Rajasthan Royals : ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు 1.63 బిలియన్ డాలర్లకు అమ్ముడై, ఒక బిలియన్ డాలర్ల విలువను దాటిన మొదటి ఫ్రాంచైజీగా చరిత్ర సృష్టించింది.
రాజస్థాన్ రాయల్స్ కొత్త బాస్ ఇతనే.. వాల్‌మార్ట్ వారసులతో కలిసి ఐపీఎల్ టీమ్ కొనేశారు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వాణిజ్య విలువ ఆకాశమే హద్దుగా పెరుగుతోంది. దీనికి తాజా నిదర్శనం రాజస్థాన్ రాయల్స్ (RR) జట్టు పై జరిగిన భారీ డీల్. 2008లో జరిగిన మొట్టమొదటి ఐపీఎల్ సీజన్ విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్, ఇప్పుడు ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముడైన మొదటి ఐపీఎల్ ఫ్రాంచైజీగా రికార్డు సృష్టించింది.
క్రిక్ బజ్ రిపోర్ట్ ప్రకారం, అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కల్ సోమని నేతృత్వంలోని కన్సార్టియం రాజస్థాన్ రాయల్స్‌లో 100 శాతం యాజమాన్య హక్కులను సొంతం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ సుమారు 1.63 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు ₹13,000 కోట్లకు పైగా) ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఈ జట్టు యాజమాన్యం యూకేకు చెందిన మనోజ్ బదాలే (ఎమర్జింగ్ మీడియా) చేతుల్లో ఉంది. 2026 ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత కల్ సోమని అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు.
24
ఎవరీ కల్ సోమని? భారీ బ్యాకింగ్ వెనుక ఉన్నది వీరే..
అమెరికాలోని అరిజోనా (స్కాట్స్‌డేల్) కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న భారత సంతతి పారిశ్రామికవేత్త కల్ సోమని రాజస్థాన్ రాయల్స్‌కు కొత్త కాదు. ఆయన 2021లోనే ఈ జట్టులో కొంత వాటాను కొనుగోలు చేసి భాగస్వామిగా చేరారు. ఇప్పుడు ఏకంగా పూర్తి యాజమాన్యాన్ని దక్కించుకున్నారు. ఈ భారీ డీల్ వెనుక అమెరికా క్రీడా, వ్యాపార రంగంలోని దిగ్గజాల సపోర్ట్ ఉంది. ప్రపంచ ప్రఖ్యాత రిటైల్ చైన్ 'వాల్‌మార్ట్' (Walmart) వారసుడు, ఎన్ఎఫ్ఎల్ (NFL) జట్టు 'డెన్వర్ బ్రాంకోస్' యజమాని రాబ్ వాల్టన్ ఈ కన్సార్టియంలో భాగస్వామిగా ఉన్నారు. అలాగే, ఎన్ఎఫ్ఎల్ జట్టు 'డెట్రాయిట్ లయన్స్' యజమానులైన హాంప్ కుటుంబం కూడా సోమనికి సపోర్టుగా నిలిచింది. షీలా ఫోర్డ్ హాంప్ నేతృత్వంలోని ఈ కుటుంబానికి ఫోర్డ్ మోటార్ కంపెనీతో బలమైన సంబంధాలు ఉన్నాయి.
34
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త బెంచ్‌మార్క్
రాజస్థాన్ రాయల్స్ సాధించిన ఈ ఫీట్ ఐపీఎల్ ప్రపంచంలోనే ఒక సంచలనం. వాస్తవానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) భారీ ధరకు అమ్ముడవుతుందని అందరూ ఊహించారు. కానీ, రాజస్థాన్ రాయల్స్ అందరికంటే ముందే ఈ మైలురాయిని చేరుకుంది. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు మనోజ్ బదాలే నేతృత్వంలోని ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ ఈ జట్టును కేవలం 67 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో ఇది లీగ్‌లోనే అతి తక్కువ ధర కలిగిన జట్టు. ఇప్పుడు 1.63 బిలియన్ డాలర్లకు చేరడం అంటే, పెట్టుబడిపై అద్భుతమైన లాభాలను ఆర్జించినట్లు లెక్క.
ఒప్పందంపై సంతకాలు జరిగినప్పటికీ, మైదానంలో జట్టు నిర్వహణలో వెంటనే మార్పులు ఉండవు. 2026 ఐపీఎల్ సీజన్ ముగిసే వరకు ప్రస్తుత మేనేజ్మెంట్ పర్యవేక్షణలోనే జట్టు కొనసాగుతుంది. 19వ సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ ఇప్పటికే సిద్ధమవుతోంది. యువ ఆటగాడు రియాన్ పరాగ్‌ను జట్టు కెప్టెన్‌గా నియమించగా, గాయపడిన సామ్ కర్రన్ స్థానంలో శ్రీలంక ఆటగాడు దసున్ షనకను తీసుకుంది.
రాజస్థాన్ రాయల్స్ 1.63 బిలియన్ డాలర్ల మార్కును సెట్ చేయడంతో, ఇప్పుడు అందరి దృష్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై పడింది. మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం, ఆర్సీబీ విక్రయ ప్రక్రియ గనుక మొదలైతే, ఆ జట్టు విలువ ఏకంగా 2 బిలియన్ డాలర్లను (సుమారు ₹16,000 కోట్లకు పైగా) దాటే అవకాశం ఉంది. ఐపీఎల్ అనేది ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన లీగ్‌లలో ఒకటిగా, అమెరికాకు చెందిన ఎన్ఎఫ్ఎల్ (NFL) తర్వాత రెండవ స్థానంలో నిలిచిందని ఈ ఒప్పందం నిరూపించింది.