగనున్న రెండో టెస్టు టీమ్ ఇండియాకు చాలా కీలకం.
ఈ కీలకమైన మ్యాచ్‌కు ముందు బుధవారం శుభ్‌మన్ గిల్ గాయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. గిల్‌కు అందిస్తున్న వైద్య చికిత్సకు మంచి స్పందన వస్తోందని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దీంతో అతను జట్టుతో కలిసి ఈరోజే గువాహటి బయలుదేరనున్నాడని తెలిపింది.
25
రెండో టెస్టులో గిల్ ఆడతాడా? సస్పెన్స్ ఇంకా మిగిలే ఉంది
శుభమన్ గిల్ జట్టుతో కలిసి గువాహటి ప్రయాణిస్తున్నప్పటికీ, రెండో టెస్టులో అతను ఆడతాడా లేదా అనే విషయంపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. బీసీసీఐ ఈ విషయాన్ని స్పష్టం చేయలేదు. బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా ఒక ప్రకటనలో ఈ విషయంపై స్పందిస్తూ… “గిల్‌కు అందిస్తున్న వైద్య చికిత్సకు మంచి స్పందన వస్తోంది. అతను జట్టుతో కలిసి గువాహటి వెళ్తాడు” అని సైకియా తెలిపారు.
అయితే, మ్యాచ్‌కు అతని లభ్యతపై సందేహాన్ని సైకియా కొనసాగించారు. “అతను బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉంటాడు. నవంబర్ 22న ప్రారంభమయ్యే రెండో టెస్టులో అతని భాగస్వామ్యంపై తదుపరి పరిశీలనల తర్వాత తగిన నిర్ణయం తీసుకోనున్నారు” అని సైకియా తెలిపారు.
35
కోల్‌కతా టెస్ట్‌లో రిటైర్డ్ హర్ట్ అయిన గిల్
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్టు రెండవ రోజున గిల్ గాయంతో ఆస్పత్రి పాలయ్యాడు. అంతకుముందు రోజు భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం మూడు బంతులు మాత్రమే ఆడిన తర్వాత అతను రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మ్యాచ్ మూడవ రోజు ఉదయం అతను మ్యాచ్‌లో కొనసాగడని బీసీసీఐ ప్రకటించింది.
గాయం కారణంగా గిల్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మొదటి టెస్టులో భారత్ 30 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ విజయంతో సౌతాఫ్రికా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. కాబట్టి, భారత జట్టు ఈ మ్యాచ్‌ను తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒకవేళ మెడ నొప్పితో శుభ్ మన్ గిల్ రెండో టెస్టుకు దూరమైతే, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. అలాగే, అతని స్థానంలో ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కవచ్చు. నితీష్ రెడ్డిని బ్యాకప్‌గా జట్టులోకి తీసుకున్నారు.
ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ ఇప్పటికే టెస్ట్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం రాజ్‌కోట్‌లో జరుగుతున్న సౌత్ ఆఫ్రికా ఏ సిరీస్ నుండి నితీష్ రెడ్డిని వెనక్కి పిలిచి, సీనియర్ జట్టులో చేరమని చెప్పారు.
55
గిల్ ఆటపై తుది నిర్ణయం మెడికల్ టీమ్‌దే
నితీష్ రెడ్డి సోమవారం సాయంత్రం కోల్‌కతా చేరుకున్నాడు. మంగళవారం అతను శిక్షణ తీసుకోనప్పటికీ, గిల్ ఆడకపోతే తుది జట్టులో నితీష్ రెడ్డిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. సిరీస్‌ను సమం చేయాలని చూస్తున్న భారత్, ఇప్పుడు తమకు అందుబాటులో ఉన్న ఆటగాళ్లను పరిశీలిస్తోంది.
గువాహటి టెస్టుకు ముందు గిల్ కోలుకోవడం ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది. జట్టు యాజమాన్యం అతని పురోగతిని నిశితంగా పర్యవేక్షిస్తూ, అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. రెండో టెస్టు నవంబర్ 22న ప్రారంభమవుతుంది.