Virat Kohli : అహంకారం కాదురా.. అది ఆటిట్యూడ్.. రహానే షాకింగ్ కామెంట్స్

Published : Jan 13, 2026, 05:02 PM IST

Virat Kohli : కోహ్లీ మౌనం వెనుక ఉన్న అసలు కారణాన్ని రహానే బయటపెట్టారు. సచిన్ రికార్డులు, 2027 వరల్డ్ కప్‌పై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక బ్యాటర్ అవుటై పెవిలియన్‌కు వెళ్తున్నప్పుడు ప్రేక్షకులు పెద్దగా అరవడం తనకు నచ్చదని తెలిపాడు.

PREV
16
కోహ్లీ మౌనం వెనుక అసలు కథ చెప్పిన రహానే !

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశారు. 91 బంతుల్లో 93 పరుగులు సాధించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కుమార సంగక్కరను అధిగమించి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ మాత్రమే కోహ్లీ కంటే ముందున్నారు. ఈ నేపథ్యంలో అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్ కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

26
కోహ్లీ అహంకారి కాదు.. అదొక సాధన: అజింక్య రహానే

చాలా ఏళ్లుగా డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకున్న అజింక్య రహానే, కోహ్లీ ప్రవర్తనపై వస్తున్న అపోహలకు తెరదించారు. బయట ఉండే వారికి కోహ్లీ అహంకారిగా కనిపిస్తారని, కానీ అది నిజం కాదని రహానే స్పష్టం చేశారు. "మేము కోహ్లీ ప్యాషన్ గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటాం. కానీ నాకు అతనిలో నచ్చేది అతని ఆటిట్యూడ్. ఎప్పుడూ నేర్చుకోవాలనే తపన, వదులుకోకూడదనే పట్టుదల అతనిలో ఉంటాయి. ప్రజలు కోహ్లీని అహంకారి అనుకుంటారు, కానీ అతను మ్యాచ్‌కు ముందు తన జోన్ లోకి వెళ్లిపోతాడు" అని రహానే తెలిపారు.

మ్యాచ్‌కు రెండు రోజుల ముందు నుంచే కోహ్లీ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరని రహానే చెప్పారు. "అతను ఎప్పుడూ ఎయిర్‌పాడ్స్ పెట్టుకుని, తనకు నచ్చిన పాటలు వింటూ తన లోకంలో ఉంటాడు. మొదట్లో సహచర ఆటగాళ్లకు ఇది అర్థం కాలేదు. కానీ అతను ఆ విధంగా మ్యాచ్ కోసం సిద్ధమవుతాడని తర్వాత తెలిసింది. అది ఈగో కాదు, అది అతని ప్రిపరేషన్ విధానం" అని రహానే వివరించారు.

36
చిన్ననాటి స్వేచ్ఛతో ఆడుతున్నాడు : రవిచంద్రన్ అశ్విన్

మాజీ కెప్టెన్ ఫామ్ గురించి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విశ్లేషించారు. కోహ్లీ సాంకేతికంగా ఎలాంటి మార్పులు చేసుకోలేదని, కేవలం మానసికంగా బలంగా ఉన్నారని అశ్విన్ అభిప్రాయపడ్డారు. "అతను తన చిన్నతనంలో క్రికెట్‌ను ఎంత ఆనందంగా ఆడేవారో, ఇప్పుడు అదే స్వేచ్ఛతో ఆడుతున్నారు. దానికి తోడు ఇన్నేళ్ల అనుభవం జత కలిసింది. ప్రస్తుతం అతను దేని గురించి ఆలోచించడం లేదు, కేవలం ఆటను ఆస్వాదిస్తున్నాడు" అని అశ్విన్ తన యూట్యూబ్ షోలో పేర్కొన్నారు. 2025 అక్టోబర్ నుంచి కాంపిటేటివ్ క్రికెట్‌లోకి వచ్చిన తర్వాత కోహ్లీ ఏడు మ్యాచ్‌ల్లో 93.8 సగటుతో 463 పరుగులు చేయడం విశేషం.

46
కొత్త కోహ్లీ : దూకుడుగా బ్యాటింగ్.. వరల్డ్ కప్ 2027 టార్గెట్

2025 ఐపీఎల్ మధ్యలో టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ, ఇప్పుడు వన్డేలపై పూర్తిగా దృష్టి సారించారు. తన బ్యాటింగ్ శైలిని మార్చుకున్నానని, ఇన్నింగ్స్ ఆరంభంలోనే దూకుడుగా ఆడేందుకు నిర్ణయించుకున్నానని కోహ్లీ తెలిపారు.

"నేను నంబర్ 3లో బ్యాటింగ్ చేస్తాను. పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పుడు, ఆగి ఆడటం కంటే కౌంటర్ అటాక్ చేయడం మేలని భావిస్తున్నాను. తొలి 20 బంతుల్లోనే ఒత్తిడిని ప్రత్యర్థిపైకి నెట్టేయాలని చూస్తున్నాను" అని కోహ్లీ వివరించారు. 37 ఏళ్ల కోహ్లీ, 2027 వన్డే వరల్డ్ కప్ ఆడటమే తన లక్ష్యమని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

56
సచిన్ రికార్డులపై కోహ్లీ సమాధానం ఇదే

28,000 పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా (624 ఇన్నింగ్స్‌లలో) అందుకున్న కోహ్లీ, సచిన్ రికార్డులను బద్దలు కొట్టడంపై స్పందించారు. "నిజాయితీగా చెప్పాలంటే, నేను మైలురాళ్ల గురించి అస్సలు ఆలోచించడం లేదు. దేవుడు నాకు అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చాడు. నా ప్రయాణం పట్ల నాకు ఎంతో కృతజ్ఞత ఉంది. ఒకవేళ మేము మొదట బ్యాటింగ్ చేసి ఉంటే, నేను ఇంకా వేగంగా ఆడేవాడిని. రికార్డుల కంటే జట్టును గెలిపించడమే ముఖ్యం" అని కోహ్లీ స్పష్టం చేశారు.

66
ఆ సమయంలో చాలా బాధగా అనిపిస్తుంది: కోహ్లీ ఆవేదన

రోహిత్ శర్మ అవుటైనప్పుడు కోహ్లీ బ్యాటింగ్‌కు వస్తుంటే స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. దీనిపై కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశారు. "నిజం చెప్పాలంటే, ఒక బ్యాటర్ అవుటై పెవిలియన్‌కు వెళ్తున్నప్పుడు ప్రేక్షకులు అలా అరవడం నాకు నచ్చదు. ధోని విషయంలో కూడా ఇది చాలాసార్లు జరిగింది. అవుటైన ఆటగాడికి అది మంచి ఫీలింగ్ ఇవ్వదు. అందుకే నాకు అది ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే, అభిమానుల ఉత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను" అని కోహ్లీ తన హుందాతనాన్ని చాటుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories