18 Sixes In One T20I Innings : టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 18 సిక్సర్లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించిన భారత సంతతి ప్లేయర్ సాహిల్ చౌహాన్. కేవలం 27 బంతుల్లోనే వేగవంతమైన సెంచరీ సాధించి చరిత్ర తిరగరాశాడు.
T20 World Record: ఒక్క ఇన్నింగ్స్‌లో 18 సిక్సర్లు.. ప్రపంచ రికార్డు సృష్టించిన భారత సంతతి క్రికెటర్!
అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డులు బద్దలవ్వడం సహజం. కానీ కొన్ని రికార్డులు మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటివరకు ఏ బ్యాట్స్‌మెన్ చేయని ఘనతను ఓ భారత సంతతి క్రికెటర్ సాధించాడు. ఒకే ఒక్క టీ20 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 18 సిక్సర్లు బాది, ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రపంచ రికార్డును ఇప్పటి వరకు మరే ఇతర బ్యాటర్ కూడా బద్దలు కొట్టలేకపోయారు.
కేవలం సిక్సర్ల వర్షం కురిపించడమే కాకుండా, అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా కూడా ఇతను రికార్డు సృష్టించాడు. ఆ విధ్వంసకర బ్యాటర్ మరెవరో కాదు, హర్యానా మూలాలు ఉన్న ఎస్టోనియా క్రికెటర్ సాహిల్ చౌహాన్.
భారతదేశంలో జన్మించిన సాహిల్ చౌహాన్, ఎస్టోనియా దేశం తరఫున ఆడుతూ ఈ అద్భుతమైన ఫీట్ సాధించాడు. ఈ సంచలన ఇన్నింగ్స్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసకుందాం.
25
సాహిల్ చౌహాన్ పేరిట అరుదైన ప్రపంచ రికార్డు
ప్రస్తుతం టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన ప్రపంచ రికార్డు సాహిల్ చౌహాన్ పేరు మీదే ఉంది. 2024 జూన్ 17న సైప్రస్ దేశంతో జరిగిన టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో సాహిల్ ఈ అద్భుతాన్నిచేశాడు. ఎస్టోనియా తరఫున బ్యాటింగ్ దిగిన సాహిల్, కేవలం 27 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను 41 బంతులు ఎదుర్కొని 144 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 351.21గా నమోదు కావడం విశేషం. ప్రపంచంలోని దిగ్గజ బ్యాటర్లు కూడా ఆశ్చర్యపోయేలా సాహిల్ బ్యాటింగ్ సాగింది.
35
ఒకే ఇన్నింగ్స్‌లో 18 సిక్సర్ల మోత
సాహిల్ చౌహాన్ ఆడిన ఈ ఇన్నింగ్స్ కేవలం పరుగుల వరద మాత్రమే కాదు, సిక్సర్ల సునామీ అని చెప్పవచ్చు. తన 144 పరుగుల ఇన్నింగ్స్‌లో ఏకంగా 18 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. ఒక టీ20 ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 18 సిక్సర్లు కొట్టిన ప్రపంచంలోనే మొట్టమొదటి, ఏకైక బ్యాట్స్‌మెన్‌గా సాహిల్ చౌహాన్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఉన్న రికార్డులన్నింటినీ తుడిచిపెడుతూ, బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ ఎపిస్కోపి లో జరిగింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సైప్రస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఎస్టోనియా ముందు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఛేజింగ్‌లో సాహిల్ చౌహాన్ చెలరేగి ఆడాడు. అతని విధ్వంసకర బ్యాటింగ్ కారణంగా ఎస్టోనియా జట్టు కేవలం 13 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. ఇంకా 42 బంతులు మిగిలి ఉండగానే ఎస్టోనియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన సాహిల్, ఎస్టోనియా క్రికెట్‌లో హీరోగా మారాడు.
55
హర్యానా నుంచి ఎస్టోనియా వరకు సాహిల్ చౌహాన్ ప్రయాణం
సాహిల్ చౌహాన్ అసలు సిసలైన భారతీయుడు. ఇతను హర్యానా రాష్ట్రంలోని పింజోర్ దగ్గర ఉన్న మనక్‌పూర్ దేవీలాల్ అనే గ్రామానికి చెందినవాడు. సాహిల్ 1992 ఫిబ్రవరి 19న జన్మించాడు. క్రికెట్‌లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి, జీవనోపాధి కోసం ఎస్టోనియా వెళ్లాడు. అక్కడ స్థిరపడి, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఒక సాధారణ భారతీయ కుర్రాడు విదేశీ గడ్డపై క్రికెట్ రికార్డులు సృష్టించడం నిజంగా గర్వించదగ్గ విషయం.
గూగుల్ సెర్చ్‌తో మారిన జీవితం
తన క్రికెట్ ప్రయాణం గురించి సాహిల్ చౌహాన్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. "మా మామయ్యకు ఎస్టోనియాలో ఒక చిన్న రెస్టారెంట్ ఉంది. అక్కడ పని చేయడం కోసమే నేను ఎస్టోనియా వచ్చాను. రెస్టారెంట్‌లో పని చేస్తున్నప్పుడు నాకు చాలా బోర్ కొట్టేది. దీంతో 2019లో ఇక్కడ క్రికెట్ ఎక్కడ ఆడుతారో అని గూగుల్‌లో వెతకడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు ఎస్టోనియా క్రికెట్ టీమ్ సమాచారం దొరికింది. వెంటనే వారికి ఫోన్ చేసి క్రికెట్ ఆడటం గురించి ఆడిగాను. వాళ్లు ఓకే చెప్పడంతో నేను వెళ్లి జాయిన్ అయ్యాను. అలా నా క్రికెట్ ప్రయాణం ఇక్కడ మొదలైంది" అని సాహిల్ తెలిపారు. ఇలా గూగుల్ సెర్చ్ ద్వారా మొదలైన ప్రయాణం, నేడు ప్రపంచ రికార్డు స్థాయికి చేరింది.