రిచా ఘోష్ : భారత్ ప్రపంచ కప్పు గెలవడానికి కారణం ఈమెనే !

Published : Nov 03, 2025, 04:38 AM IST

Richa Ghosh : రిచా ఘోష్ దూకుడైన బ్యాటింగ్‌తో భారత మహిళా జట్టు తొలి వన్డే ప్రపంచ కప్ గెలుపులో కీలక పాత్ర పోషించింది. ఆమె శక్తివంతమైన ఇన్నింగ్స్‌లు జట్టుకు విజయం తీసుకువచ్చాయి.

PREV
16
రిచా ఘోష్ చరిత్రాత్మక ప్రదర్శన

భారత మహిళా క్రికెట్ జట్టు 2025 వన్డే ప్రపంచ కప్‌లో తొలిసారి విజేతగా నిలవడానికి రిచా ఘోష్ అద్భుత ప్రదర్శన కూడా ప్రధాన కారణమైంది. దూకుడైన బ్యాటింగ్, ఒత్తిడిలోనూ ధైర్యంగా ఆడే నైపుణ్యం, కీలక సందర్భాల్లో మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఇన్నింగ్స్‌లు ఆమెను ఈ టోర్నమెంట్‌లో ప్రత్యేకంగా నిలబెట్టాయి.

భారత జట్టులో రిచా ఘోష్ అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్లలో ఒకరిగా నిలిచింది. ఒత్తిడిని తట్టుకుని సాహసోపేతంగా ఆడిన ఆమె ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకున్నాయి.

26
ఫైనల్‌లో మ్యాచ్ మలుపు తిప్పిన ఇన్నింగ్స్

నవీ ముంబయిలో జరిగిన మహిళా ప్రపంచ కప్ 2025 ఫైనల్‌లో దక్షిణాఫ్రికా పై రిచా ఘోష్ ధనాధన్ ఇన్నింగ్స్ ను ఆడారు. 24 బంతుల్లో 34 పరుగులు చేసింది. 141.67 స్ట్రైక్‌రేట్‌తో ఆడిన ఆమె ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. ముఖ్యంగా నడీన్ డి క్లర్క్, మరిజానే క్యాప్‌ల బౌలింగ్‌ లో బాదిన సిక్స్‌లు భారత ఇన్నింగ్స్‌కు వేగం తెచ్చాయి. ఆ దూకుడు వల్లే భారత్ 298/7 భారీ స్కోరును సాధించి, చివరికి టైటిల్‌ను గెలుచుకుంది.

36
విశాఖపట్నంలో రికార్డు బ్రేక్ ఇన్నింగ్స్ ఆడిన రిచా ఘోష్

అక్టోబర్ 9న విశాఖపట్నంలో జరిగిన దక్షిణాఫ్రికాపై లీగ్ మ్యాచ్‌లో రిచా ఘోష్ 94 పరుగులు (77 బంతులు) చేసి జట్టును కాపాడింది. భారత్ 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సమయంలో ఎనిమిదో స్థానంలో వచ్చిన రిచా ఘోష్ అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆడారు. 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో దూకుడుగా ఆడారు. దీంతో 251 పరుగుల పోటీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఇది మహిళల వన్డేల్లో నంబర్‌ 8 లేదా దానికంటే దిగువ స్థానంలో వచ్చిన బ్యాటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది.

46
ప్రపంచ కప్‌లో రికార్డుల మోత మోగించిన రిచా ఘోష్

మొత్తం 2025 వరల్డ్ కప్‌లో రిచా ఘోష్ 12 సిక్స్‌లు బాది, ఒక్క టోర్నమెంట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారత ఆటగాళ్లలో ఒకరిగా నిలిచింది. ఈ రికార్డుతో ఆమె హార్మన్‌ప్రీత్ కౌర్ రికార్డును అధిగమించింది. అలాగే తక్కువ బంతుల్లోనే 1,000 వన్డే పరుగులు చేసిన వేగవంతమైన భారత మహిళా క్రికెటర్‌గా నిలిచి కొత్త రికార్డు సృష్టించింది. టోర్నమెంట్ మొత్తం ఆమె స్ట్రైక్‌రేట్ 133కు పైగా ఉండి, జట్టు చివరి ఓవర్లలో వేగవంతమైన పరుగులు చేయడంలో కీలకమైంది. ఈ టోర్నీలో అత్యధిక స్ట్రైక్ రేటు కలిగి ప్లేయర్ రిచా ఘోష్ కావడం విశేషం.

56
వికెట్ కీపర్ గా, ఫినిషర్‌గా రిచా ఘోష్ సూపర్ షో

రిచా ఘోష్ భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఆడుతూ, ఫినిషర్ పాత్రను సమర్థంగా పోషించింది. ఇన్నింగ్స్ చివరలో రన్‌రేట్ పెంచడం, ఒత్తిడిలో ఆడటం, చివరి ఓవర్లలో సిక్స్‌లు కొట్టడం వంటి అంశాల్లో ఆమె నైపుణ్యం జట్టుకు బలాన్నిచ్చింది. బ్యాటింగ్‌తో పాటు వికెట్‌కీపింగ్‌లో కూడా చురుకుదనం చూపించి జట్టుకు మద్దతు ఇచ్చింది. ఆమె దూకుడు శైలి ప్రత్యర్థి బౌలర్లపై మానసిక ఒత్తిడి సృష్టించింది.

66
భారత విజయానికి మూలస్తంభంగా నిలిచిన రిచా ఘోష్

రిచా ఘోష్ 94 పరుగుల రికార్డు ఇన్నింగ్స్, ఫైనల్‌లో చేసిన 34 పరుగుల ధనాధన్ నాక్ లు, వికెట్ల వెనుక సూపర్ షో ప్రదర్శనలు భారత జట్టుకు ప్రాణం పోశాయి. తుది మ్యాచ్‌లో ఆమె వేగవంతమైన బ్యాటింగ్ లేకపోతే భారత స్కోరు తక్కువకే పరిమితం అయ్యేది. అదే జరిగి ఉంటే ఫలితం మరోలా వచ్చివుండేది కావచ్చు. భారత మహిళల జట్టు తొలిసారిగా ప్రపంచ కప్ ను గెలుచుకోవడం లో రిచా ఘోష్ దూకుడు, ధైర్యం, తెలివితో ఆడిన ఇన్నింగ్స్‌లు కూడా కీలక పాత్ర పోషించాయి.

రిచా ఘోష్ 2025 మహిళల వరల్డ్ కప్‌లో భారత్ విజయానికి ప్రేరణగా నిలిచింది. ఒత్తిడి సమయంలో ధనాధన్ ఆటతో సిక్స్‌లు కొట్టగల శక్తి, మ్యాచ్‌ను తన దిశలో తిప్పే సామర్థ్యం ఆమెను ఈ టోర్నమెంట్‌ స్టార్‌గా నిలబెట్టాయి.

Read more Photos on
click me!

Recommended Stories