గంభీర్ ను సాగనంపి.. టీమిండియాను కాపాడండి మహా ప్రభో !

Published : Nov 24, 2025, 06:39 PM IST

Sack Gautam Gambhir: గువాహటి టెస్ట్‌లో సౌతాఫ్రికా భారీ ఆధిక్యం సాధించగా, భారత్ వైట్‌వాష్ భయంలోకి జారుకుంది. దీంతో ప్రయోగాలతో టీమిండియాను చెత్తగా మారుస్తున్నాడని గౌతమ్ గంభీర్, అతని కోచింగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

PREV
15
గువాహటి టెస్ట్‌లో సౌతాఫ్రికా ఆధిపత్యం.. టీమిండియాకు కష్టమే

గువాహటి మైదానంలో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ పూర్తిగా రక్షణాత్మక స్థితిలోకి జారుకుంది. మ్యాచ్ మూడో రోజు ముగిసే సమయానికి సౌతాఫ్రికా 288 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సొంతం చేసుకుని, ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 8 ఓవర్లలో 26 పరుగులతో వికెట్ నష్టపోకుండా నిలిచింది. మొత్తం ఆధిక్యం ఇప్పుడు 314 పరుగులు చేరింది. దీంతో ప్రోటీస్ టీమ్ కు ఈ టెస్ట్‌లో ఓటమి అనే మాట వినిపించడమే కష్టం.

ఇక భారత్‌కు మాత్రం స్వదేశంలో వరుసగా రెండోసారి టెస్ట్ సిరీస్ వైట్‌వాష్ ఎదురవుతుందనే భయం గట్టిగా ఉంది. గతేడాది న్యూజిలాండ్‌ చేతిలో 0-3 తేడాతో పరాభవం చెందిన టీమిండియా, ఈసారి సౌతాఫ్రికా చేతిలో 0-2 తేడాతో ఓటమికి చేరువైంది. పరిస్థితులు మార్చడానికి అద్భుతమైన ప్రదర్శన తప్ప భారత్‌కు మరే అవకాశం కనిపించడం లేదు. దీనికంతటికీ కారణం టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.

25
సౌతాఫ్రికా బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ అదరగొట్టింది

సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో దాదాపు రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేస్తూ 489 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ 93 పరుగులతో మెరిసి, తర్వాత బౌలింగ్‌లో 6/48తో భారత్‌ను కుప్పకూల్చాడు. సీనియర్ స్పిన్నర్ సైమన్ హార్మర్ (3/64), కేశవ్ మహరాజ్ (1/32) కీలక సమయంలో వికెట్లు తీసి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. ఫీల్డింగ్‌లోనూ సౌతాఫ్రికా అద్భుతం ప్రదర్శించింది. ఐడెన్ మార్క్రమ్ ఐదు క్యాచ్‌లు పట్టి భారత్‌కు షాక్ ఇచ్చాడు.

35
భారత్ బ్యాటింగ్‌లో మరోసారి వైఫల్యం

భారత్ తొలి ఇన్నింగ్స్ 201 పరుగులకే ముగిసింది. ఇక్కడే మ్యాచ్‌ మలుపు తిరిగింది. భారత జట్టులో యశస్వీ జైస్వాల్ 58 పరుగులు (97 బంతులు), వాషింగ్టన్ సుందర్ 48 (92 బంతులు) పరుగులతో టాప్ స్కోరర్లుగా ఉన్నారు.

ఇక మిగతా బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు. రాహుల్ (22), సాయి సుదర్శన్ (15), పంత్ (7), జడేజా (6)లు తమ వికెట్లను ఈజీగానే సమర్పించుకోవడంతో మొదటి సెషన్‌ నుంచే భారత్‌పై ఒత్తిడి పెరిగింది.

వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ జోడీ మాత్రమే కొద్ది సేపు క్రీజులో నిలిచింది. ఈ ఇద్దరూ ఎనిమిదో వికెట్‌కు 72 పరుగులు జోడించి జట్టు ప్రతిష్ఠను కాపాడారు. లేకపోతే భారత్ 150 పరుగులకే కుప్పకూలే పరిస్థితి ఉండేది.

45
గంభీర్‌పై పెరుగుతున్న ఒత్తిడి.. సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు

తొలి టెస్ట్‌లో 93 పరుగులకే ఆలౌటైన టీమిండియా రెండో టెస్ట్‌లో కూడా అదే బలహీనతను చూపడంతో అభిమానుల్లో అసహనం పెరిగింది. సోషల్ మీడియాలో ఇప్పటికే “గౌతమ్ గంభీర్‌ను కోచ్ పదవి నుంచి తొలగించాలి’’ అనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

రవిశాస్త్రి, అనిల్ కుంబ్లే వంటి మాజీ క్రికెటర్లు కూడా టీమిండియా తీసుకున్న వ్యూహాలను, బ్యాటింగ్ తీరు, ఆటగాళ్ల దృక్పథాన్ని తీవ్రంగా విమర్శించారు.

“122 పరుగులకే ఏడు వికెట్లు పడే విధమైన పిచ్ ఇది కాదు. భారత బ్యాటింగ్ చాల పేలవంగా ఉంది” అని రవిశాస్త్రి అన్నారు. అయితే వెంటనే మార్పులు చేసే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ వరకు గంభీర్ ను ప్రధాన కోచ్ గా కొనసాగించవచ్చని సమాచారం.

55
భారత్‌కు మిగిలిన అవకాశాలు ఏమిటి? ఓటమి నుంచి ఎలా తప్పించుకోవాలి?

మూడో రోజు ముగిసే సమయానికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 26/0తో నిలిచింది. నాల్గో రోజు సెషన్ మొత్తాన్ని బ్యాటింగ్ చేసి మరో 100 నుంచి 120 పరుగులు చేస్తే, భారత్‌ ముందు 420 నుంచి 450 పరుగుల భారీ లక్ష్యం చేరుతుంది. ః

ప్రస్తుత పరిస్థితుల్లో ఆ లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యం కాబట్టి, భారత్ వద్ద ఒక్క మార్గమే మిగిలింది. అదే, మిగిలిన రోజంతా బ్యాటింగ్ చేసి డ్రా కోసం పోరాటం చేయడం. అయితే ప్రస్తుత ఫామ్ చూస్తే భారత బ్యాటర్లు ఆ పని చేయగలరా? అనే ప్రశ్న అభిమానులను కలవరపెడుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories