Published : Nov 03, 2025, 05:23 AM ISTUpdated : Nov 03, 2025, 05:29 AM IST
Rohit Sharma Emotional : నవీ ముంబయిలో జరిగిన మహిళల ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచి తొలి టైటిల్ సాధించింది. ఈ సమయంలో టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న క్షణం వైరల్ గా మారింది.
నవీ ముంబయిలోని డివై పాటిల్ స్టేడియంలో ఆదివారం భారత్ చరిత్ర సృష్టించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళా జట్టు 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి, తమ తొలి వన్డే వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజీలాండ్ తర్వాత ఈ పోటీల్లో ప్రపంచ ఛాంపియన్‌ల జాబితాలో చేరింది.
26
రోహిత్ శర్మ భావోద్వేగం.. వీడియో వైరల్
భారత్ విజయం సాధించిన వెంటనే కెమెరాలు వీఐపీ బాక్స్ వైపు తిరిగాయి. అక్కడ భారత జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ కళ్లలో ఆనంద భాష్పాలు కనిపించాయి. 2023 పురుషుల ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి అనంతరం, మహిళల విజయం రోహిత్‌కు ప్రత్యేకమైన క్షణంగా నిలిచింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఐసీసీ ఛానల్ తో హిట్ మ్యాన్ మాట్లాడుతూ.. “గత 15 ఏళ్లుగా మేము ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాం. మహిళా జట్టు ఈసారి ఆ సరిహద్దు దాటుతుందని ఆశిస్తున్నా” అని అన్నారు. రోహిత్ అన్నట్టుగానే ఆ మాటలు నిజమయ్యాయి. భారత్ ప్రపంచ ఛాంపియన్ గా మారింది.
2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత పురుషుల జట్టు ఓటమి పాలై, ఆయన కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం దేశాన్ని కదిలించింది. అదే రోహిత్, 2025 మహిళా ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు విజయం చూసి మళ్లీ భావోద్వేగానికి లోనయ్యారు.. కానీ ఈసారి ఆనంద కన్నీళ్లు. ఓటమి బాధ నుంచి విజయ గర్వం వరకు భారత క్రికెట్ ప్రయాణం ఇది. రోహిత్ కళ్లలో కనిపించిన గర్వం, మహిళల శక్తి పట్ల గౌరవం, భారత క్రికెట్‌కి నూతన అధ్యాయాన్ని సూచించింది. ఓటమి నుంచి ప్రేరణగా మారిన ఈ ఘట్టం, దేశం మొత్తం గుండెల్లో నిలిచిపోయే స్ఫూర్తిదాయక క్షణంగా మారింది.
36
షఫాలి వర్మ దూకుడు, దీప్తి శర్మ మాయాజాలం
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ బ్యాటింగ్ ప్రారంభం నుంచే దూకుడుగా సాగింది. ఓపెనర్లు స్మృతి మంధాన (45), షఫాలి వర్మ (87) 104 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. షఫాలి 78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో తన కెరీర్‌లోనే అత్యధిక స్కోరు సాధించింది.
జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ త్వరగా ఔటైనా, దీప్తి శర్మ (58) ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది. చివర్లో రిచా ఘోష్ (34 బంతుల్లో 24) వేగవంతమైన ఇన్నింగ్స్‌తో భారత్‌ను 50 ఓవర్లలో 298/7 పరుగులు చేసింది. ఈ స్కోరు మహిళల ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలో రెండవ అత్యధికం కావడం విశేషం.
వోల్వార్డ్ సెంచరీ వృథా.. ఐదు వికెట్లతో సత్తా చాటిన దీప్తి శర్మ
దక్షిణాఫ్రికా 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ప్రారంభంలో తాజ్మిన్ బ్రిట్స్ రన్ అవుట్ రూపంలో భారత్‌కు తొలి బ్రేక్ ఇచ్చింది. అయినా కెప్టెన్ లారా వోల్వార్డ్ అద్భుత సెంచరీతో (101 పరుగులు) భారత్ కు టెన్షన్ పెట్టారు. ఆమెతో పాటు సునే లూస్ సాగే జోడీ భారత్‌కు ఒత్తిడి తెచ్చినా, షఫాలి వర్మ రెండు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పింది.
దీప్తి శర్మ తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుతంగా రాణించింది. ఆమె 5 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్ లో 58 పరుగుల నాక్ ఆడారు. బౌలింగ్ లో కేవలం 39 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టారు. చివర్లో నడీన్ డి క్లెర్క్‌ను ఔట్ చేసి విజయం ఖాయం చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ చివరి క్యాచ్ పట్టగానే, స్టేడియం అంతా సంబరాల్లో మునిగిపోయింది.
56
స్టేడియంకు దిగ్గజ ప్లేయర్లు
ఈ చారిత్రాత్మక విజయాన్ని చూసేందుకు స్టేడియంలో సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సునీల్ గవాస్కర్ లతో పాటు జై షా, నీతా అంబానీ వంటి ప్రముఖులు హాజరయ్యారు. రోహిత్ శర్మ తన భార్యతో పాటు కలిసి మ్యాచ్ చూశారు.
విజయానంతరం విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “ఇది భారత మహిళా క్రికెట్ చరిత్రలో గర్వకారణమైన రోజు. హర్మన్, జట్టుకు అభినందనలు. ఈ విజయం భవిష్యత్తు తరాలకు ప్రేరణగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.
66
భారత మహిళా క్రికెట్‌కు కొత్త అధ్యాయం
2005, 2017ల్లో ఫైనల్లో ఓటమి చవిచూసిన భారత్‌కు, ఈ విజయం చరిత్రాత్మకమైన మలుపుగా చెప్పవచ్చు. 2025 ప్రపంచకప్‌తో భారత మహిళా జట్టు ఎట్టకేలకు తమ కలను సాకారం చేసుకుంది. షఫాలి, దీప్తి, హర్మన్‌ప్రీత్ వంటి స్టార్ల ప్రదర్శన భారత మహిళా క్రికెట్‌ను కొత్త దిశలోకి తీసుకెళ్లింది. డివై పాటిల్ స్టేడియంలో భారత్ ఐసీసీ ట్రోఫీ గెలుచుకోవడమే కాదు.. కోట్లాది భారత అభిమానుల మనసుల్లో స్ఫూర్తి కాంతిని వెలిగించింది.