Virat Kohli : న్యూజిలాండ్‌పై విరాట్ కోహ్లీ మరో పరుగు చేస్తే సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ రికార్డు బద్దలు కానుంది. రెండో వన్డేలో కింగ్ కోహ్లీ ఈ అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యాడు.
రికార్డుల రారాజు విరాట్.. సచిన్‌ను దాటేందుకు మరో రన్ చాలు
టీమిండియా రన్ మెషీన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నారు. మైదానంలో పరుగుల వరద పారిస్తూ, పాత రికార్డులను చెరిపేస్తూ కొత్త చరిత్రను లిఖిస్తున్నారు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశారు.
ఈ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించడమే కాకుండా, కోహ్లీ వ్యక్తిగతంగా అనేక అరుదైన మైలురాళ్లను అందుకున్నారు. ఇప్పుడు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఒక భారీ రికార్డును బద్దలు కొట్టడానికి విరాట్ కోహ్లీ కేవలం ఒక్క పరుగు దూరంలో నిలిచారు. జనవరి 14న జరగబోయే రెండో వన్డేలో ఈ అద్భుత రికార్డు నమోదుకానుంది.
25
సచిన్ రికార్డుకు ఎసరు.. ఒక్క పరుగుతో నంబర్ 1
వన్డే క్రికెట్‌లో న్యూజిలాండ్ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశారు. కింగ్ కోహ్లీ ఇప్పటివరకు కివీస్‌పై ఆడిన 34 మ్యాచ్‌లలో (34 ఇన్నింగ్స్‌లు) ఏకంగా 56.89 సగటుతో 1750 పరుగులు సాధించారు. ఇందులో 6 సెంచరీలు, 10 అర్ధసెంచరీలు ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ కూడా తన కెరీర్‌లో న్యూజిలాండ్‌పై మొత్తం 1750 పరుగులు చేశారు.
ప్రస్తుతం వీరిద్దరూ ఒకే స్కోరు వద్ద సమానంగా ఉన్నారు. జనవరి 14న జరగనున్న రెండో వన్డే మ్యాచ్‌లో కోహ్లీ ఒక్క పరుగు చేస్తే చాలు, సచిన్ రికార్డు బద్దలవుతుంది. న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా కోహ్లీ నంబర్ 1 స్థానానికి చేరుకుంటారు.
35
కోహ్లీ నమ్మశక్యం కాని ఫామ్.. వరుసగా 5 హాఫ్ సెంచరీలు
విరాట్ కోహ్లీ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే బౌలర్లకు వెన్నులో వణుకు పుట్టాల్సిందే. గత 5 వన్డే మ్యాచ్‌లలో కోహ్లీ వరుసగా 5 హాఫ్ సెంచరీలు సాధించడం విశేషం. ఆస్ట్రేలియాపై జరిగిన చివరి వన్డేలో అర్ధసెంచరీతో మొదలైన ఈ జోరు, ఆ తర్వాత దక్షిణాఫ్రికాపై జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కొనసాగింది.
అక్కడ మొదటి రెండు మ్యాచ్‌లలో సెంచరీలు, ఆ తర్వాత అర్ధసెంచరీ సాధించారు. ఇప్పుడు న్యూజిలాండ్‌పై జరిగిన తొలి వన్డేలోనూ 93 పరుగులతో రాణించారు. రాబోయే వన్డే ప్రపంచ కప్‌కు తాను ఎంత బలంగా సిద్ధమవుతున్నాడో కోహ్లీ తన బ్యాట్‌తోనే సమాధానం చెబుతున్నారు.
వడోదరలోని కోటంబి స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ 91 బంతుల్లో 93 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కేవలం 7 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ, ఆయన ఇన్నింగ్స్ భారత జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరో అరుదైన ఘనతను కూడా సాధించారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 28,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచారు. కేవలం 624 ఇన్నింగ్స్‌లలోనే ఈ మైలురాయిని దాటి సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టారు. ప్రస్తుతం 28,017 పరుగులతో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా సచిన్ తర్వాత కోహ్లీ నిలిచారు. సంగక్కర రికార్డును ఆయన అధిగమించారు.
55
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులపై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనకు గాను కోహ్లీకి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది అతనికి 45వ అవార్డు. అయితే, మ్యాచ్ అనంతరం అవార్డుల సంఖ్య గురించి ప్రశ్నించగా కోహ్లీ నవ్వుతూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. "నాకు ఎన్ని అవార్డులు వచ్చాయో నేను లెక్కపెట్టుకోను. వాటన్నింటినీ ఇంటికి పంపిస్తాను. మా అమ్మ వాటిని భద్రపరచడానికి ఇష్టపడుతుంది" అని విరాట్ పేర్కొన్నారు.
రికార్డుల కంటే జట్టుకు విజయాలు అందించడమే తనకు ముఖ్యమని, జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిలబడి ఆడటమే తనకు సంతృప్తినిస్తుందని కోహ్లీ తెలిపారు. అభిమానుల ముఖాల్లో ఆనందం చూడటమే తనకు నిజమైన ప్రేరణ అని, అదే తనను ఆట పట్ల మక్కువతో ఉంచుతుందని ఆయన పేర్కొన్నారు.