భారత క్రికెట్ జట్టు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఒక ప్రాణాపాయ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో అలెక్స్ క్యారీ క్యాచ్ కోసం డైవ్ చేసిన సమయంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని రిబ్ కు తీవ్రంగా గాయం అయింది.
అలాగే, గ్రౌండ్ పై పడిపోయిన సమయంలో స్ప్లీన్ చీలిపోవడంతో అంతర్గత రక్తస్రావంతో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. వెంటనే అయ్యర్ ను సిడ్నీ హాస్పిటల్‌కు తరలించి, అక్కడ ఒక వారం పాటు ఐసీయూలో చికిత్స అందించారు.
చికిత్స అనంతరం చిన్న ప్రొసీజర్ చేసిన వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఆయన తిరిగి భారత్ చేరుకుని, ఇటీవల UGC పరీక్ష చేయించుకున్నారు. రెండు నెలల తర్వాత ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని వైద్య బృందం సూచించింది. ఈ పరీక్ష ఫలితాలు పాజిటివ్‌గా ఉంటేనే ఆయన మళ్లీ క్రికెట్ బ్యాట్ పట్టడానికి అనుమతి లభిస్తుంది.
పలు మీడియా రిపోర్టుల ప్రకారం.. అయ్యర్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌తో పాటు జనవరిలో జరిగే న్యూజిలాండ్ వన్డే సిరీస్‌నూ కోల్పోయే అవకాశం ఉంది. అంతేకాక, భారత్‌లో జరగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 మెగా టోర్నీలో కూడా ఆయన అందుబాటులో ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.