
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కోసం అన్ని టీమ్స్ సిద్ధమవుతున్నాయి. అయితే, ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు ఫ్రాంచైజీలు భారీ మార్పులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ కావ్య పాప మరో సూపర్ ప్లాన్ వేసింది.
ఇప్పటికే రవీంద్ర జడేజా, సంజూ శాంసన్ లాంటి ప్రముఖ ఆటగాళ్ల ట్రేడ్ పుకార్లు వినిపిస్తుండగా, ఇప్పుడు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఐదు టైటిల్స్ అందించిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కూడా మరో ఫ్రాంచైజీ జెర్సీలో కనిపించవచ్చన్న వార్తలు క్రీడా ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) యాజమాన్యం రోహిత్ శర్మను తమ జట్టులోకి తెచ్చుకునేందుకు పెద్ద ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బదులుగా ఆస్ట్రేలియన్ పవర్ హిట్టర్ ట్రావిస్ హెడ్‌ను ముంబై ఇండియన్స్‌కు ఇచ్చే స్వాప్ డీల్‌పై చర్చలు జరుగుతున్నాయనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రోహిత్ శర్మ 2013లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి జట్టును ఐదు సార్లు ఛాంపియన్ గా నిలబెట్టాడు. 2013, 2015, 2017, 2019, 2020లో ఐపీఎల్ విజేతగా నిలిచి ముంబై చరిత్ర సృష్టించింది. సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, మహేలా జయవర్ధనే వంటి దిగ్గజాలు సాధించలేని రికార్డును రోహిత్ సొంతం చేసుకున్నాడు.
అయితే, 2023 తర్వాత ఫ్రాంచైజీ మార్పులు చోటుచేసుకున్నాయి. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ చేపట్టడంతో రోహిత్ శర్మను పక్కన పెట్టినట్టు అభిమానులు భావించారు. కొన్నిసార్లు అతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా మాత్రమే వాడుకోవడం అభిమానుల్లో అసంతృప్తిని పెంచింది. దీంతో రోహిత్ ఫ్రాంచైజీ మారాలి అంటూ సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చలు నడిచాయి.
సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్ ఈ సారి టైటిల్ దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆమె ప్లాన్ ప్రకారం, ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్‌ను ముంబైకి ఇచ్చి, బదులుగా రోహిత్ శర్మను ట్రేడింగ్ ద్వారా హైదరాబాద్ జట్టులోకి తీసుకురావాలని భావిస్తోంది.
ట్రావిస్ హెడ్ 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్‌పై సూపర్ ఇన్నింగ్స్ ఆడి క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ టీమ్ తరపున కూడా దూకుడుగా ఆడుతూ పవర్‌ప్లేలో ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు. అయినప్పటికీ, అనుభవజ్ఞుడైన రోహిత్ శర్మతో జట్టుకు బ్యాలెన్స్ వస్తుందని యాజమాన్యం నమ్ముతున్నట్లు సమాచారం.
రోహిత్ శర్మకు హైదరాబాద్ జట్టుతో అనుబంధం కొత్తది కాదు. 2008లో ప్రారంభమైన ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడాడు. ఆ జట్టు 2009లో ఛాంపియన్‌గా నిలిచినప్పుడు రోహిత్ ప్రధాన పాత్ర పోషించాడు. ఇప్పుడు మళ్లీ అదే నగరానికి తిరిగి వస్తే అది ఒక ఎమోషనల్ రీయూనియన్ అవుతుంది.
అదే కాకుండా, రోహిత్ కు తెలుగుతో సంబంధం కలిగి ఉండటంతో హైదరాబాద్ రోహిత్‌కు సరైన గమ్యం అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఆయన అభిషేక్ శర్మతో ఓపెనింగ్ చేయడం ఐపీఎల్‌లో కొత్త రికార్డులు సృష్టిస్తుందన్న ఉత్సాహం అభిమానుల్లో కనిపిస్తోంది.
‘ఇండియన్ క్రికెట్’ అనే X (ట్విట్టర్) అకౌంట్‌లో వచ్చిన ఒక పోస్ట్ ఈ ట్రేడ్ వార్తల్లో మరింత హీట్ పెంచాయి. రోహిత్ శర్మ కోసం ట్రావిస్ హెడ్ ను ముంబై కి హైదరాబాద్ ఆఫర్ చేసింది అనే ట్వీట్ కేవలం గంటల్లో లక్షల వ్యూస్ సాధించింది. హైదరాబాద్ అభిమానుల కామెంట్స్ ఇప్పుడు రచ్చ లేపుతున్నాయి.
మరోవైపు, ముంబై అభిమానులు మాత్రం ఈ వార్తను ఓ షాక్ గా తీసుకుంటున్నారు. “ముంబై నుంచి రోహిత్ వెళ్లిపోతే జట్టు కూలిపోతుంది” అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు జట్లు ఈ రూమర్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే డిసెంబర్‌లో జరగనున్న ఐపీఎల్ మినీ వేలం ముందు ట్రేడ్ విండో ఓపెన్ కానుంది. అప్పటికి ఈ స్వాప్ నిజమా కేవలం ఊహగానమా అన్నది స్పష్టమవుతుంది.
ఏదేమైనప్పటికీ, రోహిత్ శర్మ–ట్రావిస్ హెడ్ ఎక్స్ఛేంజ్ వార్తలు ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే హాట్ టాపిక్‌గా మారి, అభిమానుల్లో రచ్చ రేపుతున్నాయి. రోహిత్ శర్మ హైదరాబాద్‌లోకి వస్తే అది కేవలం ఒక ట్రేడ్ కాదు.. ఐపీఎల్ చరిత్రలో కొత్త అధ్యాయం అవుతుంది.